లడఖ్‌లో భూభాగాన్ని చైనా సైనికులు ఆక్రమించారు : అమెరికాలో రాహుల్ గాంధీ-chinese troops occupied land size of delhi in ladakh rahul gandhi in america ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  లడఖ్‌లో భూభాగాన్ని చైనా సైనికులు ఆక్రమించారు : అమెరికాలో రాహుల్ గాంధీ

లడఖ్‌లో భూభాగాన్ని చైనా సైనికులు ఆక్రమించారు : అమెరికాలో రాహుల్ గాంధీ

Anand Sai HT Telugu
Sep 11, 2024 11:12 AM IST

Rahul Gandhi In US : అమెరికా పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-చైనా సరిహద్దు వివాదంపై కామెంట్స్ చేశారు. చైనాను సరిగా ఎదుర్కోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ విఫలమయ్యారని ఆరోపణలు చేశారు.

రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ

భారత్-చైనా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంపై బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ చైనాను సరిగ్గా నిర్వహించలేదని అన్నారు. లడఖ్‌లో ఢిల్లీ సైజు అంత భూభాగాన్ని చైనా సైనికులు ఆక్రమించారని ఆరోపించారు. అమెరికాలోని వాషింగ్టన్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో అమెరికా-చైనా పోటీని భారత్ చక్కగా నిర్వహించిందని మీరు భావిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానమిచ్చారు. 'మన భూభాగంలోని 4,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చైనా దళాలు రావడం చక్కగా అనిపిస్తే.. సరిగ్గా నిర్వహించి ఉండవచ్చు. లడఖ్‌లో ఢిల్లీ అంత పరిమాణంలో ఉన్న భూమిని చైనా దళాలు ఆక్రమించుకున్నాయి. అది ఒక విపత్తు అని నేను భావిస్తున్నాను. ప్రధాని మోదీ చైనాను చక్కగా నిర్వహించారని అనుకోవద్దు.' అని రాహుల్ గాంధీ అన్నారు.

ఒక పొరుగు దేశం 4,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమిస్తే అమెరికా ఎలా స్పందిస్తుందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఏ అధ్యక్షుడైనా దానిని బాగా నిర్వహించానని చెప్పుకుంటారా అని అడిగారు.

పాకిస్తాన్‌పై పీఎం మోదీ విధానాలకు రాహుల్ మద్దతు ఇచ్చారు. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, భారత్‌లో పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రేరేపించడమే కారణమని కాంగ్రెస్‌ నాయకుడు ఆరోపించారు. పాకిస్థాన్ దేశంలో ఉగ్రదాడులకు పాల్పడితే భారత్ సహించబోదని అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నంత కాలం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతాయని చెప్పారు. కాశ్మీర్ సమస్య రెండు దేశాలను చర్చకు దూరంగా ఉంచుతుందా అని అడిగిన ప్రశ్నకు 'లేదు'అని అన్నారు.

పదేళ్లలో భారత్‌లో ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమైందని, ప్రస్తుతం నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తుందని రాహుల్ గాంధీ చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మా నుంచి దూరం చేశారని అన్నారు. అదంతా తన కళ్ల ముందే జరిగిందన్నారు. మా శాసనసభ్యులు అనూహ్యంగా బీజేపీ సభ్యులయ్యారన్నారు. దేశ ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందన్నారు. బలహీనంగా మారిపోయిందని చెప్పారు. ఇప్పుడు దానిని నిలబెట్టేందుకు పోరాటం జరుగుతోందన్నారు.

Whats_app_banner