Apple WWDC 2023 : యాపిల్ విజన్ ప్రో, మాక్‌బుక్ ఎయిర్ 15 లాంచ్..
06 June 2023, 6:35 IST
- Apple WWDC 2023 : విజన్ ప్రో, మాక్‌బుక్ ఎయిర్ 15ను లాంచ్ చేసింది దిగ్గజ టెక్ సంస్థ యపిల్. డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్లో మరిన్ని ఎగ్జైటింగ్ ప్రాడక్ట్స్‌ను ప్రదర్శించింది. ఆ వివరాలు..
యాపిల్ సీఈఓ టిమ్ కుక్
Apple WWDC 2023 : డబ్ల్యూడబ్ల్యూడీసీ (వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్) 2023లో భాగంగా సరికొత్త, ఎగ్జైటింగ్ ప్రాడక్ట్స్‌ను ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది యాపిల్ సంస్థ. విజన్ ప్రో, కొత్త మాక్ బుక్స్, లేటెస్ట్ ఓఎస్ అప్‌గ్రేడ్స్ వంటిని లాంచ్ చేసింది. వీటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
విజన్ ప్రో..
డబ్ల్యూడబ్ల్యూడీసీ 2023 ఈవెంట్ మొత్తంలో ఈ విజన్ ప్రో హైలైట్‌గా నిలిచిందని చెప్పుకోవచ్చు. సంస్థ చరిత్రలోనే ఇది మొదటి మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్. గ్లాస్, కార్బన్ ఫైబర్, అల్యూమీనియంతో దీనిని తయారు చేశారు. డిజైన్ విషయానికొస్తే.. ఇందులో కర్వడ్ ఫ్రేమ్, ఫ్రెంట్ గ్లాస్, థర్మల్ వెంట్స్, ఎడమవైపు పుష్ బటన్స్ వంటివి వస్తున్నాయి. ఇందులో డ్యూయెల్ 1.41 ఇంచ్ 4కే మైక్రో ఓఎల్ఈడీలు ఉన్నాయి. 23 మిలియన్ కంబైన్డ్ పిక్సెల్స్, 12 కెమెరాలు వస్తున్నాయి.
Apple Vision Pro launch : ఇక ఈ విజన్ ప్రోలో ఎం2 చిప్, ఆర్1 కోప్రాసెసర్, 16జీబీ ర్యామ్ వంటివి ఉంటాయి. ఆడియో- ఇంటిగ్రేటెడ్ ఆడియో డ్రైవర్స్, 6 మైక్రోఫోన్స్, 6 సెన్సార్స్, కంపాస్, యాంబియెంట్ లైట్ సెన్సార్, యాక్సలరోమీటర్, గైరోస్కోప్తో పాటు అనేక ఫీచర్స్ వస్తున్నాయి. విజన్ఓఎస్పై ఇది పనిచేస్తుంది. వైఫై, బ్లూటూత్, సిరి, టైప్-సీ ఛార్జర్ వంటివి కనెక్టెడ్ ఫీచర్స్‌గా ఉన్నాయి.
ఈ యాపిల్ విజన్ ప్రో ధర 3,499 డాలర్లు. అంటే సుమారు రూ. 2.88లక్షలు. వచ్చే ఏడాది తొలినాళ్లల్లో ఇది కస్టమర్లకు అందుబాటులోకి వస్తుంది.
మాక్‌బుక్ ఎయిర్ 15..
అందరు ఊహించినట్టే.. ఈ డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్లో మాక్‌బుక్ ఎయిర్ 15ని లాంచ్ చేసింది యాపిల్ సంస్థ. ఇందులో 15.3 ఇంచ్ స్క్రీన్ లభిస్తోంది. ప్రస్తుతం మాక్‌బుక్ ఎయిర్‌లో ఉన్న స్పెసిఫికేషన్స్నే ఇందులోనూ కొనసాగించింది దిగ్గజ టెక్ సంస్థ.
Macbook Air 15 : కాగా.. ఈ డివైజ్‌లో ఎం2 చిప్, రెండు థండర్‌బోల్ట్ పోర్ట్స్, మాగ్‌సేఫ్ ఛార్జింగ్ పోర్ట్‌లు లభిస్తున్నాయి. 18 గంటల సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్ ఈ మాక్‌బుక్ ఎయిర్ 15 సొంతం. నాలుగు రంగుల్లో వస్తున్న ఈ డివైజ్.. వచ్చే వారం నుంచి అందుబాటులో ఉండనుంది.
