Stock Market : స్టాక్ మార్కెట్లకు 'యూఎస్ ఫెడ్' జోష్.. ఆల్ టైమ్ హిట్ కొట్టిన సెన్సెక్స్-indian stock market hits all time high after outsized fed rate cut check in details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market : స్టాక్ మార్కెట్లకు 'యూఎస్ ఫెడ్' జోష్.. ఆల్ టైమ్ హిట్ కొట్టిన సెన్సెక్స్

Stock Market : స్టాక్ మార్కెట్లకు 'యూఎస్ ఫెడ్' జోష్.. ఆల్ టైమ్ హిట్ కొట్టిన సెన్సెక్స్

Anand Sai HT Telugu
Sep 19, 2024 01:04 PM IST

Stock Market : గురువారం ఉదయం భారతీయ స్టాక్ మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్టాలను తాకాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించిన కొన్ని గంటల తర్వాత స్టాక్ మార్కెట్ దూసుకెళ్లింది.

US ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్
US ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ (Reuters)

యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు(బీపీఎస్) తగ్గించిన కొన్ని గంటల తర్వాత గురువారం ఉదయం భారతీయ స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయి. ఉదయం 9.48 గంటలకు నిఫ్టీ 0.80 శాతం పెరిగి 25,583 వద్ద, సెన్సెక్స్ 0.88 శాతం పెరిగి 83,691.22 వద్ద ఉన్నాయి. ప్రారంభ సమయంలోనే నిఫ్టి, సెన్సెక్స్ గరిష్టాలను తాకాయి.

దాదాపు 1,916 స్టాక్‌లు పురోగమించగా, 629 స్టాక్‌లు క్షీణించాయి. 113 స్టాక్‌లు మారలేదు. అమెరికా ఫెడ్ చర్య భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ప్రయోజనం చేకూరుస్తుందని వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీ డైరెక్టర్ క్రాంతి బథిని అన్నారు.

'US Fed చర్య ఇతర గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులను ప్రభావితం చేస్తుంది. రియల్టీ, ఆటో, NBFCలు (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు) వంటి రేట్ సెన్సిటివ్‌లు ప్రయోజనం పొందుతాయి.' అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అన్నారు.

నిఫ్టీ ఐటీతో మొత్తం 13 రంగాల సూచీలు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎల్‌టిఐమైండ్‌ట్రీ నేతృత్వంలోని ఐటీ ఇండెక్స్ 1.5 శాతం పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ మద్దతుతో నిఫ్టీ బ్యాంక్ కూడా దాదాపు 1 శాతం పురోగమించింది.

వ్యక్తిగత స్టాక్‌లలో గ్రాసిమ్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, ఎల్‌టీఐమాండ్‌ట్రీ, ఎన్‌టీపీసీ నిఫ్టీ 50 లాభపడిన వాటిలో 1.5-3.7 శాతం పెరిగాయి. మరోవైపు డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫిన్‌సర్వ్, బిపీసీఎల్, హెచ్‌సీఎల్‌టెక్, ఒఎన్‌జీసీలు 0.1-1 శాతం పడిపోయాయి.

మార్కెట్లు సాధారణంగా ఎఫ్‌ఎఫ్‌ఆర్ (ఫెడరల్ ఫండ్స్ రేట్)లో 25-50 బీపీఎస్ కోతను అంచనా వేస్తున్నాయని, ప్రాఫిట్ బుకింగ్ ఉంటుందని కొందరు విశ్లేషకులు తెలిపారు. భారత్ వంటి వర్ధమాన మార్కెట్లకు రేటు తగ్గింపు సానుకూలంగా ఉంటుందని మరికొందరు అన్నారు. ఇది కాలక్రమేణా భారీ విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఈ ఏడాది ఇప్పటివరకు భారతీయ స్టాక్స్‌లో ఎఫ్‌ఐఐలు రూ.73,782 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, డీఐఐలు రూ.3.2 ట్రిలియన్లు ఇన్వెస్ట్ చేశారు. జూన్ 4న ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల నుంచి సెప్టెంబర్ 18 వరకు నిఫ్టీ 50 ఇండెక్స్ 16శాతం రాబడిని సాధించింది.