YS Jagan : కుటుంబ కలహాలు అందరి ఇళ్లల్లో ఉండేవే.. నా తల్లి, చెల్లి ఫొటోలతో సమస్యలను డైవర్ట్ చేస్తున్నారు : జగన్
24 October 2024, 14:19 IST
- YS Jagan : తన కుటుంబంలోని కలహాల గురించి స్పందించారు వైఎస్ జగన్. అందరి ఇళ్లలో ఇలాంటి సమస్యలు ఉంటాయని.. వాటిని చూపించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా బాధితులు, మృతుల కుటుంబాలను పరామర్శించిన జగన్.. ఈ కామెంట్స్ చేశారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా డైవర్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తన తల్లి, చెల్లి ఫొటోతో సమస్యలను డైవర్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ కలహాలు అందరి ఇళ్లల్లో ఉండేవేనని.. ప్రతీ ఇంట్లో ఉన్న గొడవలే తమ ఇంట్లో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రచారం ఆపి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.
విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలను పరామర్శించిన జగన్.. పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆవెదన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో గ్రామస్వరాజ్యం తీసుకొచ్చామని.. కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయని మాజీ సీఎం వ్యాఖ్యానించారు.
'డయేరియాతో చనిపోయిన 14 మంది కుటుంబాలకు అండగా ఉంటాం. కుటుంబానికి రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నాం. మంచినీళ్లు కలుషితం అవుతుంటే కనీసం క్లోరినేషన్ చేయలేదు. చంపా నదిలో దారుణమైన పరిస్థితిలో నీళ్లు ఉన్నాయి. వాటర్ స్కీమ్ మెయింటెనెన్స్ రెన్యువల్ కూడా చేయలేదు. ఈ 5 నెలల్లో కనీసం క్లోరినేషన్ కూడా చేయలేదు' అని జగన్ వ్యాఖ్యానించారు.
'14 మంది డయేరియాతో మృతి చెందినా ప్రభుత్వానికి పట్టింపు లేదు. అక్టోబర్ 19న నేను ట్వీట్ చేసే వరకు ప్రభుత్వం స్పందించలేదు. మృతుల సంఖ్యపైనా మంత్రులు, అధికారులు తలోమాట చెప్పారు. అసలు రాష్ట్రంలో పాలన నడుస్తుందా. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా.. పేదల ప్రాణాలంటే లెక్కలేదా. ఇంతమంది చనిపోయినా కనీసం నివారణ చర్యలు చేపట్టలేదు' అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'వైఎస్ఆర్సీపీ హయాంలో గ్రామ సచివాలయం ద్వారా సేవలు అందించాం. వివిధ శాఖలకు చెందిన సేవలు సత్వరమే అందించగలిగాం. విలేజ్ క్లినిక్ ద్వారా 24/ 7 వైద్య సేవలు అందుబాటులో ఉండేవి. విలేజ్ క్లినిక్‌లను పీహెచ్‌సీలతో అనుసంధానం చేశాం. అన్ని డిపార్ట్‌మెంట్ల సిబ్బంది అందుబాటులో ఉండేవాళ్లు' అని జగన్ వివరించారు.
జగన్ మీడియాతో మాట్లాడుతుండగా.. గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులపై జగన్ సీరియస్ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి మీడియాను అడ్రస్ చేసేటప్పుడు కూడా పోలీసులు కంట్రోల్ చేయడంలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు.