Stocks to buy : ఫెడ్ వడ్డీ రేట్ల కోతతో ఈ సెక్టార్ స్టాక్స్‌లో బుల్ రన్! మిస్ అవ్వకండి..
Stocks to buy today : ఫెడ్ వడ్డీ రేట్ల కోతతో ఏ సెక్టార్ స్టాక్స్ ఎక్కువ లాభపడతాయి? అన్న విషయాన్ని స్టాక్ మార్కెట్ నిపుణులు వెల్లడించారు. ఈ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని మిస్ అవ్వకండి..!
అగ్రరాజ్యం అమెరికాలో ఏం జరిగినా అది ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో వడ్డీ రేట్ల కోత సైతం ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లకు సానుకూల విషయంగా మారింది. పైగా గురువారం వెలువడిన యూఎస్ సీపీఐ డేటాతో అగ్రరాజ్యంలో ద్రవ్యోల్బణం ఆందోళనలు మరింత తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒక రేట్ కట్ తీసుకున్న ఫెడ్ (అమెరికా సెంట్రల్ బ్యాంక్).. నవంబర్‌లో జరిగే సమావేశంలోనూ వడ్డీ రేట్లపై కోత విధిస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ పరిణామాలు ముఖ్యంగా ఐటీ సెక్టార్ స్టాక్స్‌కి అత్యంత సానుకూలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఫెడ్ వడ్డీ రేట్ల కోత అనేది అమెరికా డాలర్ (యూఎస్డీ)పై ఒత్తిడి తెస్తుందని భావిస్తున్నందున, యూఎస్‌డీలో డీల్ చేసే భారత ఐటీ కంపెనీలు రాబోయే త్రైమాసికాల్లో మెరుగైన గణాంకాలను నమోదు చేస్తాయని అంచనాలు ఉన్నాయి. అందువల్ల ఈ సమయంలో ఐటి స్టాక్స్ కొనడం తెలివైన నిర్ణయమా కాదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంపై నిపుణుల సూచనలు ఇక్కడ తెలుసుకోండి..
ఐటీ సెక్టార్లో బుల్ రన్..?
వడ్డీరేట్ల తగ్గింపు ఐటీ వ్యయాలకు ఊతమివ్వనుందని, అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ ఐటీ కంపెనీలకు మరింత వ్యాపారం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. తక్కువ వడ్డీరేట్ల విధానం నేపథ్యంలో ఐటీ కంపెనీలకు నిధుల వ్యయం కూడా తగ్గనుంది.
ఫెడ్ వడ్డీ రేటు కట్ విధానం భారతీయ ఐటి కంపెనీలకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందనే దానిపై రెలిగేర్ బ్రోకింగ్‌లోని ఎస్వీపీ- రిటైల్ రీసెర్చ్ డాక్టర్ రవి సింగ్ స్పష్టంగా వివరించారు.
“యూఎస్ ఫెడ్ రేట్ల కోత నేపథ్యంలో ఐటి స్టాక్స్ కొనుగోలు చేయడానికి మంచి సమయం ముందు ఉండవచ్చు. రేట్ల కోతలు సాధారణంగా డాలర్‌ని బలహీనపరుస్తాయి. ఇది సాంప్రదాయకంగా యూఎస్‌లో గణనీయమైన ఎక్స్పోజర్ ఉన్న భారతీయ ఐటి కంపెనీలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆయా సంస్థలు డాలర్ పరంగా అధిక ఆదాయాన్ని పొందుతుంటాయి. టెక్నాలజీలో వ్యాపార పెట్టుబడులకు తక్కువ వడ్డీ రేట్లు సానుకూలంగా ఉన్నాయి. ఐటీ సేవలకు డిమాండ్ పెరుగుతుంది. దీర్ఘకాలిక విలువ కోసం బలమైన ఐటీ షేర్లలో పెట్టుబడులు పెట్టాలి,” అని ఆయన ఇన్వెస్టర్లకు సూచించారు.
"చారిత్రాత్మకంగా, ఫెడ్ రేట్ కట్ సైకిల్ తరచుగా ఆర్థిక మందగమనాన్ని సూచిస్తున్నాయి. ఇది ఐటి సేవల ఎగుమతులకు డిమాండ్‌ని తగ్గిస్తుంది. అయితే, ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉండొచ్చు. భారతీయ ఐటీ సంస్థలు మునుపటి మాదిరిగా మాంద్యం ఒత్తిళ్లను ఎదుర్కోకపోవచ్చని మేము నమ్ముతున్నాము," అని లక్ష్మీశ్రీ ఇన్వెస్ట్మెంట్ అండ్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అన్షుల్ జైన్ అన్నారు.
“రేటు తగ్గింపు ఈక్విటీ వ్యయాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది ఈ రంగంలోని ప్రధాన సంస్థలకు అధిక ధర-ఆదాయ నిష్పత్తులకు (పీఈఆర్) దారితీస్తుంది. స్టాక్ ధరలు ఇప్పటికే కొంత సానుకూల కదలికను చూపించినప్పటికీ, తగ్గించిన వడ్డీ రేట్ల పూర్తి ప్రభావం బయటపడటానికి ఇంకా సమయం పట్టవచ్చు,” అని జైన్ పేర్కొన్నారు.
యూఎస్ ఫెడ్ రేట్ల తగ్గింపు నేపథ్యంలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా వంటి లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్‌తో పాటు పెర్సిస్టెంట్ సిస్టెమ్స్, కేపీఐటీ టెక్నాలజీస్ వంటి మిడ్ క్యాప్ షేర్లపై ఇన్వెస్టర్లు ఓ కన్నేసి ఉంచాలని లక్ష్మీశ్రీ ఇన్వెస్ట్మెంట్ అండ్ సెక్యూరిటీస్‌కు చెందిన అన్షుల్ జైన్ సూచించారు.
(గమనిక:- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. ఏదైనా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం