Hyd Brutal Attack: హైదరాబాద్‌లో ఘోరం.. పెంపుడు కుక్క వివాదంతో భార్యాభర్తలపై యువకుల దాడి
Hyd Brutal Attack: హైదరాబాద్‌లో దారుణ ఘటన సీసీటీవీల్లో రికార్డయ్యింది. పెంపుడు కుక్కల విషయంలో తలెత్తిన వివాదంతో దంపతులపై విచక్షణారహితంగా కర్రలు,రాడ్లతో దాడి చేశారు. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.
Hyd Brutal Attack: చిన్నపాటి వివాదాన్ని మనసులో పెట్టుకుని ఓ వ్యక్తిపై దారుణంగా నలుగురు యువకులు దాడి చేశారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పెంపుడు కుక్కల విషయంలో జరిగిన వివాదాన్ని మనసులో పెట్టుకుని ఎదురింటికి చెందిన వ్యక్తిపై నలుగురు యువకులు మూకుమ్మడిగా దాడి చేశారు.
భర్తపై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్యను కూడా చితకబాదారు. కిందపడిపోయిన భార్యాభర్తలపై విచక్షణా రహితంగా కర్రలతో దాడి చేశారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా అమానుషంగా భార్యభర్తల్ని నడిరోడ్డుపై పడేసి చితకబాదారు.
మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రహమత్‌నగర్‌లో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. పెంపుడు కుక్క కారణంగానే ఓ కుటుంబంపై యువకులు దాడి చేశారు. వీధిలో కుక్కను పట్టుకుని నిలబడిన వ్యక్తిపై మూకుమ్మడిగా దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
కుక్కతో పాటు దాన్ని పెంచుకుంటున్న శ్రీనాథ్ అనే వ్యక్తిని తీవ్రంగా గాయపరిచారు. దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన శ్రీనాథ్ భార్య స్వప్నను కూడా కిందపడేసి కర్రలతో చితక బాదారు. అంతటితో ఆగకుండా ఇంట్లోకి పారిపోయిన కుక్కను కూడా కర్రలతో చితకబాదారు.
మానవత్వం మరిచి అత్యంత పాశవికంగా యువకులు వ్యవహరించిన తీరు అందరిని కలిచి వేసింది. చిన్నపాటి వివాదానికి కక్ష పెంచుకుని ఉన్మాదంతో చెలరేగిపోయారు. గాయాలపాలైన శ్రీనాథ్ కుటుంబాన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో దాడి చేసిన ధనుంజయ్‌తో పాటు మరో నలుగురిపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎదురెదురు ఇళ్లలో ఉంటున్న శ్రీనాథ్, ధనుంజయ్‌ల మధ్య పెంపుడు కుక్కల విషయంలో వివాదం ఉంది. ఈ నెల 8వ తేదీ ఉదయం శ్రీనాథ్, స్వప్నలు పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు వెళుతుండగా ధనుంజయ్‌ను చూసి శ్రీనాథ్ కుక్క మొరిగింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. దీనిపై పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.
దానిని మనసులో పెట్టుకున్న ధనుంజయ్, మే 14వ తేదీ మంగళవారం సాయంత్రం కుక్కను తీసుకుని వీధిలో నిలబడ్డాడు. అటుగా వచ్చిన ధనుంజయ్ మరో నలుగురితో కలిసి శ్రీనాథ్‌పై దాడికి పాల్పడ్డాడు. ముందే దాడికి పథకం వేసుకున్న ధనుంజయ్ మరో నలుగురితో కలిసి కర్రలతో వారిపై దాడి చేశాడు. భార్యాభర్తల్ని చితకబాదారు. దంపతులపై దాడి చేస్తుండటంతో స్థానిక మహిళలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కర్రలు, రాళ్లతో వారిని చితకబాదారు.
ఇంట్లోకి పారిపోయిన కుక్కను సైతం తీవ్రంగా గాయపరిచారు.. ఈ ఘటనలో శ్రీనాత్ పరిస్థితి విషమంగా ఉంది. స్వప్నకు కాళ్లు చేతులు విరిగాయి. శ్రీనాథ్ సోదరుడు మధు మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. నిందితులు దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.