Top 10 Announcements : బడ్జెట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ టాప్ 10 అనౌన్స్‌మెంట్స్
23 July 2024, 13:40 IST
- Budget 2024 : నిర్మలా సీతారామన్ ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్‌లో కొన్ని కీలక ప్రకటనలు ఉన్నాయి. టాప్ 10 అనౌన్స్‌మెంట్స్ చూద్దాం..
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది మోదీ 3.0 బడ్జెట్ కావడంతో అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఆర్థికమంత్రిగా ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. అనేక అంచనాల మధ్య ఈ బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశెపెట్టింది. మార్కెట్‌లో సమిష్టి డిమాండ్‌ను పెంచడం, ఉపాధి కల్పన, వ్యవసాయానికి ఊతమివ్వడం, కొనుగోలు శక్తిని పెంచడం, గ్రామీణ రంగంలో ఉత్పత్తులు మరియు సేవలకు డిమాండ్‌ను పెంచడం, వాటికోసం పరిస్థితులను సృష్టించడం మధ్య బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ సందర్భంగా టాప్ 10 ప్రకటనలు ఏంటో చూద్దాం..
1. ద్రవ్యలోటు జీడీపీలో 4.9శాతం అంచనా వేశారు. FY26లో 4.5శాతానికి తగ్గుతుంది.
2. కొత్త పన్ను విధానంలో మాత్రమే వ్యక్తిగత ఆదాయపు పన్నుపై స్టాండర్డ్ డిడక్షన్ రూ.50000 నుంచి రూ.75000కి పెంచారు. పన్ను చెల్లింపుదారులకు రూ.17500 ఉపశమనం లభిస్తుంది. అయితే ఇది పాత పన్ను విధానానికి అమలు కాదు.
3. STCG(Short-term capital gain tax) కొన్ని ఆస్తులకు 20 శాతం పన్ను విధిస్తారు. LTCG(Long Term Capital Gains Tax) మినహాయింపు పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.1.25 లక్షలకు పెంచారు. LTCG 10 శాతం నుంచి 12 శాతానికి పెరిగింది.
4. వచ్చే ఆరు నెలల్లో జీఎస్టీ సరళీకృతం, హేతుబద్ధం చేయబడుతుంది.
5. ఉపాధి కల్పన-నైపుణ్యాభివృద్ధి పథకంలో భాగంగా మెుదటిసారి సంఘటిత రంగంలో ఉద్యోగంలో చేరేవారు.., తయారీ రంగంలో చేరేవారికి ఒక నెల జీతం ఇవ్వనుంది ప్రభుత్వం. నెలకు రూ.15000గా ఇస్తారు.
6. కొలేటరల్ లేదా థర్ట్ పార్టీ గ్యారెంటీ లేకుండా రుణం కోసం క్రెడిట్ గ్యారంటీ MSME క్రెడిట్ సులభతరం చేస్తారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ఎంఎస్ఎంఈ కోసం వారి స్వంత రిస్క్ అసెస్‌మెంట్ మోడ్‌లను కలిగి ఉంటాయి.
7. 5 సంవత్సరాలలో 500 కంపెనీలలో కోటి మంది యువకులకు ఇంటర్న్‌షిప్‌ను ప్రభుత్వం సులభతరం చేస్తుంది. ఇంటర్న్‌షిప్ ఫీజుగా నెలకు రూ.5000 చెల్లిస్తారు. సీఎస్ఆర్ నిధుల నుంచి శిక్షణ ఖర్చులను కంపెనీలు భరించాలి.
8. మహిళలు, బాలికలకు ఉద్దేశించిన ప్రాజెక్టులకు రూ.3లక్షల కోట్ల కేటాయింపు.
9. గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయింపు.
10. 5 సంవత్సరాల కాలానికి 4.1 కోట్ల యువతకు నైపుణ్యం, ఉపాధి కల్పించడం.
ఇవే కాకుండా విద్యా, ఉద్యోగం, నేపుణ్యం కోసం 1.48 లక్షల కోట్ల కేటాయింపులు చేసినట్టుగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఉద్యోగం, నైపుణ్యం, ఎంఎస్ఎంఈ, మధ్య తరగతిపై ఈసారి బడ్జెట్‌లో ఫోకస్ పెట్టినట్టుగా చెప్పారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. ఎంఎస్ఎంఈ క్లస్టర్లు నూతన సిడ్‌బీ బ్యాంకు బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.
వచ్చే ఐదు సంవత్సరాలలో 20 లక్షలమందికి నైపుణ్యాభివృద్ధి సంస్థల ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్టుగా కేంద్రమంత్రి ప్రకటించారు. భారతీయ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు మూడు శాతం వడ్డీ రాయితీ కల్పిస్తామని చెప్పారు. స్వయం ఉపాధి పొందే చేతివృత్తి మహిళలకు రుణ సాయం పెంచుతున్నట్టుగా పేర్కొన్నారు.