Vijayawada Liquor Case: "మద్యం.. మల్లాది.. నిర్దోషి".. కల్తీ మద్యం కేసు నుంచి వైసీపీ ఎమ్మెల్యేకు విముక్తి
29 February 2024, 9:19 IST
- Vijayawada Liquor Case: విజయవాడలో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసు నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే YSRCP MLA మల్లాది విష్ణు బయటపడ్డారు. 2015లో ఆరుగు ప్రాణాలను బలిగొన్న ఘటనలో సాక్ష్యాలు లేకపోవడంతో ఎమ్మెల్యే Vishnu పై కేసు కొట్టేశారు.
వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై నమోదైన కల్తీ మద్యం కేసు కొట్టివేత
Vijayawada Liquor Case: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసులో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిర్దోషిగా బయటపడ్డారు. మల్లాది విష్ణుకు చెందిన బార్‌లో మద్యం కొనుగోలు చేసి సేవించిన ఆరుగురు అభాగ్యులు ప్రాణాలు కోల్పోయరు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఈ కేసులో మల్లాది విష్ణు నిర్దోషిగా బయటపడ్డారు
ఏమి జరిగిందంటే...
విజయవాడ కృష్ణలంకలో మల్లాది విష్ణుకు చెందిన హోటల్ కింద భాగంలో మద్యం దుకాణాన్ని నిర్వహించే వారు. స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో మల్లాది విష్ణు తల్లి పేరిట తీసుకున్న లైసెన్సుతో దుకాణాన్ని నిర్వహించే వారు. 2015 డిసెంబర్ 7వ తేదీ ఉదయం ఏడు గంటలకు మద్యం కొనుగోలు చేసిన వారంతా వరుసగా అస్వస్థతకు గురయ్యారు. నిర్ణీత వేళల కంటే ముందే దుకాణం తెరిచి మద్యం విక్రయాలు ప్రారంభించడంతో చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన వారు అక్కడే మద్యం కొనుగోలు చేసే వారు.
ఉదయాన్నే మద్యం కొనుగోలు చేసిన వారిలో 29మంది వాంతులు చేసుకుంటూ అస్వస్థతకు గురయ్యారు. కొందరు ఇళ్లకు చేరుకున్న తర్వాత అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీంతో వారందరిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారంత కూలీ పనులు చేసుకునే వారు. మిగిలిన తర్వాత కోలుకున్నారు.
ఘటన జరిగిన తర్వాత బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్న మల్లాది విష్ణును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్న భగవంతుల శరత్ చంద్ర, కావూరి పూర్ణచంద్రశర్మ, కావూరి లక్ష్మీ సరస్వతి, మల్లాది బాలత్రిపుర సుందరిలను నిందితులుగా చేర్చారు. బార్ నిర్వహిస్తున్న మల్లాది విష్ణు తల్లిని ఏ4గా పేర్కొన్నారు.ఈ కేసులో మల్లాది విష్ణు ఏ9గా, సోదరుడు మల్లాది శ్రీనివాస్ ఏ10గా అభియోగాలు మోపారు.కేసు దర్యాప్తు కోసం అప్పటి ప్రభుత్వం మహేష్ చంద్ర లడ్డా నేతృత్వంలో ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది.
కేసు విచారణలో ఉండగానే మల్లాది విష్ణు తల్లి బాలత్రిపురసుందరి, పొలాకి శ్రీనివాసరావు, పి.వెంకటరాజు, బి.శ్రీనులు చనిపోయారు. ఈ కేసు దర్యాప్తు తర్వాత 15మందిని నిందితులుగా పేర్కొన్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్లు 328,304 రెడ్ విత్ 34, ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ 37 కింద తొలుత కేసులు నమోదు చేశారు. దర్యాప్తను సిట్‌కు అప్పగించిన తర్వాత ఐపీసీ 420, 272, 273, 284, 337, 120(బి), 304 ఏ రెడ్ విత్ 34, ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 36,37 ప్రకారం కేసులు నమోదు చేశారు. బినామీ లావాదేవీల నిరోధక చట్టం కింద అభియోగాలు మోపారు.
దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత కేసులో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో విష్ణుతో పాటు మిగిలిన నిందితులపై కేసును కొట్టేస్తూ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో తీర్పు వెలువడింది. మల్లాది విష్ణుతో పాటు మరో పదిమందికి కేసు నుంచి విముక్తి లభించింది.
మద్యం నమూనాల్లో సైనేడ్ అవశేషాలు ఉన్నాయని హైదరాబాద్ ఏపీఎఫ్‌ఎస్‌ఎల్ పరీక్షల్లో తేలింది. మిథైల్ అల్కహాల్‌తో పాటు సోడియం సైనేడ్ అవశేషాలు ఉన్నట్టు సీఎఫ్‌ఎస్‌ఎల్ పరీక్షల్లో వెల్లడైంది. ఈ కేసులో సాక్ష్యులు ఉన్నా వాటిని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో కేసును కొట్టేశారు.
2015లో కేసు నమోదైన తర్వాత మల్లాది విష్ణు కొంత కాలం రిమాండ్‌లో ఉన్నారు. ఆ తర్వాత వైసీపీలో చేరి విజయవాడ సెంట్రల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజా మార్పులు చేర్పుల్లో విష్ణుకు వైసీపీ టిక్కెట్ నిరాకరించింది. ఘటన జరిగిన సమయంలో విజయవాడలో నెలకొన్న రాజకీయ వైరాలతో మల్లాది నిర్వహిస్తున్న బార్ మద్యంలో సైనేడ్ కలిపినట్టు ప్రచారం జరిగింది.