Godawari Eblu Feo : గోదావరి ఎబ్లూ ఫియో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. తక్కువ ధరకే క్రేజీ ఫీచర్స్!
22 August 2023, 17:06 IST
- Godawari Eblu Feo : గోదావరి ఎబ్లూ ఫియో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయ్యింది. ఈ ఈ-స్కూటర్లో తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి.
గోదావరి ఎబ్లూ ఫియో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..
Godawari Eblu Feo : దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరో సంస్థ సిద్ధమైంది. గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్.. ఓ కొత్త ఎలక్ట్రిక్ 2 వీలర్‌ను లాంచ్ చేసింది. దీని పేరు గోదావరి ఎలక్ట్రిక్ ఎబ్లూ ఫియో. ఈ ఈ- స్కూటర్ ఎక్స్‌షోరూం ధర రూ. 99,999. ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఫిచర్స్ ఇవే..
కంపెనీకి చెందిన రాయ్‌పూర్ ఫ్యాక్టరీలో ఈ గోదావరి ఎలక్ట్రిక్ ఎబ్లూ ఫియో తయారవుతుంది. కేవలం ఒకటే వేరియంట్‌తో ఇది మార్కెట్లోకి అడుగుపెట్టింది. డీసెంట్ పర్ఫార్మెన్స్, మంచి సేఫ్టీ ఫీచర్స్‌తో కుటుంబసభ్యుల ప్రయాణాలకు ఉపయోగపడే విధంగా ఈ మోడల్‌ను రూపొందించింది సంస్థ.
"ఎబ్లూ ఫియో మా అంచనాలను అందుకుని, కుటుంబాలు, నెక్స్ట్ జనరేషన్ కొనుగోలుదారులను ఆకర్షిస్తుందని మాకు నమ్మకంగా ఉంది," అని సంస్థ సీఈఓ హైదర్ ఖాన్ తెలిపారు.
Godawari Eblu Feo electric scooter : ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి ఎకానమి, నార్మల్, పవర్. ఈ బండి టాప్ స్పీడ్ 60కేఎంపీహెచ్. బ్యాటరీపై స్ట్రెస్‌ను తగ్గించేందుకు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టెమ్ ఇందులో ఉంది. ఈ మోడల్లో 2.52 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110కి.మీ రేంజ్ వస్తుందని సంస్థ చెబుతోంది. ఛార్జింగ్ కోసం 60 వీ ఛార్జర్‌ను ఇస్తోంది సంస్థ. ఫుల్ ఛార్జింగ్‌కు 5 గంటల 25 నిమిషాల సమయం పడుతుంది.
ఇదీ చూడండి:- TVS electric scooter : టీవీఎస్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రేపే లాంచ్!
ఈ గోదావరి ఎలక్ట్రిక్ ఎబ్లూ ఫియో ఫ్రెంట్, రేర్‌లో సీబీఎస్ డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. హై రిసొల్యూషన్ ఏహెచ్ఓ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ వంటివి సైతం లభిస్తున్నాయి. 12 ఇంచ్ ఇంటర్ఛార్జెబుల్ ట్యూబ్‌లెస్ టైర్స్, సెన్సార్ ఇండికేటర్లు ఈ-స్కూటర్‌కు వస్తున్నాయి. టెలిస్కోపిక్ ఫ్రెంట్ సస్పెషన్స్, డ్యూయెల్ ట్యూబ్ ట్విన్ షాకర్లు స్మూత్ రైడ్‌ను ఇస్తాయి.
Godawari Eblu Feo price : ఐదు రంగుల్లో ఈ మోడల్ అందుబాటులో ఉంటుంది. అవి సియన్ బ్లూ, వైన్ రెడ్, జెడ్ బ్లాక్, టెలి గ్రే, ట్రాఫిక్ వైట్. బ్లూటూత్ కనెక్టివిటీ, వైడ్ ఫ్లోర్‌బోర్డ్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్, 7.4 ఇంచ్ డిజిటల్ ఫుల్ కలర్ డిస్ప్లే, మెసేజ్ అలర్ట్, కాల్ అలర్ట్, రివర్స్ ఇండికేటర్‌తో పాటు మరిన్ని ఎగ్జైటింగ్ ఫీచర్స్ కూడా ఈ గోదావరి ఎలక్ట్రిక్ ఎబ్లూ ఫియోలో వస్తున్నాయి.
ఈ స్కూటర్ బుకింగ్స్ ఈ నెల 15నే ప్రారంభమయ్యాయి. డెలివరీలు బుధవారం నుంచి మొదలవుతాయని సంస్థ చెప్పింది.