Dead Body Parcel Case : యండగండి డెడ్ బాడీ పార్శిల్ కేసులో వీడిన మిస్టరీ- మృతదేహం ఎవరిదో గుర్తించిన పోలీసులు
23 December 2024, 15:01 IST
Dead Body Parcel Case : యండగండి పార్శిల్ డెడ్ బాడీ కేసులో మిస్టరీ వీడింది. ఈ మృతదేహం కాళ్ళ గ్రామానికి చెందిన పర్లయ్యదిగా పోలీసులు గుర్తించారు. పర్లయ్యను శ్రీధర్ వర్మ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్తి వివాదాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
యండగండి డెడ్ బాడీ పార్శిల్ కేసులో వీడిన మిస్టరీ- మృతదేహం ఎవరిదో గుర్తించిన పోలీసులు
Dead Body Parcel Case : పశ్చిమగోదావరి జిల్లా యండగండి గ్రామంలో కలకలం రేపిన పార్శిల్ డెడ్ బాడీ మిస్టరీ వీడింది. ఈ డెడ్ బాడీ కాళ్ళ గాంధీనగర్ కు చెందిన పర్లయ్యగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో తులసి మరిది శ్రీధర్ వర్మను పోలీసులు నిందితుడిగా అనుమానిస్తున్నారు. పార్శిల్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి శ్రీధర్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. అతడి కోసం ఆరా తీస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి.
శ్రీధర్ వర్మ ఇప్పటికే మూడుపెళ్లిళ్లు అయ్యాయి. మూడో భార్యతో పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ గ్రామంలో శ్రీధర్ వర్మ ఉంటున్నాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు కాళ్ళ గ్రామంలోని శ్రీధర్‌వర్మ ఇంట్లో తనిఖీలు చేశారు. అతడి ఇంట్లో మరో ఖాళీ చెక్క పెట్టె ఉండడం చూసి పోలీసులు షాక్ తిన్నారు. శ్రీధర్ వర్మ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఫోన్లు, సిమ్ లు మారుస్తూ తప్పించుకుని తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కాళ్ళ గాంధీనగర్‌కు చెందిన పర్లయ్య మద్యానికి బానిసయ్యాడు. అతడ్ని శ్రీధర్ వర్మ పనికి తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో పర్లయ్యను హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. హత్య అనంతరం అతడిని చెక్క పెట్టేలో పెట్టి పార్శిల్ చేసినట్లు అనుమానిస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం మండలం యండగండి గ్రామంలో ముదునూరి రంగరాజు అనే వ్యక్తి కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు...తులసి, రేవతి. తల్లిదండ్రుల ఆస్తుల విషయంలో అక్కాచెల్లిళ్ల మధ్య వివాదాలు ఉన్నట్లు సమాచారం. భర్త అప్పులు చేసి పరారీలో ఉండడంతో తులసి తన కుమార్తెతో కలిసి... పాలకోడెరు మండలం గరగపర్రులో ఉంటున్నారు. తులసికి తన స్వగ్రామమైన యండగండిలో గత ప్రభుత్వం ఇంటి స్థలం మంజూరు చేసింది. ఆమె ఆర్థిక పరిస్థితి గమనించిన క్షత్రియ సేవాసమితి పౌండేషన్ ఇంటి నిర్మాణానికి అవసరమైన సామాన్లు అందిస్తుంది. ఈ ఇంటి నిర్మాణానికి అవసమైన సామాన్లు యండగండిలో తన తండ్రి రంగరాజు ఇంటికి పార్శిల్ ద్వారా పంపిస్తుంటారు. ఏ వస్తువులు పంపుతారో ముందుగా తులసి వాట్సాప్ సమాచారం ఇస్తారు క్షత్రియ సేవాసమితి పౌండేషన్ సభ్యులు.
ఈ క్రమంలో ఇంటికి కావాల్సిన కరెంటు సామాన్లు, ఇతర వస్తువులు పంపినట్లు తులసి వాట్సాప్ కు గురువారం మెసేజ్ వచ్చింది. ఆ మరుసటిరోజే తులసి తండ్రి రంగరాజు ఇంటికి ఒక చెక్క పెట్టె పార్శిల్ వచ్చింది. ఆ పార్శిల్ లో తాళం చెవి, లెటర్ ఉంది. ఆ లెటర్ లో తమకు రూ.1.30 కోట్లు చెల్లించాలని లేకపోతే ఇబ్బందులు పడతారని బెదిరింపు లేఖ ఉంది. ఈ లెటర్ చూసి కంగారు పడిన తులసి కుటుంబ సభ్యులు పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే అందులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. డెడ్‌బాడీ చూసి కంగారు పడిన తులసి వెంటనే ఉండి పోలీసులకు సమాచారం అందించింది. డెడ్‌బాడీ పార్శిల్ సంచలనం అవ్వడంతో... పోలీసులు కుటుంబ వివాదాల నేపథ్యంలో దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి రేవతి భర్త శ్రీధర్‌వర్మ కనిపించకపోవడంపై పోలీసులు అనుమానం వచ్చింది. అతడి కోసం గాలిస్తుండగా...అతడి ఇంట్లో మరో చెక్క పెట్టె దొరికింది.
ఆస్తి వివాదాల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీధర్ వర్మ దొరికితే ఈ కేసులో అసలు విషయాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. పార్శిల్ తీసుకొచ్చిన ఆటో డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 15 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.