మాక్ స్టూడియోలో..
యాపిల్ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2023 ఈవెంట్లో మాక్ స్టూడియో భారీగా అప్డేట్ అయ్యింది! ఎం2 మ్యాక్స్, ఎం2 అల్ట్రా చిప్సెట్స్ను సంస్థ రివీల్ చేసింది. మాక్‌బుక్ ప్రో మోడల్స్‌లో ఎం2 మ్యాక్స్ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఎం1 మ్యాక్స్‌తో పోల్చితే ఇది 25శాతం వేగంగా పనిచేస్తుంది. ఇక ఎం2 అల్ట్రా 5ఎన్ఎం చిప్‌లో 192జీబీ వరకు ర్యామ్ సపోర్ట్ లభిస్తుంది.
ఐఓఎస్ 17..
ఐఫోన్, మెసేజెస్, ఫేస్‌టైమ్ యాప్స్ కోసం ఐఓఎస్ 17ను లాంచ్ చేసింది యాపిల్ సంస్థ. ఇక ఇప్పుడు టైపోగ్రఫీతో కస్టమైజ్డ్ పోస్టర్లను తయారు చేసుకోవచ్చు. కాలర్స్ స్క్రీన్‌పై వీటిని ఫిక్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా.. వాయిస్ మెయిల్, రియల్ టైమ్ ట్రాన్స్స్క్రిప్షన్తో పాటు ఫేస్‌టైమ్ కాల్స్‌ను రికార్డ్ చేసుకునే వెసులుబాటు కూడా లభిస్తోంది. ఆటో- కరెక్ట్, డిక్టేషన్ వంటి ఫీచర్స్ మరింత మెరుగుపడ్డాయి. మెసేజింగ్ యాప్‌నకు లొకేషన్ షేరింగ్ ఫీచర్ వచ్చింది. ఈ ఐఓఎస్ 17లో జర్నల్ అనే యాప్ కొత్తగా వస్తోంది. ఇందులో యూజర్లు తమకు నచ్చినవి రాసుకోవచ్చు.
ఐప్యాడ్ఓఎస్ 17..
Apple WWDC 2023 live updates : ఐప్యాడ్ఓఎస్ 17లో ఐప్యాడ్ లాక్ స్క్రీన్ కోసం స్మార్ట్ డిస్ప్లే మోడ్ వస్తోంది. ఇందులో విడ్జెట్స్, నోటిఫికేషన్స్, అపాయింట్మెంట్స్ వంటివి కనిపిస్తాయి. లైవ్ యాక్టివిటీ ఆప్షన్‌తో మెయిన్ స్క్రీన్‌లో మీరు మీ యాక్టివిటీలను ట్రాక్ చేసుకోవచ్చు. ఇందులో అనేక పీడీఎఫ్, ఎడిటింగ్, కస్టమైజ్డ్, కొలాబొరేషన్ ఫీచర్స్ ఉన్నాయి. అప్డేట్ కారణంగా స్టేజ్ మేనేజర్ మెరుగుపడింది. ఐప్యాడ్స్‌లో కొత్తగా హెల్త్ యాప్ వచ్చింది.
వాచ్ఓఎస్ 10..
వాచ్ఓఎస్ 10 ద్వారా విడ్జెట్స్‌ను తిరిగి తీసుకొచ్చింది యాపిల్ సంస్థ. ఫలితంగా.. టైమర్స్, వెథర్ చెకింగ్, పాడ్‌కాస్ట్, అపాయింట్మెంట్స్ వంటివి ఇందులో చూసుకోవచ్చు. డిజిటల్ క్రౌన్‌తో ఈ విడ్జెట్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. స్నూపీ వాచ్ ఫేస్, సైక్లింగ్- కంపాస్ ఫీచర్స్, హెల్త్ ఫీచర్స్, అప్డేటెడ్ మ్యాప్స్, వర్కౌట్ ఏపీఐలు వంటివి కొత్తగా వస్తున్నాయి.
వీటితో పాటు మాక్ఓఎస్ 14, టీవీఓఎస్ 17లను కూడా లాంచ్ చేసింది యాపిల్ సంస్థ. ఈ యాపిల్ డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్.. సోమవారం నుంచి శుక్రవారం వరకు జరగనుంది. మరిన్ని ఎగ్జైటింగ్ అప్డేట్స్ కోసం యాపిల్ ప్రియులు ఎదురుచూస్తున్నారు.