AP BRS Thota Chandra Sekhar : ఏపీపై బీఆర్ఎస్ ఫోకస్, 175 స్థానాల్లో పోటీకి సై
10 April 2023, 9:59 IST
- AP BRS Thota Chandra Sekhar : ఏపీపై గురిపెట్టిన బీఆర్ఎస్... వచ్చే ఎన్నికల్లో పోటీపై కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతామని బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా బిఆర్‌ఎస్ సత్తా చూపుతామంటున్నారు.
బీఆర్ఎస్ ఏపీ అధ్య.క్షుడు తోట చంద్రశేఖర్
AP BRS Thota Chandra Sekhar : ఏపీపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించిన ఆ పార్టీ... మొత్తం 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలో నిలిపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. వైసీపీ, టీడీపీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో వైసీపీ,టీడీపీ విఫలమయ్యాయని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన విభజన అంశాలు సాధించడంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయన్నారు.
ఏపీ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఏపీలో రాజకీయ శక్తిగా ఎదిగేందుకు అన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటామని చంద్రశేఖర్ తెలిపారు. ఇంకా ఏడాది టైమ్ మాత్రమే టైం ఉందని, అన్ని సీట్లలో పోటీ చేయడం అంటే కష్టమే కానీ ఈలోపు అభ్యర్థులను రంగంలోకి దింపుతామని చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేశారు.
విభజన సమస్యలపై ఫోకస్
ఏపీలో 175 స్థానాల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అందుకోసం బలమైన అభ్యర్థులను వెతికేపనిలో ఉన్నామన్నారు. ఇప్పటికే పలువురు కీలక నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారన్నారు. వీరి ద్వారా మరికొంత మంది బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తోట చంద్రశేషర్ చెబుతున్నారు. మరోవైపు ఏపీ విభజన సమస్యలపైనే బీఆర్ఎస్ ఫోకస్ పెట్టిందన్నారు. గ్రౌండ్ లెవల్‌లోకి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇప్పటికే విశాఖలో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన భారీ సభకు ప్లాన్ చేస్తున్నారు.
స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సందర్శించి కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలిపేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ రావాలని ఉద్యోగుల సంఘాల నేతలు తోట చంద్రశేఖర్ ను విజ్ఞప్తి చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు ఆదివారం తోట చంద్రశేఖర్ ను కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సాధించుకోవడంలో తెలుగు ప్రజలు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోయిందని తోట చంద్రశేఖర్ అన్నారు.
విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని కూడా అదే స్థాయిలో నిలబెడతామన్నారు. ఏపీలో ఆస్తుల్ని యథేచ్ఛగా అమ్మేస్తుంటే రాష్ట్రంలోని ఏ పార్టీ నోరు మెదపడం లేదని విమర్శించారు. అదానీ గ్రూప్ కూడా గంగవరం పోర్టుకి అనుబంధంగా వైజాగ్ స్టీల్ ప్లాంటును దొడ్డి దారిన లాక్కోవాలని ప్రయత్నిస్తుందని చంద్రశేఖర్ ఆరోపించారు. ఒక నిర్ధిష్టమైన ప్రణాళికతో ఈ అరాచకానికి అడ్డుకట్ట వేస్తామని వివరించారు. రెండు రోజుల పాటు విశాఖలో పర్యటించి.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులకు సంఘీభావం తెలుపుతామని చంద్రశేఖర్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేస్తామన్నారు.