Vizianagaram Train Accident : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం- రెండు రైళ్లు ఢీ, ఆరుగురు మృతి!
29 October 2023, 21:12 IST
- Vizianagaram Train Accident : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సిగ్నల్ కోసం ఆగిఉన్న ప్యాసింజర్ రైలును విశాఖ-రాయగడ ట్రైన్ ఢీకొట్టింది.
విజయనగరంలో రైలు ప్రమాదం
Vizianagaram Train Accident : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద రెండు రైళ్లు ఢీకొన్నాయి. విశాఖపట్నం నుంచి పలాస వెళ్తోన్న ప్రత్యేక ప్యాసింజర్ ట్రైన్ అలమండ-కోరుకొండ రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ పడకపోవడంతో పట్టాలపై నిలిచి ఉంది. ఆ సమయంలో ఆగి ఉన్న ప్యాసింజర్ రైలును వెనుక నుంచి విశాఖ-రాయగడ స్పెషల్ ట్రైన్ ఢీకొట్టింది. రైల్వే సిబ్బంది, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖ నుంచి సహాయక బృందాలు ఘటనాస్థలికి బయలుదేరారు. ఈ రైలు ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని సమాచారం. రెండు రైళ్లు ఢీకొనడంతో ఈ ప్రాంతంలోని విద్యుత్ వైర్లు తెగిపోయి విద్యుత్ కు అంతరాయం కలిగింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగి అవకాశం ఉందని తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
ఆరుగురు మృతి
ప్రమాద స్థలంలో పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాదస్థలికి చేరుకున్న విజయనగరం ఎస్పీ.. సహాయ చర్యలను పర్యవేక్షిస్తు్న్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఆరుగురు మృతిచెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక బోగీ నుంచి చిన్నారులు, ప్రయాణికుల ఆర్తనాదాల వినిపిస్తు్న్నాయి. వారిని రక్షించేందుకు ఎలక్ట్రికల్ సిబ్బంది, రైల్వే సహాయక సిబ్బంది, ఉన్నతాధికారులు సహాయ చర్యలు చేపట్టారు.
హెల్ప్ లైన్ నంబర్లు ఇవే!
విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బాధితుల సమాచారం కోసం రైల్వే అధికారులు హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. 0891 2746330, 0891 2744619, 81060 53051, 81060 53052, 85000 41670, 85000 41677, 83003 83004, 85005 85006 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.
సత్వర సహాయ చర్యలకు సీఎం జగన్ ఆదేశాలు
విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని ఎక్కువ అంబులెన్స్‌లను పంపించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి మంచి వైద్యం అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సత్వర సహాయక చర్యలు చేపట్టేందుకు, క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలను సమన్వయం చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.