AP Goir Issue: కోర్టు కేసులు తేలేది ఎప్పుడు, జీవోఐఆర్ తెరుచుకునేది ఎప్పుడు? జాప్యానికి కారణమేంటి?
22 July 2024, 13:17 IST
- AP Goir Issue: వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన జీఓఐఆర్ వెబ్‌సైట్ తెరుచుకోకపోవడం వెనుక కారణాలేంటి?
ఇంకా తెరుచుకోని జీఓఐఆర్ వెబ్‌సైట్
AP Goir Issue: ప్రభుత్వ నిర్ణయాలను పారదర్శకంగా ప్రజల ముందు ఉంచే జీఓఈఆర్ వెబ్‌సైట్‌ను వైసీపీ ప్రభుత్వం నిలిపేసి నాలుగేళ్ల దాటుతోంది. ప్రభుత్వ జీవో బహిరంగంగా అందుబాటులో ఉంచడం వల్ల న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయనే అనుమానంతో వైసీపీ ప్రభుత్వం గోప్యత పాటించింది.
దాదాపు నాలుగేళ్లుగా ప్రభుత్వ నిర్ణయాలకు ఎలాంటి సమాచారం ప్రజలకు, ప్రతిపక్షాలకు అందుబాటులో లేకుండా పోయింది. దీనిపై విపక్షాలు పోరాటాలు, ఫిర్యాదులు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. హైకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా 93శాతం జీవోలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచడం లేదని హైకోర్టులో విచారణలో గత ప్రభుత్వం అంగీకరించింది.
రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ప్రభుత్వం విడుదల చేసే ఉత్తర్వులు (జీవోలు) పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రావటం లేదు. కొన్ని జీవోలను ఈ గెజిట్‌లో అందుబాటులో ఉంచుతున్నారు.మరికొన్నింటిని ఐ అండ్ పిఆర్ ద్వారా విడుదల చేస్తున్నారు.
ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ అధికారిక పోర్టల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూఇంగ్ రిజిస్టర్ (జీఓఐఆర్) వెబ్‌సైట్ ఇంకా పునరుద్ధరించలేదు.
గత నెలన్నర వ్యవధిలో వివిధ పథకాల పేర్లు మార్పు, అన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లలో గత ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటో తొలగించడం, వైఎస్ఆర్ యూనివర్శిటీ పేరును ఎన్టీఆర్ పేరుగా మార్చడం, వివిధ ప్రభుత్వ కార్యక్రమాల పేర్లు మార్చడం వంటి చకచక చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు ప్రజలకు అందుబాటులోకి వచ్చే జీవోఐఆర్‌ను మాత్రం పునరుద్ధరించే విషయంలో మాత్రం జాప్యం జరుగుతోంది.
2021 ఆగస్టు 16న గత వైసీపీ ప్రభుత్వం జీఓఐఆర్ ద్వారా జీవోల విడుదలను నిలిపి వేసింది. అప్పటి సీఎం సెక్రటరీ (సాధారణ పరిపాలన) రేవు ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయ మాన్యువల్ ప్రకారం జీవోలను విడుదల చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో అప్పటి నుంచి జీఓఐఆర్ వెబ్‌సైట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి.
అంతకుముందు ప్రభుత్వ ఉత్తర్వులు (జీఓలు)ను జీఓఐఆర్ వెబ్‌సైట్‌లో ప్రభుత్వం అప్‌లోడ్ చేసేది. కాన్ఫిడెన్షియల్ జీవోలు మాత్రం అందుబాటులో ఉండేవి కాదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని జీవోల విషయలో గోప్యత పాటించారు.
2021 ఆగస్టు 16న వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి. దీనిపై అప్పట్లో ప్రతిపక్షాల నుంచి, పౌర సమాజం నుంచి, మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. కొంత మంది హైకోర్టును కూడా ఆశ్రయించారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలు అయిన పిటీషన్లను హైకోర్టు విచారించింది. 2023 నవంబర్ 16న హైకోర్టు తీర్పు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయంప్రజా వ్యతిరేకంగా ఉందని పేర్కొంది. 2022 ఏప్రిల్ 1 నుండి ప్రభుత్వం విడుదల చేసిన జీఓలన్నింటిని ఏపీ గెజిట్ వెబ్‌సైట్‌లో చేర్చాలని ఆదేశించింది. ఒకవేళ ఏపీ గెజిట్‌లో జీఓలను అప్లొడ్ చేయకపోతే, సంబంధిత అధికారులను బాధ్యులుగా చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో సాధారణ పరిపాలన శాఖ అన్ని విభాగాలకు జారీ చేసింది. కానీ ఆ ఆదేశాలు అమలుకు నోచుకోలేదు.
ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ అప్పటి ప్రతిపక్ష పార్టీ, ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ నాటి రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కలిసి వినతిపత్రం అందజేసింది. టీడీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
కోర్టు కేసు ఇంకా పెండింగ్‌లోనే…
ఏపీ జీవోఐఆర్ వెబ్‌సైట్ నిర్వహణపై దాఖలైన కోర్టు కేసు విచారణ పెండింగ్‌లో ఉండటంతోనే జీవో వెబ్‌సైట్ అందుబాటులోకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జీఓఐఆర్ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించడానికి ముందు న్యాయపరమైన వివాదాలు ముగియాల్సి ఉందని చెబుతున్నారు.
పాత వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురావాలంటే ప్రభుత్వం తరపున వేసిన హైకోర్టులో వేసిన పిటిషన్లను కూడా ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకునే నిర్ణయం ఆధారంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)