DA hike news : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక- త్వరలోనే డీఏ పెంపు ప్రకటన..!
DA hike news : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డియర్నెస్ అలొవెన్స్ పెంపు గురించి దీపావళికి ముందే ఓ ప్రకటన వెలువడుతుందని సమాచారం. ప్రకటన తర్వాత ప్రస్తుతం 50శాతంగా ఉన్న డీఏ.. 53శాతానికి పెరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ దీపావళి బోనస్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి! డియర్నెస్ అలొవెన్స్ (డీఏ) పెంపు విషయంపై ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే గుడ్ న్యూస్ వింటారని సమాచారం. వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకుంటారని, అనంతరం దీపావళి (అక్టోబర్ 31)కి ముందే డీఏ పెంపు ప్రకటన వెలువడుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
త్వరలోనే డీఏ పెంపు వార్త..!
రిటైల్ ధరల కదలికలను ట్రాక్ చేసే ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (ఏఐసీపీఐ) ఆధారంగా డియర్నెస్ అలొవెన్స్ (డీఏ)ను లెక్కిస్తారు. కుటుంబాలపై ద్రవ్యోల్బణం ప్రభావం చూపుతున్న తరుణంలో డీఏ పెంపు ప్రకటన.. ప్రభుత్వ ఉద్యోగులకు టేక్ హోమ్ వేతనం పెంచుతుంది. పెరుగుతున్న ఖర్చుల నుంచి కాస్త రిలీఫ్ లభిస్తుంది.
ప్రస్తుతం డీఏ 50 శాతంగా ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పుడు మరో 3శాతం డీఏ పెంచుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రణాళికతో ముందుకు సాగితే, జులై 1, 2024 నుంచి కొత్త రేటు 53 శాతానికి పెరుగుతుంది! దీనివల్ల కోటికిపైగా మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజన చేకూరుతుంది.
అంతేకాదు, డీఏ పెంపు ప్రకటన ఈ నెల చివరిలో వస్తే.. జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల బకాయిలతో కలుపుకుని జీతం అందుతుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ఏడాదికి రెండుసార్లు ఉంటుంది. ఈ ఏడాది మార్చ్‌లో డీఏ 4శాతం పెరిగింది. ఇది జనవరి 2024 నుంచి అమల్లోకి వచ్చింది. మూడు నెలల బకాయిలను ప్రభుత్వం చెల్లించింది.
గత ఏడాది పండుగ సీజన్‌కి ముందే ప్రభుత్వం డీఏ పెంపును ప్రకటించింది. ఈసారి కూడా ఇప్పటికే ఒక ప్రకటన వస్తుందని ప్రభుత్వ ఉద్యోగులు భావించారు. దాదాపు నెల రోజులుగా డీఏ పెంపు ప్రకటన కోసం అందరు ఎదురుచూస్తున్నారు. దసరా సమయంలో ప్రకటన వస్తుందని ఆశించారు. కానీ ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఈసారి దీపావళికి ముందు కచ్చితంగా ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతున్నాయి. దసరాకు ముందు 4 శాతం డీఏ పెంపుతో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే తన ఉద్యోగులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఇది రాష్ట్రంలోని 1.80 లక్షల మంది ఉద్యోగులు, 1.70 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనాలు ఉన్నాయి.
సంబంధిత కథనం