Minister Roja: అంతా ఖండిస్తున్నారు కానీ సొంత పార్టీలో స్పందనేది?
08 October 2023, 18:20 IST
- Minister Roja: ఏపీ మంత్రి రోజా వ్యవహారంలో ఆ పార్టీ నాయకుల ధోరణి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి, మంత్రి రోజాపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసినా సొంత పార్టీ నాయకుల నుంచి పెద్దగా స్పందన రాకపోవడం పార్టీలో చర్చగా మారింది.
మంత్రి రోజా
Minister Roja: మంత్రి రోజా వ్యవహారంలో సినీతారల నుంచి స్పందన మొదలైన తర్వాత ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత బాబు కుటుంబ సభ్యులు, సతీమణి, కోడల బ్రహ్మణిల గురించి రోజా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బండారు శృతి మించారు. రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా ఆమెను కించపరిచేలా బండారు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ తరపున కేవలం మహిళా కమిషన్ ఛైర్మన్ మాత్రమే అధికారికంగా స్పందించారు.
బండారు వ్యాఖ్యల తర్వాత వాసిరెడ్డి పద్మ డీజీపీకి చర్యలు తీసుకోవాలని లేఖ రాయడంతో బండారును గత వారం నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. చివరకు ఆయనకు బెయిల్ మంజూరైంది. ఆ తర్వాత కూడా ఈ వ్యవహారం సద్దుమణగలేదు. రోజాపై బండారు చేసిన వ్యాఖ్యల విషయంలో టీడీపీ కొంత ఆత్మరక్షణలో పడింది. రోజా గతంలో తనను అలాగే అవమానించదంటూ తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత ఆరోపించారు.
బండారు చేసిన వ్యాఖ్యలపై రోజాకు అనుకూలంగా వైసీపి, బండారుకు మద్దతుగా టీడీపీ సోషల్ మీడియా విభాగాలు నిత్యం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రోజాకు మద్దతుగా సినీ నటి ఖుష్బూ రెండు రోజుల క్రితం వీడియో రిలీజ్ చేశారు. బండారు వ్యాఖ్యలు ఏమాత్రం సమర్ధనీయం కాదని, నారీశక్తి అంటున్న రోజుల్లో స్థాయికి తగని విధంగా మాజీ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండారు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఖష్బూు తర్వాత మహారాష్ట్ర అమ్రావతి ఎంపీ నవనీత్ కౌర్ కూడా స్పందించారు. రోజా తరపున మాట్లాడారు.టీడీపీ నాయకుడి వ్యాఖ్యల్ని ఖండించారు. ఆ తర్వాత నటి రాధిక శరత్ కుమార్, మీనాలు కూడా వీడియోలు విడుదల చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో రోజా, బండారు వివాదంలో టీడీపీ నాయకుడికి వ్యతిరేకంగా సినీతారలు ఏకమయ్యారు.
అదే సమయంలో వైసీపీలో ముఖ్యమైన మహిళా నాయకురాళ్లు ఎవరు ఇంతకాలం మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి రోజాకు వైసీపీలో కీలక స్థానం ఉంది. వైసీపీలో మహిళా మంత్రులు ఎందరు ఉన్నా ఆమె స్థానం ప్రత్యేకమే. బండారుతో రోజా వివాదం నేపథ్యంలో మహిళా మంత్రులు ఎవరు స్వచ్ఛంధంగా ఖండించకపోవడం ఆ పార్టీలో చర్చకు దారి తీసింది. సోషల్ మీడియా పేజీల్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తడంతో పార్టీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
రోజా వ్యవహార శైలే కారణమా...
వైసీపీలో ఉన్న మహిళా నేతలు కూడా రోజా పట్ల కాస్త అక్కసుతోనే ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారి పట్ల ఆమె పెద్దగా స్నేహపూర్వకంగా లేకపోవడం వల్లే తాజా వ్యవహారంలో వారి నుంచి సహానుభూతి రానట్టు తెలుస్తోంది. చివరకు పార్టీ జోక్యం చేసుకుని రోజా తరపున మాట్లాడాలని చెప్పే వరకు మిగిలిన వారు ఎవరు స్పందించకపోవడానికి ఇదే కారణంగా తెలుస్తోంది.
వైసీపీ ప్రస్తుత హోంమంత్రి తానేటి వనిత, వైద్యశాఖ మంత్రి విడదల రజిని, మంత్రి ఉషశ్రీ చరణ్ ఈ వారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నా రోజా ప్రస్తావన మాత్రం చేయలుదు. వీరితో పాటు మాజీ మంత్రి సుచరిత, పుష్పశ్రీవాణి సహా పెద్ద సంఖ్యలో మహిళలు ఉన్నా రోజాతో వారికి ఉన్న సంబంధాలు అంతంత మాత్రం కావడం వల్లే అంటి ముట్టన్నట్టు వ్యవహరించినట్టు తెలుస్తోంది. వైసీపీ నాయకురాళ్లు ఎవరు స్పందించక పోవడం, సినీతారలు మాత్రమే ఆమె తరపున అండగా ఉండటంపై అంతర్గత చర్చ జరుగుతోంది.