Visakha Crime : విశాఖపట్నం జిల్లాలో ఘోరం, గొర్రెను అమ్మిన డబ్బుల ఇవ్వలేదని తండ్రిని హత్య చేసిన కొడుకు
16 October 2024, 22:34 IST
Visakha Crime : విశాఖ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గొర్రెను అమ్మిన డబ్బులు ఇవ్వలేదని తండ్రితో గొడవ పడి చివరకు హత్య చేశాడు ఓ కొడుకు. మద్యానికి బానిసైన కొడుకు ఈ దారుణానికి ఒడిగట్టాడనని స్థానికులు అంటున్నారు.
విశాఖపట్నం జిల్లాలో ఘోరం, గొర్రెను అమ్మిన డబ్బుల ఇవ్వలేదని తండ్రిని హత్య చేసిన కొడుకు
విశాఖపట్నం జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. గొర్రెను అమ్మిన డబ్బుల కోసం తండ్రితో కొడుకు గొడవపడ్డాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో చివరకు తండ్రినే హత్య చేశాడు. కుటుంబంతో సరదాగా గడింపేందుకు దసరా పండుగకు ఇంటికి వచ్చిన ఓ తండ్రి పాలిట కొడుకు కాలయముడయ్యాడు. డబ్బులు ఇవ్వలేదని అత్యంత కిరాతకంగా కత్తితో గొంతుకోసి మరీ దారుణానికి ఒడిగట్టాడు.
ఈ ఘటన విశాఖపట్నం జిల్లా జీవీఎంసీ 88వ వార్డు నరవ పరిధిలోని మన్నెపాలెంలో మంగళవారం సాయంత్రం జరిగింది. మన్నెపాలెంలో ఎంగలి దేవుడు (60), భార్య దేవి, కుమారులు గోపీ, అచ్యుతరావు కలిసి నివాసిస్తున్నారు. దేవుడు తోట పనులు చేసేందుకు తెలంగాణ ప్రాంతానికి వెళ్లి వస్తుంటారు. భార్య స్థానికంగానే కూలీ పనులు చేస్తుంటారు. చిన్న కుమారుడు గోపీ (25) తనకు నచ్చితే బిల్లింగ్ సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. అది కూడా సవ్యంగా చేయడు. ఒక రోజు వెళ్తే నాలుగు రోజులు పని మానేస్తాడు. పెద్ద కుమారుడు అచ్యుతరావు ప్రైవేటుగా భూముల సర్వేలు చేస్తుంటారు.
దసరా పండుగ కనుక కుటుంబంతో సరదాగా గడిపేందుకు దేవుడు ఇంటికి వచ్చాడు. మంగళవారం ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో గోపీ ఇంట్లో ఉన్న తన తండ్రితో గొడవపడ్డారు. ఇటీవల ఒక గొర్రె పిల్లను దేవుడు అమ్మగా ఆ డబ్బులు ఇవ్వమని గోపీ పట్టుపట్టాడు. తండ్రి అందుకు నిరాకరించారు. దీంతో కోపోద్రిక్తుడైన గోపీ క్షణికావేశంలో తండ్రిని మంచంపై పడేసి అత్యంత కిరాతకంగా కత్తితో గొంతు కోశాడు. దీంతో రక్తపు మడుగుల్లో తండ్రి అక్కడికక్కడే మరణించాడు. వెంటనే నిందితుడు గోపీ అక్కడి నుంచి పరారయ్యాడు.
తలుపులు తీసి ఇంట్లో నిశ్శబ్దంగా ఉండటం గమనించిన స్థానికులు లోపలికి వెళ్లి చూడగా దేవుడు రక్తపు మడుగుల్లో పడి ఉన్నాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికుల వద్ద వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వి సతీష్ కుమార్ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
ఈ దారుణ ఘటనతో మన్నెపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరు అయ్యారు. కుటుంబంతో సరదాగా గడపడానికి వస్తే కొడుకు చేతులోనే అనంతలోకానికి వెళ్లిపోయాడని స్థానికులు చెబుతున్నారు. మద్యానికి బానిస అయిన నిందితుడు తండ్రి పాలిట కాల యముడయ్యాడని అంటున్నారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు