West Godavari District : మహిళ ఇంటికి పార్శిల్ - తెరిచి చూస్తే డెడ్ బాడీ, బెదిరింపు లేఖ లభ్యం
20 December 2024, 13:43 IST
- Woman Receives Parcel With Body : పశ్చిమగోదావరి జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. యండగండికి చెందిన ఓ మహిళ ఇంటికి పార్శిల్‌లో గుర్తుతెలియని మృతదేహం రావటం కలకలం రేపింది. దీనిపై సమాచారం అందుకున్న జిల్లా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపి… వివరాలు సేకరిస్తున్నారు.
పార్శిల్‌లో గుర్తుతెలియని మృతదేహం representative image
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలో పరిధిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ ఇంటికి వచ్చిన పార్శిల్ లో గుర్తు తెలియని మృతదేహాం లభ్యమైంది. దీంతో విస్తుపోయిన సదరు మహిళ కుటుంబం… వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.
సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ నయీం అస్మీ అక్కడికి చేరుకున్నారు. పార్శిల్ లో వచ్చిన మృతదేహాం పూర్తిగా కుల్లిపోయినట్లు గుర్తించారు. గుర్తు తెలియని మృతదేహాంతో పాటు రూ.1.3 కోట్లు డిమాండ్ చేస్తూ రాసిన బెదిరింపు లేఖ కూడా దొరికింది. తమ డిమాండ్‌ను నెరవేర్చకుంటే తీవ్ర పరిణామాలుంటాయని లేఖలో పేర్కొన్నట్లు గుర్తించారు.
ఏం జరిగిందంటే…?
నాగ తులసి అనే మహిళ గతంలో ఇంటి నిర్మాణం కోసం క్షత్రియ సేవా సమితిని ఆర్థిక సహాయం కోరింది. లైట్లు, ఫ్యాన్లతో పాటు విద్యుత్ ఉపకరణాలు అందజేస్తామని వాట్సాప్ ద్వారా ఆమెకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఒక బాక్స్‌ను ఆమె ఇంటి వద్దకు చేరింది. అయితే తులసి పార్శిల్‌ను తెరిచి చూడగా… దాదాపు 45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మృతదేహం మరియు బెదిరింపు లేఖను చూసి షాక్ కు గురైంది.
మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక పరీక్షల ప్రకారం సదరు వ్యక్తి 4-5 రోజుల క్రితం మరణించినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పార్శిల్ డెలివరీ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు.