Visakha News : భీమిలిలో దారుణం- పెంపుడు కుక్క కాటుతో తండ్రి కొడుకులు మృతి
26 June 2024, 16:26 IST
- Visakha News : పెంపుడు కుక్క కాటుకు తండ్రి, కొడుకులు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా భీమిలిలో చోటుచేసుకుంది. వారం క్రితం తండ్రి, కొడుకుని పెంపుడు కుక్క కరిచింది.
భీమిలిలో దారుణం- పెంపుడు కుక్క కాటుతో తండ్రి కొడుకులు మృతి
Visakha News : పెంపుడు కుక్క కాటుకు తండ్రి కొడుకులు బలయ్యారు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఎగువ పేటలో చోటు చేసుకుంది. విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఎగువ పేటకు చెందిన అరిమిల్లి నర్సింగరావు (59) కుక్కను పెంచుకుంటున్నారు. ఐదేళ్లుగా ఆ కుక్కను పెంచుకుంటున్నారు. అయితే వారం రోజుల క్రితం నర్సింగరావు, కుమారుడు భార్గవ్ (26)ను పెంపుడు కుక్క కరిచింది. భార్గవ్ ను ముక్కు మీద, నర్సింగరావును కాలిపై కరిచింది. ఆ కుక్క రెండు రోజుల క్రితం చనిపోయింది. ఆ కుక్కను మున్సిపాలిటీకి అప్పగించారు. దీంతో అప్రమత్తమైన నర్సింగరావు, భార్గవ్ రేబిస్ ఇంజక్షన్స్ వేయించుకున్నారు. అయితే భార్గవ్ బ్రెయిన్ తో పాటు ఇతర భాగాలకు రేబిస్ సోకడంతో చిక్సిత పొందుతూ నాలుగు రోజుల క్రితం మరణించాడు. కొడుకు మృతి చెందడంతో మనస్తాపంతో తండ్రి నర్సింగరావు కూడా మరణించాడు. నర్సింగరావు భీమిలి బస్టాండ్ లో సూపర్ వైజర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మరోవైపు నర్సింగరావు కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఆయన మంచానికే పరిమితం అయ్యాడు. తప్పనిసరి పరిస్థితుల్లో భార్య సాయంతో గత పదేళ్లుగా ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్నారు. అనారోగ్యానికి తోడు కుమారుడి మృతితో మనస్తాపానికి చెందిన ఆయన మంగళవారం ఉదయం మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి
కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు మండలం ఆత్కూరు వద్ద చెన్నై-కలకత్తా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కొండమోడుకు చెందిన పుల్లపు దుర్గారావు (40) బొలెరో వాహనంలో టమాటా బాక్సుల లోడ్ ను ఏలూరుకు వెళ్తున్నాడు. ఉంగుటూరు మండలం ఆత్కూరు వద్దకు చేరుకోగానే వాహనం టైర్ పంక్చర్ అయింది. అటుగా వస్తున్న మరో బొలెరో వాహనం డ్రైవర్ ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురానికి చెందిన పోగుశెట్టి చైతన్య శ్రీసాయి (20) సాయంతో పంక్చర్ వేస్తున్నాడు. అయితే అదే సమయంలో రహదారిపై అతి వేగంగా సిమెంట్ లోడు లారీ వీరిని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో చైతన్య సాయి అక్కడికక్కడే మరణించాడు. గాయాలతో పడి ఉన్న మరో డ్రైవర్ దుర్గారావును విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దుర్గారావు మరణించాడు. కేసు నమోదు చేసుకుని ఆత్కూరు ఎస్ఐ పైడిబాబు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం చేసిన తరువాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేశారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు