తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sankranti Cock Fight 2024 : బరిలో దిగిన కోడి పుంజులు, గోదావరి జిల్లాల్లో జోరుగా పందాలు!

Sankranti Cock Fight 2024 : బరిలో దిగిన కోడి పుంజులు, గోదావరి జిల్లాల్లో జోరుగా పందాలు!

14 January 2024, 14:24 IST

google News
    • Sankranti Cock Fight 2024 : ఏపీలో కోడి పందాలు మొదలయ్యాయి. బరిలో కోడి పుంజులు కాలు దువ్వుతున్నాయి. ప్రత్యర్థి కోళ్లను పడగొట్టేందుకు పందెంరాయుళ్లు కోళ్లకు శిక్షణ ఇస్తున్నారు.
కోడి పందాలు
కోడి పందాలు (Twitter)

కోడి పందాలు

Sankranti Cock Fight 2024 : ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. సంక్రాంతి మొదటి రోజు భోగి సందర్భంగా ఊరూరా భోగి మంటలు వేసి పండుగను ప్రారంభించారు. ఇక సంక్రాంతికి ప్రత్యేకంగా చెప్పుకునే సంప్రదాయ కోళ్ల పందాలు మొదలయ్యాయి. గోదావరి జిల్లాల్లో పండుగ మూడు రోజులు కోడి పందాలు జోరుగా సాగుతాయి. ఇప్పటికే సిద్ధం చేసిన భారీ బరుల్లో కోడి పుంజులు కాలు దువ్వుతున్నాయి. హైటెక్ హంగులతో కోడి పందాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎల్ఈడీ స్క్రీన్లు, యాంకర్ల హడావుడితో కోడి పందాలు ఊపందుకున్నాయి. సంక్రాంతి వేడుకలను చూసేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల నుంచి గోదావరి జిల్లాలకు వాహనాలు క్యూకట్టాయి. భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, రాజమండ్రి, కోనసీమ ప్రాంతాల్లో భారీగా కోడి పందాలు జరుగుతున్నాయి. రాజకీయ నేతల మద్దతుతో కోడి పందాలకు నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేశారు.

సంప్రదాయంలో భాగం

కోడి పందాలను చూసేందుకు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, సినీ ప్రముఖులు ఉభయ గోదావరి జిల్లాలకు వస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ మార్గంలో వందల వాహనాలు కనిపిస్తు్న్నారు. కిలో మీటర్ల మేర టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ అవుతుంది. అనధికార అనుమతులతో కోడి పందాలు మొదలయ్యాయి. సంవత్సరమంతా బలమైన ఆహారంతో మేపిన కోడి పుంజులను పందెంరాయుళ్లు బరిలో దింపుతున్నారు. కోత పందాలతో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ప్రత్యర్థి పుంజులను ఢీకొట్టేందుకు బాదం, పిస్తా, వివిధ మెడిసన్లతో పాటు ఆర్మీ సైనికుడికి ఇచ్చిన శిక్షణ మాదిరి ఈత కొట్టించడం, ఇతర శిక్షణ ఇచ్చి కోళ్లను బరిలో దింపుతున్నారు పందెంరాయుళ్లు. ఇక బరుల వద్ద సందడి నెలకొంది. కోడి పందాలు చూసేందుకు భారీగా జనం తరలివస్తున్నారు. కోడిపందాలతో పాటు పక్కనే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. కోడి పందాలు చట్టరీత్యా నేరమైన రాజకీయ అండదండలతో ఏటా పండుగ మూడు రోజులు నిర్వహించడ ఆనవాయితీగా మారింది. సంప్రదాయంలో భాగంగా కోడి పందాలు అడుతున్నామని పందెంరాయుళ్లు వాదించడం ఇందులో కొసమెరుపు.

మా కోడి పందాలు ఫేమస్

తమిళనాడులో జల్లికట్టు ఎంత ఫేమస్సో...మా కోడి పందాలు అంతే ఫేమస్ అంటున్నారు గోదారోళ్లు. పల్నాటి యుద్ధం పేరిట కోడి పందాలను చరిత్రలో రికార్డ్ చేశారు. పూర్వకాలంలో రాజులు కోడి పందాలు... ఆట విడుపుగా నిర్వహించేవారని చరిత్ర చెబుతోంది. అయితే ఏటా కోడి పందాల్లో వందల కోట్లు చేతురు మారుతున్నాయి. 2019 లెక్కల ప్రకారం పండుగ మూడు రోజుల్లో రూ.900 కోట్ల ఆదాయం వస్తుంచిందని ఓ అంచనా. ఏటా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షలకు పైగా కోడి పుంజులు పందాల్లో కాలు దువ్వుతాయట. పందాలతో పాటు పేకాట పోటీలు, గుండాట, రికార్డింగు డ్యాన్సుల వంటివి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

బరులకు భారీగా ధరలు

ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందాలు జోరుగు జరుగుతున్నాయి. నిర్వాహకులు భారీ ఏర్పాట్లలో పందెంరాయుళ్లు కోళ్లను రంగంలోకి దింపారు. పెద్ద బరుల వద్ద రాత్రుళ్లు కూడా పందాలు ఆడేందుకు ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారు. పోలీసుల ఆంక్షలు ఉన్నా... పందెంరాయుళ్లు వెనకాడడంలేదు. కొన్నిచోట్ల పోలీసుల సమక్షంలోనే పందాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోడి పందాలు, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారుల హెచ్చరికలు ఉన్నా వందల కోట్ల రూపాయలు చేతులు మారుతుండడం మామూలైంది. పెద్ద బరులకు రూ.లక్ష, ఓ మోస్తరు బరికి రూ.70 వేలు, మిగిలిన వాటికి బరుల ప్రాతిపదికన ధరలు నిర్ణయించి నిర్వాహకులు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

తదుపరి వ్యాసం