Weather Update : మూడు రోజుల్లో రాష్ట్రమంతట నైరుతి రుతుపవనాలు.. ఆ జిల్లాల్లో వర్షాలు
15 June 2022, 16:49 IST
- రాయలసీమలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజుల్లో రాయలసీమలోని మరికొన్ని ప్రాంతాలకు, నాలుగైదు రోజుల్లో కోస్తా ఆంధ్రాకు విస్తరిస్తాయని పేర్కొంది.
ప్రతీకాత్మక చిత్రం
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ముందుకు సాగుతున్నాయి. మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరిస్తున్నట్టుగా ప్రకటించింది. రెండు మూడు రోజుల్లో రాయలసీమలోని మరికొన్ని ప్రాంతాలకు, నాలుగైదు రోజుల్లో కోస్తా ఆంధ్రకు విస్తరించున్నట్టు తెలిపింది. నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించిన నేపథ్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టగా, కోస్తా జిల్లాల్లో అనేక చోట్ల ఎండల తీవ్రత కొనసాగుతోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నప్పటికీ వాతావరణం వేడిగా ఉంది.
రానున్న రెండు మూడు రోజుల్లో రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనంతపురం, చిత్తూరు, కడపలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి రుతుపవనాల ఆగమనంతో మొదలైన వర్షాలతో నిన్న ఉపశమనం కలిగింది. కోస్తాంధ్ర జిల్లాల్లోకి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. ప్రకాశం జిల్లా ఉత్తర భాగాలు, గుంటూరు జిల్లా మీదుగా రుతుపవనాలు విస్తరిస్తోంది. పల్నాడు జిల్లా నర్సారావుపేట - చిలకలూరిపేట పరిధిలో వర్షాలు కురిశాయి. బాపట్ల జిల్లాలో, ప్రకాశం జిల్లా గిద్దలూరు వైపు వర్షాలు పడ్డాయి.
తెలంగాణలో వర్షాలు
నైరుతి రుతుపవనాల ఆగమనంతో తెలంగాణలో తొలకరి జల్లులు కురుస్తున్నాయి. గత ఏడాది జూన్ తొలి వారంలో వచ్చిన రుతుపవనాలు ఈ ఏడాది రెండో వారం తరువాత తెలంగాణలో ప్రవేశించాయి. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్ కు మాత్రం భారీ వర్ష సూచన ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. దీంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది.
టాపిక్