ChatGPT : చాట్‌జీపీటీ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ ఉద్యోగం పోయింది!
18 November 2023, 7:10 IST
ChatGPT CEO Sam Altman : చాట్‌జీపీటీ సీఈఓ బాధ్యతల నుంచి సామ్ ఆల్ట్మాన్ని తొలగిస్తున్నట్టు ఓపెన్ఏఐ సంస్థ ప్రకటించింది. ఈ వ్యవహారంపై సామ్ కూడా స్పందించారు.
ఛాట్‌జీపీటీ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ ఉద్యోగం పోయింది!
ChatGPT latest news : చాట్‌జీపీటీ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ ఉద్యోగం పోయింది! సీఈఓ పదవి నుంచి ఆయన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.. చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ఏఐ. ఆయన పని, సామర్థ్యాలపై నమ్మకం కోల్పోయినట్టు బోర్డు వెల్లడించింది.
సామ్ ఆల్ట్మాన్ తొలగింపు..
గతేడాది లాంచ్ అయిన చాట్‌జీపీటీ.. ప్రపంతవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆర్టిఫీషియెల్ ఇంటెలిజెన్స్ రంగంలో కొత్త ద్వారాలను తెరిచింది ఈ సంస్థ. అమెజాన్, గూగుల్, మెటా ఎంట్రీతో ఏఐ రేసు రసవత్తరంగా మారింది.
38ఏళ్ల సామ్ ఆల్ట్మాన్.. సంస్థను ఇప్పటివరకు ముందుండి నడిపించారు. ఆయన కూడా ఒక సెన్సెషన్ అయ్యారు. కానీ ఆయనకి, ఓపెన్ఏఐ బోర్డుకు మధ్య విభేధాలు ఉన్నట్టు కనిపిస్తోంది.
Sam Altman news : "సమగ్ర రివ్యూ తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాము. చాట్‌జీపీటీ సీఈఓ పదవి నుంచి సామ్ ఆల్ట్మాన్ని తొలగిస్తున్నాము. బోర్డుకు సరైన సమాచారాలు ఇవ్వడంలో ఆయన విఫలం అయ్యాడు. ఫలితంగా బోర్డు తన బాధ్యతలు చేపట్టలేక పోయింది. బోర్డుకు ఇక ఏమాత్రం సామ్ ఆల్ట్‌మాన్‌పై నమ్మకం లేదు," అని ఓపెన్ఏఐ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ చాట్‌జీపీటీలో బిలియన్ల డాలర్లను ఇన్వెస్ట్ చేసింది మైక్రోసాఫ్ట్. ఏఐ టెక్నాలజీని బింగ్ సెర్చ్ ఇంజిన్‌తో పాటు మైక్రోసాఫ్ట్‌లోని ఇతర ప్రాడక్ట్స్‌కి కూడా తీసుకొస్తామని హామీనిచ్చింది.
Sam Altman fired : ఇక చాట్‌జీపీటీ సీఈఓ పదవి నుంచి సామ్ ఆల్ట్మాన్ని తొలగించిన ఓపెన్ఏఐ బోర్డు.. ఆ స్థానంలో మీరా మారుతిని నియమించింది. ఆమె.. ఇప్పటివరకు అదే సంస్థలో సీటీఓ (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్)గా బాధ్యతలు నిర్వహించారు.
చాట్‌జీపీటీలో నిన్న మొన్నటి వరకు కూడా కీలకంగా వ్యవహరించారు సామ్ ఆల్ట్మాన్. సంస్థ తరఫున అనేక ప్రాడక్ట్స్‌ని రివీల్ చేశారు. ఇక ఇప్పుడు.. ఈ వ్యవహారంపై ఆయన స్పందించారు.
"ఓపెన్ఏఐ టీమ్‌ని నేను ప్రేమించాను. వ్యక్తిగతంగా చాలా వృద్ధి సాధించాను. ప్రపంచానికి కూడా కొంత మంచి చేశానని విశ్వసిస్తున్నాను. అద్భుత టాలెంట్ ఉన్న వారితో పనిచేయడాన్ని ప్రేమించాను," అని ట్విట్టర్ వేదికగా స్పందించారు సామ్ ఆల్ట్మాన్.
ఇక సామ్ ఆల్ట్మాన్ని ఫైర్ చేయడంతో.. ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రేగ్ బ్రూక్మాన్కు తన పదవికి రాజీనామా చేశారు.
ChatGPT CEO Sam Altman fired : "8ఏళ్ల క్రితం ఓపెన్ఏఐని నా అపార్ట్మెంట్లో ప్రారంభించాము. అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. చాలా కఠినమైన పరిస్థితులను, సంతోషకరమైన సందర్భాలను ఎదుర్కొన్నాము. చాలా సాధించాము. కానీ ఇవాళ వచ్చిన వార్తతో (సామ్ ఆల్ట్మాన్ తొలగింపు).. నేను కూడా క్విట్ చేస్తున్నాను," అని గ్రేగ్ బ్రూక్మాన్ తెలిపారు.