SBI Interest Rates : ఎస్బీఐ కస్టమర్లకు దీపావళి గిఫ్ట్.. లోన్ వడ్డీ రేట్లు తగ్గింపు!-sbi cuts loan interest rate by 25 bps for this tenure check mclr rates of state bank of india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Sbi Interest Rates : ఎస్బీఐ కస్టమర్లకు దీపావళి గిఫ్ట్.. లోన్ వడ్డీ రేట్లు తగ్గింపు!

SBI Interest Rates : ఎస్బీఐ కస్టమర్లకు దీపావళి గిఫ్ట్.. లోన్ వడ్డీ రేట్లు తగ్గింపు!

Anand Sai HT Telugu
Oct 16, 2024 12:30 PM IST

SBI Interest Rates : పండుగల సీజన్‌కు ముందు రుణాలను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక ప్రకటన చేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్(MCLR)లో నిర్ణీత కాలానికి 25 బేసిస్ పాయింట్ల కోత ప్రకటించింది.

ఎస్పీఐ వడ్డీ రేట్లు
ఎస్పీఐ వడ్డీ రేట్లు (REUTERS)

లోన్స్, ఎఫ్‌డీలపై ప్రతీ నెలా బ్యాంకులు వడ్డీ రేట్లను సవరిస్తుంటాయి. తాజాగా ఎస్బీఐ కూడా వడ్డీ రేట్లకు సంబంధించిన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను వెల్లడించింది. ఎంపిక చేసిన టెన్యూర్‌లపై ఎంసీఎల్ఆర్ 25 బేసిక్ పాయింట్లు తగ్గింది. సవరించిన MCLR అక్టోబర్ 15 నుండి అమలులోకి వచ్చింది. స్వల్పకాలికమైనప్పటికీ వినియోగదారులకు రుణం తీసుకునే ఖర్చును తగ్గించేందుకు ఇది రూపొందించారు.

భారతదేశపు ప్రధాన పండుగ దీపావళి సందర్భంగా క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై తగ్గింపులు, తక్కువ రుణ వడ్డీ రేట్లు సహా ఆకర్షణీయమైన ఆఫర్‌లను ప్రకటిస్తుంటాయి..

ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లు 8.20 శాతం నుంచి 9.1 శాతం పరిధిలో ఉన్నాయి. ఇందులో ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 8.20శాతం, ఒక నెలకు ఈ రేటు 8.45 శాతం నుండి 8.20%కి తగ్గించారు. అదే సమయంలో ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.85శాతంగా సెట్ చేశారు. ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ 8.95 శాతానికి సవరించారు. అయితే రెండేళ్ల MCLR 9.05 శాతానికి సవరించగా.. ఇది కాకుండా మూడు సంవత్సరాలకు ఈ రేటు 9.1 శాతంగా చేశారు.

వడ్డీ రేట్లలో ఈ తగ్గింపు అక్టోబర్ 15, 2024 నుండి నవంబర్ 15, 2024 వరకు పరిమిత కాలానికి అందుబాటులో ఉంటుంది. రుణగ్రహీతలకు సరసమైన ధరలకు లోన్‌లను పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. నవంబర్ 15 తర్వాత, ఎంసీఎల్ఆర్ రేట్లు వాటి మునుపటి స్థాయికి తిరిగి వస్తాయి. వ్యక్తులు, వ్యాపారాలకు తక్కువ రుణ ఖర్చుల ప్రయోజనాన్ని పొందేందుకు ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది.

ఎంసీఎల్ఆర్ అనేది రుణ ఆధారిత వడ్డీ రేటు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ వడ్డీ రేటు కస్టమర్లను నిలుపుకోవడంలో సహాయపడటమే కాకుండా అనుకూలమైన రుణ నిబంధనల కోసం వెతుకుతున్న కొత్త రుణగ్రహీతలను కూడా ఆకర్షించే వ్యూహం. సెప్టెంబర్ 15, 2024 నుండి సంవత్సరానికి 10.40 శాతం ఎస్బీఐ బేస్ రేట్ ఉంది. అలాగే బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ (BPLR) 15.15 శాతంగా ఉన్నాయి.

Whats_app_banner