FD interest rates: ఎఫ్ డీ లపై అత్యధిక వడ్డీని అందిస్తున్న 7 బ్యాంక్ లు
05 November 2024, 20:38 IST
FD interest rates: చాలా మందికి ఫిక్స్ డ్ డిపాజిట్లు అత్యంత సురక్షిత ఆదాయ మార్గం. ముఖ్యంగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు తమ డబ్బును క్రమానుగత ఆదాయం కోసం బ్యాంక్ ల్లో ఫిక్స్డ్ డిపాజిట్లుగా పెడ్తారు. ఎఫ్ డీ లపై అత్యధిక వడ్డీ ఇచ్చే 7 బ్యాంక్ ల వివరాలు ఇక్కడ మీ కోసం..
ఎఫ్ డీ లపై అత్యధిక వడ్డీని అందిస్తున్న 7 బ్యాంక్ లు
FD interest rates: ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా?.. ముందుగా వివిధ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ లపై (fixed deposit rates) అందించే వడ్డీ రేట్లను చెక్ చేయండి. మీ అకౌంట్ ఉన్న బ్యాంక్ తో పాటు వేరే బ్యాంక్ ల్లో కూడా ఎఫ్ డీలపై ఇచ్చే వడ్డీని పరిశీలించండి. వడ్డీ రేటులో వ్యత్యాసం గణనీయంగా ఉంటే వేరే కొత్త బ్యాంకును ఎంచుకోవడాన్ని పరిగణించవచ్చు. ఇక్కడ, వివిధ కాలపరిమితులలో టాప్ 7 బ్యాంకులు అందించే అత్యధిక వడ్డీ రేట్లను మేము లిస్ట్ ఔట్ చేశాము. అధిక వడ్డీ రేట్లు సాధారణంగా దీర్ఘకాలిక డిపాజిట్లపై మాత్రమే ఇస్తారు. అంటే కాలపరిమితి తక్కువ ఉంటే తక్కువ వడ్డీ లభిస్తుంది. కాలపరిమితి ఎక్కువ ఉంటే ఎక్కువ వడ్డీ లభిస్తుంది.
అత్యధిక ఎఫ్డీ వడ్డీ ఇచ్చే టాప్ బ్యాంకులు
హెచ్ డిఎఫ్ సి బ్యాంక్: భారత్ లో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ (HDFC Bank) రెగ్యులర్ డిపాజిటర్లకు 55 నెలల కాలపరిమితి గల ఫిక్స్ డ్ డిపాజిట్ పై 7.40 శాతం వడ్డీని అందిస్తుంది. జూలై 24, 2024న అమల్లోకి వచ్చిన రేట్ల ప్రకారం సీనియర్ సిటిజన్లకు ఈ కాలపరిమితిపై 7.90 శాతం వడ్డీ లభిస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ 15-18 నెలల కాలపరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) సాధారణ పౌరులకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.8 శాతం వడ్డీని అందిస్తోంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్: మరో ప్రైవేట్ రుణదాత కోటక్ మహీంద్రా బ్యాంక్ 390 రోజుల కాలపరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్ పై సాధారణ పౌరులకు అత్యధికంగా 7.4 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు అంటే 7.9 శాతం లభిస్తుంది. ఈ వడ్డీ రేట్లు 2024 జూన్ 14 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఫెడరల్ బ్యాంక్: ఇది 2024 అక్టోబర్ 16 నుండి అమల్లోకి వచ్చిన రేట్ల ప్రకారం 777 రోజుల కాలపరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్పై సాధారణ పౌరులు, సీనియర్ సిటిజన్లకు వరుసగా 7.4 శాతం మరియు 7.9 శాతం వడ్డీని అందిస్తుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (sbi) సాధారణ, సీనియర్ సిటిజన్లకు 2-3 సంవత్సరాల కాలపరిమితి ఎఫ్డీ పై వరుసగా 7 శాతం, 7.5 శాతం వడ్డీని అందిస్తుంది. ఈ రేట్లు 2024 జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా: ఈ ఏడాది అక్టోబర్ 14న ప్రకటించిన రేట్ల ప్రకారం 400 రోజుల కాలపరిమితి గల ఎఫ్డీపై బీఓబీ 7.3 శాతం, 7.8 శాతం వడ్డీని అందిస్తోంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఈ స్టేట్ బ్యాంక్ సాధారణ పౌరులకు 456 రోజుల కాలపరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్ పై 7.3 శాతం వడ్డీని అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు లభిస్తాయి.