Visakha News : నిఖార్సైన రాజకీయ నేత- 1000 మందికి కోడి, క్వార్టర్ మందు పంపిణీ!
25 October 2023, 17:29 IST
- Visakhapatnam News : ఎన్నికలకు ముందే విశాఖలో పంపిణీ కార్యక్రమం మొదలైంది. స్థానికంగా ఓ వైసీపీ నేత దసరా సందర్భంగా కోడి, క్వార్టర్ మందు పంపిణీ చేసి మందుదాత అని అనిపించుకున్నారు.
కోడి, క్వార్టర్ పంపిణీ చేస్తున్న వైసీపీ నేత దొడ్డి బాపు ఆనంద్
Visakhapatnam News : తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగను ఎంతో ఘనంగా చేసుకుంటారు. పండుగ నాడు కోడి కూర, కిక్కిచ్చే చుక్క ఉంటే కొందరికి పండుగే. దసరా పండుగ నాడు యజమానులు తమ వద్ద పనిచేసే వాళ్లకు బోనస్ లు ఇస్తుంటారు. ఇక రాజకీయ నేతలైతే తమ మద్దతుదారులకు మందు, ముక్క తప్పనిసరిగా ఇస్తారు. ఇలాంటి ఘటననే విశాఖలో చోటుచేసుకుంది. దసరా పండుగ నాడు విశాఖ దక్షిణ మండల వైసీపీ అధ్యక్షుడు దొడ్డి బాపు ఆనంద్ తమ మద్దతుదారులు, మరికొంత మందికి కోడి, లిక్కర్ బాటిల్ పంపిణీ చేశారు. ఈ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. విశాఖ డాబా గార్డెన్స్‌లోని వైసీపీ ఆఫీసు వద్ద మంగళవారం నాడు ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వైసీపీ నేత కోడి, మద్యం పంపిణీ చేశారు. గతంలో కేజీ మటన్ ఇచ్చామని, ఈ ఏడాది కోడి, క్వార్టర్ మందు ఇస్తున్నట్లు ఆయన బహిరంగంగానే చెప్పుకున్నారు. మద్యపాన నిషేధం అంటూ ప్రచారం చేసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు మద్యం బాటిల్స్ పంపిణీ చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
1000 మందికి పంపిణీ
విశాఖ సౌత్ నియోజకవర్గ వైసీపీ మండల అధ్యక్షుడు దొడ్డి బాపు ఆనంద్, మంగళవారం దసరా పండుగ నాడు ప్రజలకు కోడి, మందు బహిరంగంగా పంపిణీ చేశారు. బతికి ఉన్న కోడి, క్వాటర్ మందు బాటిళ్లను దాదాపు 1000 మందికి పంపిణీ చేసి విమర్శల పాలయ్యారు. డాబా గార్డెన్స్ 31వ వార్డులో జరిగిన ఈ పంపిణీ కార్యక్రమానికి ప్రజలు బారులు తీరారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కటౌట్ కట్టి స్థానికులకు కిక్కిచ్చే బహుమతులు పంచారు. సాధారణంగా ఎన్నికల సమయంలో కనిపించే ఇలాంటి దృశ్యాలు ఎన్నికలకు ముందే కనిపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఈ కిక్ గిఫ్టుల పంపిణీపై విశాఖలో చర్చ జరుగుతోంది. దొడ్డి బాపు ఆనంద్ ముందు చూపు ఉన్న నేత అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఆయనే నిఖార్సైన రాజకీయ నేత అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.