Visakha Tahsildar Murder: కన్వియన్స్ డీడ్ కోసమే తాసీల్దార్ హత్య.. చెన్నైలో నిందితుడి అరెస్ట్
06 February 2024, 8:36 IST
- Visakha Tahsildar Murder: విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన తాసీల్దార్ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విమానంలో పారిపోయిన నిందితుడిని చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు.
విశాఖపట్నం సీపీ రవిశంకర్ అయ్యన్నార్
Visakha Tahsildar Murder: ఏపీలో సంచలనం సృష్టించిన విశాఖపట్నం తాసీల్దార్ హత్య కేసులో నిందితుడిని పోలీసులు చెన్నైలో అరెస్ట్ చేశారు. హత్య జరిగిన మర్నాడు మధ్యాహ్నం వరకు విశాఖలో ఉన్న నిందితుడు విమానంలో బెంగుళూరు మీదుగా చెన్నై వెళ్లేందుకు ప్రయత్నించాడు. విమానాశ్రయంలో నిందితుడు తప్పించుకోడానికి కారణమైన వారిపై విచారణ జరుపుతున్నట్లు విశాఖ సీపీ ప్రకటించారు.
విశాఖ జిల్లాలో హత్యకు గురైన తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడిని చెన్నైలో పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారావును చెన్నైలో అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు.
ఏసీపీ త్రినాథ్ నేతృత్వంలో చెన్నై వెళ్లిన బృందం.. గంగారావును అదుపులోకి తీసుకొని రాష్ట్రానికి తీసుకొచ్చింది. విజయవాడలో స్థిరాస్థి వ్యాపారం చేసిన గంగారావు కొన్నేళ క్రితం విశాఖ వచ్చాడు. గతంలో హైదరాబాద్, విజయవాడల్లో ఐపీలు పెట్టిన కేసులు అతనిపై ఉన్నాయి. విశాఖలో ఓ స్థిరాస్థి వెంచర్‌కు సంబంధించిన అసైన్డ్ ల్యాండ్‌కు కన్వియన్స్ డీడ్ ఇచ్చే విషయంలో హత్య జరిగినట్టు పోలీసులు గుర్తించారు.
తాసీల్దార్ హత్యకు 'స్థిరాస్తి లావాదేవీలే కారణమని సీపీ స్పష్టం చేశారు".హత్య చేసిన తర్వాత నిందితుడు విమానంలో విశాఖ నుంచి బెంగళూరు వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో చెన్నై వెళ్లాడు. చెంగల్‌పట్టు నుంచి చెన్నై వెళ్తుండగా గుర్తించి పట్టుకున్నారు.
నిందితుడు విశాఖలో రియల్ ఎస్టేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్, విజయవాడలో చీటింగ్ కేసులతో పాటు వ్యాపారాల్లో రూ.5 కోట్ల వరకు నష్టపోయినట్లు గుర్తించామని అని సీపీ వివరించారు.
ఆర్ధిక లావాదేవీల నేపథ్యంలోనే..
విశాఖ రూరల్ మండలం తాసీల్దార్‌గా ఉన్న సనపల రమణయ్య ఎన్నికల నేపథ్యంలో విజయనగరం జిల్లాలోని బొండపల్లికి బదిలీ అయ్యారు. కొమ్మాదిలోని ఓ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తులో నివాసం ఉంటున్నారు. గత శుక్రవారం విజయనగరం బాధ్యతలు చేపట్టారు.
అదే రోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో ఫోన్ రావడంతో కిందకు వచ్చి అపార్ట్‌మెంట్ గేట్ వద్ద ఓ వ్యక్తిని కలిసినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదైంది. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో దుండగుడు ఇనుపరాడ్‌తో తహసీల్దార్‌పై ఒక్కసారిగా దాడి చేసి పరారయ్యాడు.
తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మృతి చెందారు
హత్య తర్వాత పరారైన నిందితుడిని చెన్నై పోలీసుల సహకారం తో నిందితుడ్ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. నిందితుడు విమానంలో బెంగుళూర్ పరారయ్యాడు. అక్కడి నుంచి బస్‌లో చెంగల్పట్టు వెళ్తుండగా పోలీసులు గుర్తించారు.
నిందితుడ్ని పట్టుకునేందుకు 10 పోలీసు బృందాలు శ్రమించాయని సీపీ వివరించారు. కంబైన్డ్ డీడ్ చేయడంలో ఎమ్మార్వో జాప్యం చేయడంతోనే చంపినట్లు నిందితుడు చెబుతున్నాడని పూర్తిగా విచారించాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. కన్వియన్స్ డీడ్ కోసం నిందితుడు రెవిన్యూ సిబ్బందికి పెద్ద మొత్తంలో నగదు ఇచ్చాడని ప్రచారం కూడా ఉంది. ఎన్నికల కోడ్ రావడంతో పని పూర్తి చేయకపోవడంపై వివాదం తలెత్తి ఉంటుందని అనుమానిస్తున్నారు.
హత్య జరిగిన రోజు రాత్రి విశాఖలోనే ఉన్న నిందితుడు శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలో విశాఖ నుండి బయలుదేరి బెంగళూరు వెళ్లాడని, అదే విమానంలో చెన్నై వెళ్లాల్సి ఉండగా పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో బెంగళూరులో దిగిపోయి అక్కడ నుంచి బస్సులో తమిళనాడులోని చెంగల్పట్టు వరకూ వెళ్లాడని తెలిపారు.
చెన్నై లోకల్ ట్రైన్‌లో వెళ్తుండగా సాంకేతికతతో విశాఖ నుంచి వెళ్లిన ప్రత్యేక బృందం అక్కడి పోలీసుల సహకారంతో అరెస్టు చేసిందని వివరించారు. కన్వియన్స్ డీడ్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ విషయంలో కొన్ని నెలలుగా తహశీల్దార్ రమణయ్య జాప్యం చేస్తుండటంతోనే హతమార్చాడని సిపి తెలిపారు.ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగు చూడాల్సి ఉంది.