Ather Rizta launch: ఎలక్ట్రిక్ స్కూటర్స్ లోకి మరో స్టైలిష్ ఎంట్రీ; ఎథర్ రిజ్టా లాంచ్
06 April 2024, 18:45 IST
- కొత్త ఎథర్ రిజ్టా తో మాస్ మార్కెట్ ఫ్యామిలీ స్కూటర్ సెగ్మెంట్ లోకి ఎథర్ ఎంట్రీ ఇచ్చింది. మొత్తం స్కూటర్ మార్కెట్ లో ఫ్యామిలీ స్కూటర్ సెగ్మెంట్ 80 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. ఈ సెగ్మెంట్ లో కొత్త ఎథర్ రిజ్టా హోండా యాక్టివా, టివిఎస్ జూపిటర్ వంటి పాపులర్ మోడల్స్ కు గట్టి పోటీ ఇవ్వనుంది.
కొత్త ఎథర్ రిజ్టా లాంచ్
Ather Rizta: ఎథర్ ఎనర్జీ కొత్త రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ను శనివారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది ఎథర్ 450 సిరీస్ తరువాత వచ్చిన రెండవ స్కూటర్. కొత్త ఎథర్ రిజ్టా ధర రూ .1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. కొత్త ఎథర్ రిజ్టా ను రూ.999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు జూలై నుంచి ప్రారంభం కానున్నాయి.
ఎథర్ 450 సిరీస్ స్ఫూర్తితో..
కొత్త ఎథర్ రిజ్టా (Ather Rizta) ను ఎథర్ 450 (Ather 450) సిరీస్ లోని అంశాల ఆధారంగా రూపొందించారు. ఫ్యామిలీ కస్టమర్లను ఆకర్షించే లక్ష్యంతో ఈ ఎథర్ రిజ్టా డిజైన్ ను తీర్చిదిద్దారు. రౌండ్ ప్యానెల్స్, మోనో-ఎల్ఈడి హెడ్ ల్యాంప్, ఎల్ఇడి టెయిల్ లైట్స్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టైలింగ్ చాలావరకు సంప్రదాయబద్ధంగా ఉంటుంది. ఈ మోడల్ ముందు, వెనుక 12-అంగుళాల అల్లాయ్ వీల్స్ ను ఏర్పాటు చేశారు.
ఎథర్ రిజ్టా ప్రధాన ఆకర్షణ భారీ సీటు
ఎథర్ రిజ్టా (Ather Rizta) ఇ-స్కూటర్ ప్రధాన ఆకర్షణ దాని భారీ సీటు. దీనిపై ఇద్దరు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. దీని ఫ్లోర్ బోర్డు కూడా విశాలంగా ఉంటుంది. ఇందులో 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ ఉంది. కొత్త రిజ్టా ఫీచర్స్ లో చాలావరకు ఎథర్ 450ఎక్స్ లో ఉన్నవే ఉన్నాయి. ఎథర్ రిజ్టా లో టర్న్ బై టర్న్ నావిగేషన్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, టచ్ ఫంక్షనాలిటీతో టీఎఫ్టీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ మొదలైనవి ఉన్నాయి. ఈ ఇ-స్కూటర్ లేటెస్ట్ ఎథర్ స్టాక్ 6 ను కలిగి ఉంటుంది. ఎథర్ రిజ్టా లో పార్క్ అసిస్ట్, ఆటో హిల్ హోల్డ్ వంటి సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.
రెండు రైడింగ్ మోడ్స్
ఈ ఎథర్ రిజ్టా (Ather Rizta) ఎలక్ట్రిక్ స్కూటర్ లో స్మార్ట్ ఎకో (SmartEco), జిప్ (Zip) అనే రెండు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఈ స్కూటర్ 0-40 కిలోమీటర్ల వేగాన్ని 3.7 సెకన్లలో అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని చేరగలదు. ఈ-స్కూటర్ బహుళ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో వస్తుంది. 2.9 కిలోవాట్ల యూనిట్ ఆప్షన్ స్కూటర్ ను ఒకసారి ఛార్జ్ చేస్తే 105 కిమీలు ప్రయాణించవచ్చు. అలాగే, 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 125 కిలోమీటర్ల (ట్రూరేంజ్) పరిధిని అందిస్తుంది. ఎథర్ రిజ్టా స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో సింగిల్ షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ఫ్రంట్ డిస్క్, రియర్ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. ఈ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్ 1 ప్రో, బజాజ్ చేతక్ వంటి వాటికి పోటీగా ఉంటుంది.