Electric SUV Cars : ఇక నో వెయిటింగ్.. వచ్చే ఏడాది ఈ మూడు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లు వస్తున్నాయి!
22 December 2024, 19:00 IST
Electric Cars 2025 : కొత్త ఏడాదిలో కొన్ని ఎలక్ట్రిక్ కార్లు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా కంపెనీలు ఇప్పటికే వాటిని భారతీయ రోడ్లపై పరీక్షించాయి. వచ్చే ఏడాది కనిపించే ఛాన్స్ ఉన్న ఈవీ కార్లు ఏంటో చూద్దాం..
ప్రతీకాత్మక చిత్రం
కొన్నేళ్లుగా భారతీయ వినియోగదారుల్లో ఎలక్ట్రిక్ కార్ల(ఈవీ) డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. మీరు కూడా సమీప భవిష్యత్తులో కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ఆలోచిస్తుంటే మీ కోసం ఓ వార్త ఉంది. ప్రముఖ కార్ల తయారీదారులైన టాటా మోటార్స్, మారుతి సుజుకి, హ్యుందాయ్ ఇండియా తమ కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను వచ్చే సంవత్సరంలో తీసుకువచ్చే అవకాశం ఉంది. 2025లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాబోయే ఈ ఎలక్ట్రిక్ మోడళ్లను కూడా టెస్టింగ్ సమయంలో కనిపించాయి. ఆ 3 ఎలక్ట్రిక్ మోడళ్ల గురించి తెలుసుకుందాం..
హ్యుందాయ్ క్రెటా ఈవీ
హ్యుందాయ్ ఇండియా తన బెస్ట్ సెల్లింగ్ కారు క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. హ్యుందాయ్ క్రెటా ఈవీని భారత రోడ్లపై పలుమార్లు పరీక్షించారు. హ్యుందాయ్ క్రెటా ఈవీ 2025లో జరిగే ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రాబోయే ఈవీ 45 కిలోవాట్ల బ్యాటరీ ఉపయోగిస్తుందని, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
టాటా సియెర్రా ఈవీ
టాటా తన కొత్త ఎలక్ట్రిక్ కారు సియెర్రా ఈవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రాబోయే టాటా సియెర్రా ఈవీని వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో అంటే 2025లో విడుదల చేయవచ్చని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అయితే సియెర్రా ఈవీ ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో ప్రదర్శించే అవకాశం ఉంది. సియెర్రా మంచి ఫీచర్లతో రానుంది. ఇందులో వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతో వచ్చే 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. వైర్ లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ తో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ప్రీమియం లెథరెట్ అప్ హోల్ స్టరీ ఇంటీరియర్ ఎక్స్ పెక్టేషన్స్ లో ఉన్నాయి.
మారుతి సుజుకి ఇ-విటారా
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు మారుతి సుజుకి ఇ విటారా కూడా తన మొదటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మారుతి సుజుకి ఇ-విటారాను ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025 లో ప్రదర్శించే అవకాశం ఉంది. మారుతి సుజుకి ఇ-విటారా 49 కిలోవాట్, 61 కిలోవాట్ల 2 బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 550 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి.