BYD India : బీవైడీకి కేంద్రం షాక్.. 1 బిలియన్ డాలర్ల డ్రీమ్‌కు బ్రేక్!
23 July 2023, 11:45 IST
- BYD India : చైనా ఆటోమొబైల్ సంస్థ బీవైడీకి భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తెలంగాణలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్లాన్‌ను తిరస్కరించింది.
బీవైడీ 1 బిలియన్ డాలర్ల పెట్టుబడిని తిరస్కరించిన కేంద్రం!
BYD India : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టాలని కలలు కన్న ప్రముఖ చైనా సంస్థ బీవైడీకి కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థతో కలిసి తెలంగాణలో 1 బిలియన్ డాలర్ విలువ చేసే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఆ కంపెనీ ప్లాన్‌ను ప్రభుత్వం తాజాగా తిరస్కరించింది.
కారణం ఇదే..
ఇండియాలో గత కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌కు బీభత్సమైన డిమాండ్ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే దేశీయ సంస్థలకు పోటీగా.. అంతర్జాతీయ సంస్థలు కూడా ఇక్కడి మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు ఈవీలతో ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది బీవైడీ. అవి అట్టో 3, ఈ6. ఇక మూడో వెహికిల్ సీల్ ఈవీ కూడా త్వరలోనే ఇండియాలో లాంచ్ అవుతుందని సమాచారం. వీటి మధ్య.. దేశంలో ఓ ఎలక్ట్రిక్ వాహనాల ఫ్యాక్టరీని స్థాపించాలని చైనాకు చెందిన ఆ సంస్థ భావించింది. తెలంగాణలో ఫ్యాక్టరీని పెట్టి.. ఇండియాలో ఏడాదికి 10వేల నుంచి 15 వేల ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలని ప్రయత్నించింది. ఈ మేరకు 1 బిలియన్ డాలర్ విలువ చేసే పెట్టుబడి ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచింది.
అయితే.. హోంశాఖ, విదేశీశాఖల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయని, చైనా సంస్థ ఇండియాలో కార్యకలాపాలు సాగించడం ప్రస్తుత దశలో మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయని డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, డిపార్ట్మెంట్ ఫర్ ప్రొమోషన్ ఆఫ్ ఇండిస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సభ్యులు తెలిపారు. అందుకే బీవైడీ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్టు స్పష్టం చేశారు. చైనా కంపెనీల పెట్టుబడులకు ప్రస్తుతం ఇండియాలోని రూల్స్ ఒప్పుకోవని తేల్చిచెప్పారు.
BYD India investment proposal : వాస్తవానికి చైనా సంస్థల 'ఇండియా' ప్లాన్‌ను కేంద్రం తిరస్కరించడం ఇది మొదటిసారి కాదు. చైనా దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ గ్రేట్ వాల్ మోటార్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని భావించింది. మహారాష్ట్రలో వాహనాల తయారీ ఫ్యాక్టరీని పెట్టాలని చూసింది. రెండున్న రేళ్ల పాటు వేచి చూసినా కూడా.. కేంద్రం నుంచి సంస్థ ప్రదిపాదనకు సమాధానం లభించలేదు.