తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nara Lokesh : నా తల్లిపై కూడా కేసు పెడతామని బెదిరించారు, కంటతడి పెట్టుకున్న లోకేశ్

Nara Lokesh : నా తల్లిపై కూడా కేసు పెడతామని బెదిరించారు, కంటతడి పెట్టుకున్న లోకేశ్

21 October 2023, 18:22 IST

google News
    • Nara Lokesh : చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని వేధించడమే సీఎం జగన్ ఎజెండా అని నారా లోకేశ్ ఆరోపించారు. తన తల్లిపై కూడా కేసు పెడతామని సీఐడీ బెదిరిస్తుందన్నారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని లోకేశ్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
నారా లోకేశ్
నారా లోకేశ్

నారా లోకేశ్

Nara Lokesh : తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్తకాదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టైన చంద్రబాబు సెప్టెంబర్ 10 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గైర్హాజరు నేపథ్యంలో తొలిసారిగా టీడీపీ జనరల్ బాడీ సమావేశానికి లోకేశ్ అధ్యక్షత వహించారు. చంద్రబాబు గురించి మాట్లాడుతూ లోకేశ్ కంటతడి పెట్టుకున్నారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని ప్రజల కోసమే ఆయన పోరాడారంటూ లోకేశ్ భావోద్వేగం చెందారు. తన తల్లి ఐటీ రిటర్న్స్ చూపి ఆమెపై కూడా కేసు పెడతామని సీఐడీ బెదిరించిందన్నారు. నా తల్లి ఏనాడైనా బయటకు వచ్చారా?, సేవా కార్యక్రమాలు తప్ప రాజకీయాలు నా తల్లికి తెలియదన్నారు. గవర్నర్ ను కలిసేందుకు కూడా నా తల్లి వెళ్లలేదన్నారు. నా తల్లి, భార్య కలిసి చంద్రబాబును చంపేందుకు కుట్రలు పన్నారంటూ మంత్రులు విమర్శిస్తున్నారన్నారు. నా తల్లి, భార్య కలిసి చంద్రబాబుకు భోజనంలో విషం కలుపుతారంటూ మంత్రులు అత్యంత దారుణంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనంలో విషం కలపటం, బాబాయిని లేపేయడం వంటివి జగన్ డీఎన్‍ఏ ఉన్నాయని లోకేశ్ అన్నారు.

టీడీపీకి సంక్షోభాలు కొత్తకాదు

"నా క‌ల‌లో కూడా ఇటువంటి ప‌రిస్థితి వ‌స్తుంది అని ఊహించ‌లేదు. టీడీపీ సంక్షోభాలు కొత్త కాదు. గతంలో ఏ కష్టం వచ్చినా మన అధినేతలు ఎన్టీఆర్, చంద్రబాబు ముందు ఉండి పోరాడేవారు. ఇందిరా గాంధీ క‌క్ష క‌ట్టి ఎన్టీఆర్ ని గ‌ద్దె దింపేస్తే, తెలుగుజాతి ఏక‌మై తెలుగుదేశం సైన్యమై పోరాడి నెల‌రోజుల్లో ఎన్టీఆర్ ను మళ్లీ సీఎంని చేశారు. నాటి పోరాటం వేరు, నేడు మ‌నం చేసే పోరాటం వేరు. ఇప్పుడు జ‌గ‌న్ అనే రాక్షసుడితో పోరాడుతున్నాం. త‌న కుటుంబాన్ని వ‌దిలి ప్రజ‌ల కోస‌మే 45 ఏళ్లు ప‌నిచేసిన నిస్వార్థ సేవ‌కుడు చంద్రబాబుని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ 43 రోజులుగా జైల్లో నిర్బంధించారు. శాంతియుతంగా పోరాడండి, అరాచ‌క‌పాల‌న‌ని అంత‌మొందించేందుకు ప్రజ‌ల్ని చైత‌న్యం చేయండి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. జ‌గ‌న్ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడ‌టానికి చంద్రబాబు- ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌లిసి పోరాడాల‌ని నిశ్చయించుకున్నారు" - నారా లోకేశ్

టీడీపీ-జనసేన కూటమికి 160 సీట్లు

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జ‌న‌సేన కూట‌మి 160 సీట్లు గెల‌వ‌బోతోందని నారా లోకేశ్ జోస్యం చెప్పారు. క‌ష్టాల్లో ఉన్న ప్రజ‌లకి భ‌రోసా ఇచ్చేందుకు చంద్రబాబు ప్రారంభించిన బాబు ష్యూరిటీ-భ‌విష్యత్తుకి గ్యారెంటీ న‌వంబ‌ర్ ఒక‌టి నుంచి రాష్ట్రమంతా ప్రారంభం కానుందని తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఆవేద‌న‌తో అశువులు బాసిన అభిమానుల కుటుంబాల‌ని ప‌రామ‌ర్శించి అండ‌గా నిలిచేందుకు నా త‌ల్లి భువ‌నేశ్వరి త్వరలోనే 'నిజం గెలవాలి' అనే కార్యక్రమం ద్వారా మృతుల కుటుంబీకుల‌ను ప‌రామ‌ర్శిస్తారన్నారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర కూడా త్వర‌లోనే తిరిగి ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు.

చంద్రబాబును వేధించడమే జగన్ ఎజెండా

రాజ‌కీయ‌కక్ష సాధింపులో భాగంగా చంద్రబాబును అరెస్ట్ చేశారని లోకేశ్ ఆరోపించారు. చంద్రబాబును అరెస్టు చేస్తే టీడీపీ ఆగిపోతుంద‌నుకున్నారని, భ‌యం టీడీపీ బ‌యోడేటాలో లేదన్నారు. నాడు ఇందిరాగాంధీని లెక్కచేయ‌ని టీడీపీ, జ‌గ‌న్ ని లెక్క చేస్తుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుతో తీవ్ర ఆందోళ‌న‌కి గురై రాష్ట్ర వ్యాప్తంగా 157 మంది చనిపోయారని, ఆ కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే మీ జీవితాలు మార్చేస్తా అంటే ప్రజలు జగన్ కు 151 సీట్లు ఇచ్చారని, కానీ 151 కూడా జగన్ సరిపోలేదన్నారు. టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్నారన్నారు. సీఎం అయిన మొదటి రోజు నుంచే వ్యవ‌స్థల్ని మేనేజ్ చేస్తూ జగన్ కక్ష సాధింపు మాత్రమే ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేత‌ల‌ను అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ ఎజెండా ఒక్కటే చంద్రబాబును, ఆయన కుటుంబ సభ్యులను వేధించడం అని ఆరోపించారు.

ఎల్లుండి టీడీపీ-జనసేన భేటీ

టీడీపీ-జనసేన పొత్తు కుదిరిందని లోకేశ్ తెలిపారు. అయితే టీడీపీ- జనసేన మధ్య విభేదాలు సృష్టించాలని అనేక రూపాల్లో వైసీపీ, పేటీఎం గ్యాంగులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఫేక్ అకౌంట్స్ ద్వారా నాయకుల్ని కించపరుస్తూ అనేక ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు అయ్యిందని, ఎల్లుండి జ‌రిగే టీడీపీ-జ‌న‌సేన స‌మావేశం అనంత‌రం ఉమ్మడి కార్యాచరణ ప్రక‌టిస్తామన్నారు. టీడీపీ-జ‌న‌సేన పోరాడ‌క‌పోతే రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వైసీపీ నేత‌ల‌ు పంచేసుకుంటారని విమర్శించారు. టీడీపీ-జ‌న‌సేన క‌లిసి 175 సీట్లకి 160 సీట్లు గెలుస్తామన్నారు.

తదుపరి వ్యాసం