తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kottu Vs Vellampalli : కొట్టు వర్సెస్ వెల్లంపల్లి, హంస వాహన సేవలోనూ వివాదం!

Kottu Vs Vellampalli : కొట్టు వర్సెస్ వెల్లంపల్లి, హంస వాహన సేవలోనూ వివాదం!

23 October 2023, 22:43 IST

google News
    • Kottu Vs Vellampalli : ఇంద్రకీలాంద్రి సాక్షిగా మంత్రి, మాజీ మంత్రి మధ్య మరో వివాదం మొదలైంది. హంసవాహనంపై వీఐపీలు, నేతలకు అనుమతి లేదని దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. హంస వాహనం ఎక్కిస్తేనే వస్తాయని, ఘాట్ పాసులు వెనక్కి పంపారు వెల్లంపల్లి.
హంస వాహనసేవలో వివాదం
హంస వాహనసేవలో వివాదం

హంస వాహనసేవలో వివాదం

Kottu Vs Vellampalli : ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడేళ్ల తర్వాత కృష్ణా నదిలో హంస వాహనసేవ నిర్వహించారు. అయితే ఈ విషయంలోనూ మంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య వివాదం నెలకొంది. అర్చకులు, అత్యవసర సిబ్బంది తప్ప హంసవాహనంలోకి మరెవరినీ అనుమితించవద్దని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. అయితే గతంలో హంసవాహన సేవలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈవో, కలెక్టర్‌ సహా వీఐపీలను అనుమతించేవారు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. హంసవాహన సేవ ఎక్కిస్తారని భావించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌... అందుకు అనుమతి లేదని తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిని తానే హంసవాహనం ఎక్కడంలేదని, వాహనం ఎక్కడానికి వెల్లంపల్లి ఏమైనా అర్చకులా? అయినా ఎవరి పాత్ర వాళ్లు పోషించాలని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

పాసులు వెనక్కి పంపిన వెల్లంపల్లి

హంసవాహన సేవలో అర్చక బృందానికి మాత్రమే కలెక్టర్ అనుమతి ఇచ్చారు. పండితులు, అర్చకులు, ఇతర సిబ్బంది సహా మొత్తం 31 మందికి హంసవాహనంపై ఎక్కేందుకు కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హంస వాహనం ఎక్కిస్తేనే తాను వస్తానంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ పట్టుబట్టారు. నేతలు, పాలకమండలి సభ్యులకు పాసుల జారీలో వివాదంతో హంసవాహనం ఎక్కేందుకు నేతలకు, వీఐపీలకు కలెక్టర్ అనుమతి నిరాకరించారు. ప్రజాప్రతినిధులకు ఘాట్ పాసులను మాత్రమే జారీ చేశారు. అయితే ఇవేం చేసుకోవాలంటూ ఘాట్ పాసులను వెల్లంపల్లి వెనక్కి పంపించేశారు. హంస వాహనంపైకి అనుమతి లేకపోవడంపై దుర్గగుడి ఛైర్మన్‌, సభ్యులు సైతం అసంతృప్త వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నామని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.

మధ్యలోనే వెళ్లిపోయిన మంత్రి , ఛైర్మన్

ఈ వివాదంపై మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. తెప్పోత్సవంలో భాగంగా హంస వాహనంలో విహారానికి వీఐపీలకు అనుమతి లేదని తెలిపారు. 31 మంది మాత్రమే హంస వాహనంలో అనుమతి ఉంటుందన్నారు. పండితులు, అర్చకులు, సిబ్బందికి మాత్రమే హంస వాహనంలో ఎక్కేందుకు అనుమతి ఇచ్చామన్నారు. మేమేమైనా పూజారులమా హంస వాహనం ఎక్కడానికి అంటూ మంత్రి కొట్టు సెటైర్లు వేశారు. అయితే తెప్పోత్సవం మధ్యలోనే మంత్రి కొట్టు, దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబు వెళ్లిపోయారు. మంత్రి, ఛైర్మన్‌ తీరుపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెప్పోత్సవం పూర్తికాక ముందే వెళ్లిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తదుపరి వ్యాసం