వైకల్యం శరీరానికే ఆలోచనలకు కాదు.. రోడ్ సైడ్ షాప్ టూ బిలియనీర్.. తప్పక చదవాల్సిన రియల్ స్టోరీ
10 September 2024, 13:00 IST
- 99 Speed Mart : చాలా మంది చిన్న విషయాలకే కుంగిపోతారు. జీవితం అయిపోయింది అనుకుంటారు. కానీ అందరూ తప్పక చదవాల్సిన ఓ వ్యక్తి కథ ఉంది. రోడ్డు పక్కన చిన్న షాపుతో ప్రారంభమైన ఓ వ్యక్తి.. కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఇందులో అసలు విషయం ఏంటంటే.. ఆ బిలియనీర్‌కు చిన్నప్పటి నుంచి శారీరక వైకల్యం.
99 స్పీడ్ మార్ట్ వ్యవస్థాపకుడు లీ థియామ్ వా
వ్యాపార ప్రపంచంలో ఎన్నో స్ఫూర్తిదాయకమైన విజయాలు, అపజయాలు ఉన్నాయి. వీటిలో ఒకటి 99 స్పీడ్ మార్ట్ రిటైల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు లీ థియామ్ వా కథ. మలేషియాలోని రోడ్‌సైడ్ స్టాల్‌లో చిరుతిండి విక్రయదారుడిగా మెుదలైన అతడి జీవితం.. ఇప్పుడు వేల కోట్ల సామ్రాజ్యానికి విస్తరించింది. మనిషి అనుకుంటే కానిది ఏమున్నది అని లీ థియామ్ జీవితం చెబుతోంది. తాజాగా ఈ బిలియనీర్ కంపెనీ ఐపీఓకు వచ్చింది. దీంతో అతడి జీవిత కథ వైరల్ అవుతోంది.
ఐపీఓకు లీ కంపెనీ
లీ వయస్సు ప్రస్తుతం 60 సంవత్సరాలు. అతని కంపెనీ కౌలాలంపూర్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఊహించిన అరంగేట్రం చేసింది. 99 స్పీడ్ మార్ట్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) 531 మిలియన్ డాలర్లు. ఇది గత ఏడు సంవత్సరాలలో మలేషియాలో అతిపెద్దది. ఇది లీని బిలియనీర్‌గా చేసింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, లీ సంపద 3.3 బిలియన్లు డాలర్లుగా అంచనా.
చిన్నతనంలో పోలియో
లీ కౌలాలంపూర్, మలక్కా జలసంధి మధ్య ఉన్న క్లాంగ్‌లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి కార్మికుడు. కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టపడేవాడు. 11 మంది పిల్లల్లో లీ ఒకరు. లీ ఆరేళ్లు మాత్రమే పాఠశాలకు వెళ్లాడు. అత్యంత పేదరికంలో జీవిస్తున్న లీ దురదృష్టవశాత్తు చిన్నతనంలోనే పోలియో బారిన పడ్డారు. దీంతో పక్షవాతం వచ్చి నడవలేని స్థితిలో ఉన్నారు. దీంతో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రోడ్డు పక్కన దుకాణం
అతని మొదటి రిటైల్ వ్యాపారం రోడ్డు పక్కన ఒక చిన్న దుకాణం. ఇది కూడా అతడి అవసరం నుండి పుట్టిందే. 1987లో ఈ 99 స్పీడ్ మార్ట్ కిరాణా దుకాణాన్ని తెరిచారు. ఒక దశాబ్దం తరువాత అతని కృషి ఎనిమిది దుకాణాలను నడిపించటానికి దారితీసింది. 1997లో కొనుగోలు కార్యనిర్వాహకురాలిగా వ్యాపారంలో చేరిన అతని భార్య Ng లీ టియెంగ్, కంపెనీని మరింత అభివృద్ధి చేయడంలో సహాయపడింది.
ఇప్పుడు అతిపెద్ద మార్ట్
99 స్పీడ్ మార్ట్ మలేషియాలో అతిపెద్ద మార్ట్‌గా ఎదిగింది. దేశవ్యాప్తంగా 2,600 కంటే ఎక్కువ దుకాణాలు ఉన్నాయి. కంపెనీ IPO ప్రకారం.. ఇది మినీ గామార్ట్ విభాగంలో 40 శాతం మార్కెట్ వాటాను, మలేషియాలో మొత్తం కిరాణా రిటైల్ మార్కెట్‌లో 12 శాతాన్ని కలిగి ఉంది. 2012లో ఫోర్బ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'నా శారీరక వైకల్యాల కారణంగా ఎవరూ నన్ను నియమించుకోరు. కాబట్టి నాకు నేనే సొంతంగా జీవితంలో నిల్చోవాలని నిర్ణయించుకున్నాను.' అని లీ చెప్పాడు.
99 లీ థియామ్ వా విజయం సాధించిన ఏకైక వ్యాపారం స్పీడ్ మార్ట్ మాత్రమే కాదు. తన వ్యాపార ప్రపంచాన్ని విస్తరించాడు. బర్గర్ కింగ్ రెస్టారెంట్‌తోపాటుగా అనేక ఫ్రాంచైజీల వ్యాపారాలలో వాటాలను కలిగి ఉన్నారు. అలయన్స్ బ్యాంక్ మలేషియా Bhdలో అతిపెద్ద వాటాదారులలో ఒకరిగా ఉన్నారు. వైకల్యం శరీరానికే.. మనసుకు కాదు.. అని లీ జీవితం చెబుతోంది.