Extramarital affair : కడప జిల్లాలో ఘోరం - ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య!
21 December 2024, 9:00 IST
- వివాహేతర సంబంధం నేపథ్యంలో కట్టుకున్న భర్తనే భార్య హత్య చేయించింది. ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటన కడప జిల్లాలోని కొండాపురం మండల పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. భార్యతో పాటు హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేశారు.
ప్రియుడితో కలిసి భర్తనే హతమార్చిన భార్య
కడప జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధంతో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే భార్య హత్య చేసింది. పోలీసులు రంగంలో దిగి బాధితుడి భార్య, ఆమె ప్రియుడుతో సహా నలుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అయితే ఈ ఘటన మొదట గుర్తు తెలియని వ్యక్తి హత్యగా నమోదు అయింది. పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు బయటపడ్డాయి. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు.
వివాహేతర సంబంధం…
ఈ ఘటన కడప జిల్లా కొండాపురం మండలం లావనూరు గ్రామ శివారులో ఈనెల 16 జరిగినప్పటికీ శుక్రవారం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. కొండాపురం సీఐ మహ్మద్ రఫీ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కొండాపురం మండలం యల్లనూరులో సురేష్ (36), వీర కుమారి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సురేష్ భార్య వీర కుమారి యల్లనూరుకి చెందని బాబు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతోంది.
మందలించిన భర్త…!
ఈ విషయం ఆనోటా ఈనోటా వినబడి చివరికి వీర కుమారి భర్త సురేష్‌కు తెలిసింది. దీంతో భార్య వీరకుమారిని భర్త సురేష్ మందలించాడు. దీంతో ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఆమె పుట్టింటికి వెళ్లినప్పటి నుండి ప్రియుడు బాబు, వీరకుమారి రెగ్యులర్‌గా ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో భర్త సురేష్‌ను అడ్డం తొలగించుకోవాలని వీర కుమారి, బాబు నిర్ణయించుకున్నారు. దీనికి కుట్ర పన్నుతూ భర్తను హత మార్చేందుకు బాబు స్నేహితులైన సుభాన్‌కు రూ.1 లక్ష, కిరణ్ కుమార్‌కు రూ.50 వేలు సుపారీ ఇచ్చేందుకు వారి మధ్య ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు.
ప్లాన్ ప్రకారం రప్పించారు….
అందులో భాగంగానే ప్రియుడు బాబు, ఆయన స్నేహితులు కిరణ్, సుభాన్ కలిసి ఈనెల 16వ తేదీన సుభాన్ బర్త్ డే పార్టీ కొండాపురంలో ఉందని చెప్పి సురేష్‌ను బొలేరో వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. కొండాపురం మండలం లావనూరు గ్రామ శివారులోని నల్లవంక బ్రిడ్జి వద్దకు వచ్చి వాహనాన్ని ఆపారు. అక్కడ సురేష్‌కు బాగా మద్యం తాపించారు. దీంతో సురేష్ స్పృహ కోల్పోయారు. ఏం జరుగుతోందో తెలియని పరిస్థితుల్లో సురేష్ ఉండటంతో బాబు, కిరణ్, సుభాన్ ముగ్గురు కలిసి సురేష్ గొంతుకు తాడుకట్టి గట్టిగా బిగించారు. దీంతో సురేష్‌లో పెనుగులాట జరిగి ప్రాణాలు వదిలాడు. ఈ రకంగా హతమార్చి మృత దేహాన్ని అక్కడే విడిచి పెట్టి వెళ్లిపోయారు.
ఈనెల 17వ తేదీన అటుగా వెళ్తున్న కొంత మంది స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి ఎస్ఐ విద్యాసాగార్ సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తిగా నిర్ణయించారు. దీనిపై కొండాపురం పోలీసు స్టేషన్‌లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిసి… నిందితులు గురువారం సుగుమంచిపల్లె వీఆర్‌వో వద్ద లొంగిపోయారు. తామే హత్య చేసినట్లు అంగీకరించారు. అనంతరం నిందితులను వీఆర్‌వో పోలీసులకు అప్పగించారు.
పోలీసులు నిందితుల నుంచి బొలేరో వాహనంతో పాటు ఒక బైక్, సెల్‌ఫోన్, హత్యకు ఉపయోగించిన తాడు, జత చెప్పులు స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు హత్య సూత్రదారి అయిన వీరకుమారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు కొండాపురం సీఐ మహ్మద్ రఫీ తెలిపారు. భర్తను వీరకుమారి హత మార్చడంలో వివాహేతర సంబంధం ఉందని ఆయన తెలిపారు. అందులో భాగంగానే ప్రియుడితో కలిసి ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందని పేర్కొన్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స తెలుగు.