AP Dy Speaker : డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్ర స్వామి
17 September 2022, 11:05 IST
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్ర స్వామి ఎన్నిక లాంఛనం కానుంది. విజయనగరం జిల్లా ఎమ్మెల్యే వీరభద్ర స్వామి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కోలగట్ల మినహా ఎవరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. సోమవారం కోలగట్ల ఎన్నికను అసెంబ్లీలో ప్రకటించనున్నారు.
డిప్యూటీ స్పీకర్ నామినేషన్
AP Dy Speaker ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా కోలగట్ల వీరభద్ర స్వామి నామినేషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా శుక్రవారం అసెంబ్లీలో అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు వద్ద కోలగట్ల వీరభద్ర స్వామి నామినేషన్ దాఖలు చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన వీరభద్ర స్వామి ఈ ఏడాది జరిగిన మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణలో మంత్రి పదవి వస్తుందని ఆశించినా పదవి దక్కలేదు. రాష్ట్ర క్యాబినెట్‌లో కొన్ని కులాలకు ప్రాతినిధ్యం లేకుండా పోయిందనే విమర్శలు కూడా వచ్చాయి.
డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కోన రఘుపతి గురువారం రాజీనామా చేశారు. ఆ పదవికి సంబంధించిన నోటిఫికేషన్‌ను సభలో స్పీకర్ శుక్రవారం ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలలోపు నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వీరభద్ర స్వామి నామినేషన్ వేశారు.
AP Dy Speaker నామినేషన్ దాఖలు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు మరియు బిసి సంక్షేమం,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు,మాజీమంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పి.పుష్పశ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ వేసిన తర్వాత కోలగట్ల వీరభద్ర స్వామి శాసన సభాపతి తమ్మినేని సీతారాంను కలిశారు. గడువు ముగిసే సమయానికి కోలగట్ల మినహా ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. సోమవారం కోలగట్ల ఎన్నికను స్పీకర్ సభలో ప్రకటించనున్నారు.
విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్న కోలగట్ల వీరభద్ర స్వామి 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్ధిగా టిడిపి అభ్యర్ధి అశోక్ గజపతిని ఓడించారు. 2009లో అశోక్ గజపతిరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి 49వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి టిడిపి అభ్యర్ధి మీసాల గీత చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో 61వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2019లో తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొత్త ప్రభుత్వం వైశ్య సామాజిక వర్గం తరపున ఆయనకు మంత్రి పదవి ఖాయమని భావించినా అనూహ్యంగా వెల్లంపల్లికి పదవి దక్కింది. తాజాగా ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టారు.