Penny Stock : ఈ పెన్నీ స్టాక్ రెండ్రోజుల్లో 32 శాతం పెరిగింది.. ధర రూ.13.90
Penny Stock : భారతదేశంలో బ్రాండెడ్ స్టీల్ ఉత్పత్తుల తయారీలో అగ్రగామి సంస్థ రామా స్టీల్ ట్యూబ్స్ షేర్లు స్థిరంగా పెరుగుతున్నాయి. తాజాగా ఈ షేరు 20 శాతం పెరిగింది. రెండు రోజుల్లో 30 శాతానికిపైగా పైకి వెళ్ళింది. స్టాక్ మార్కెట్‌లో అందరి దృష్టిని ఆకర్శిస్తోంది.
aభారతదేశంలో బ్రాండెడ్ స్టీల్ ఉత్పత్తుల తయారీలో అగ్రగామి సంస్థగా ఉన్న రామా స్టీల్ ట్యూబ్స్ షేర్లు పెరుగుతున్నాయి. తాజాగా దీనికి అప్పర్ సర్క్యూట్ ఉంది. గురువారం కంపెనీ షేర్లు 20 శాతం పెరిగాయి. కంపెనీ షేరు ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.13.90కి చేరుకుంది. బుధవారం 10 శాతానికి పైగా పెరిగిన విషయం తెలిసిందే. అంటే కేవలం రెండు ట్రేడింగ్ రోజుల్లోనే ఈ స్టాక్ 32 శాతం వరకు పెరిగింది.
గ్రీన్, రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడానికి ఓనిక్స్ రెన్యూవబుల్స్ లిమిటెడ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని రమా స్టీల్ ట్యూబ్స్ బుధవారం ప్రకటించింది. ఓనిక్స్ రెన్యూవబుల్స్ లిమిటెడ్ చేపట్టిన సోలార్ ప్రాజెక్టుల కోసం సింగిల్ యాక్సిస్ ట్రాకర్లు, ఫ్యూచరిస్టిక్ డ్యూయల్-యాక్సిస్ ట్రాకర్లతో సహా అవసరమైన ఉక్కు నిర్మాణాలను అందించడానికి రామా స్టీల్ ట్యూబ్స్ నైపుణ్యాన్ని ఈ భాగస్వామ్యం ఉపయోగించుకుంటుంది.
రామా డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్.. పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ మంగళవారం ప్రకటించింది. ఈ కొత్త యూనిట్ రక్షణ రంగంపై దృష్టి సారించనుంది. వాణిజ్యం, దిగుమతి, ఎగుమతి, తయారీ, రక్షణ సామగ్రి సరఫరా, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు, సంబంధిత సైనిక, భద్రతా హార్డ్‌వేర్ వంటి కార్యకలాపాల్లో ఈ కంపెనీ క్రియాశీలకంగా ఉంటుంది.
1974లో స్థాపించబడిన ఆర్‌ఎస్‌టీఎల్(రామా స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్) భారతదేశంలో ఉక్కు పైపులు, గొట్టాలు, జీఐ పైపుల తయారీలో అగ్రగామిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 16 దేశాల్లో తన కార్యకలాపాలను విజయవంతంగా విస్తరించింది. దాని మొత్తం టర్నోవర్‌లో ఎగుమతుల వాటా 10-20 శాతంగా ఉంది. అంతర్జాతీయ గుర్తింపును కూడా సొంతం చేసుకుంది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం, ఆర్ఎస్‌టీఎల్ యూఏఈలో ఒక అనుబంధ సంస్థను, నైజీరియాలో స్టెప్-డౌన్ అనుబంధ సంస్థను నిర్వహిస్తుంది. ఇది దాని గ్లోబల్ మార్కెట్ ఉనికిని మరింత బలోపేతం చేస్తుంది.