Vinayaka Mandapam Challan : వినాయక మండపాల ఏర్పాటుకు చలాన్లు, హోంమంత్రి అనిత క్లారిటీ
08 September 2024, 15:12 IST
- Vinayaka Mandapam Challan : ఏపీలో వినాయక మండపాల అనుమతికి చలాన్లు కట్టించుకున్నారని విమర్శలు వచ్చాయి. ఈ వివాదంపై హోంమంత్రి అనిత క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో రుసుములను పది రోజుల కిందటే రద్దు చేశామని హోంమంత్రి తెలిపారు. మండపాల ఏర్పాటు, ఏ ఒక్క అనుమతికి డబ్బులు చెల్లించనక్కర్లేదన్నారు.
వినాయక మండపాల ఏర్పాటుకు చలాన్లు, హోంమంత్రి అనిత క్లారిటీ
Vinayaka Mandapam Challan : ఏపీలో వినాయక మండపాల ఏర్పాటుకు రుసుములు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై హోంమంత్రి అనిత క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో వినాయక మండపాల ఏర్పాటుకు వసూలు చేసే వివిధ రకాల రుసుములన్నింటినీ పది రోజుల కిందటే రద్దు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం గణేష్ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం అమల్లోకి తీసుకొచ్చేటప్పుడు, జగన్ సర్కార్ హయాంలో నిర్ణయించిన రుసుములన్నీ అధికారులు ఇచ్చిన నోట్ ప్రకారం ప్రకటించామన్నారు. సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం నిర్ణయించిన విధానం రద్దు చేశామన్నారు. ఏ ఒక్క అనుమతికి డబ్బులు తీసుకోకూడదని స్పష్టం చేశామన్నారు. గణేష్ ఉత్సవ కమిటీలు ఏ ఒక్క అనుమతికి రూపాయి కూడా చెల్లించనక్కర్లేదని తెలిపారు.
వినాయక మండపాలకు ప్రభుత్వం ఎలాంటి చలాన్లు విధించట్లేదని హోంమంత్రి అనిత తెలిపారు. అయితే మండపాలకు చలాన్లు వసూలు చేసే జీవోను వైసీపీ ప్రభుత్వమే తీసుకు వచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయం రాగానే చలాన్లు వసూలు చేయొద్దని చెప్పారన్నారు. మరోవైపు పేటీఎం బ్యాచ్‌ను దింపి జగన్ విష ప్రచారం చేయిస్తున్నారని హోంమంత్రి మండిపడ్డారు. 2022లోనే వైసీపీ ప్రభుత్వం గణేష్ మండపాల చలాన్లకు సంబంధించిన జీవో ఇచ్చిందని తెలిపారు. తాము ఆ జీవోలో ఉన్న వాటిని చెప్పామంతే, కానీ, సింగిల్ విండో విధానంలోనే గణేష్ మండపాలకు అనుమతి ఇచ్చామన్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీ బోట్ల ఘటనపై అనుమానాలు ఉన్నాయని హోంమంత్రి అనిత చెప్పారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న బోట్లకు సంబంధించి సమగ్ర విచారణ జరుగుతోందన్నారు.
హోంమంత్రిపై హీరోయిన్ ఫైర్
వినాయక మండపాలకు చలాన్లు విధించడంపై బీజేపీ నాయకురాలు, హీరోయిన్ మాధవీలత మండిపడ్డారు. హోంమంత్రి అనితపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గణేశ్ మండపాల దగ్గర చిల్లర డబ్బులు ఏరుకోవడం ఏంటని నిలదీశారు. హిందువులు ముఖ్యంగా వినాయక భక్తులు భిక్షం వేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారన్నారు. అసలే గణేశుడికి ఆకలి ఎక్కువ, ఆయన కోసం వండే వాటిని తగ్గించి మీకు నాలుగు చిల్లర డబ్బులు వేస్తారు అంటూ తీవ్రంగా స్పందించారు. అందరూ మా పండగల మీద చిల్లర ఏరుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. సమాన ధర్మం అని చెప్పి మా మైక్ సెట్‌కి, మా గణేశ మండపాలకు, మా గణేష్ ఎత్తుకి డబ్బులెందుకో? అని ప్రశ్నించారు.
పడవల కేసు
కృష్ణా నదికి భారీ వరద వస్తున్న సమయంలో నాలుగు వైసీపీ రంగులున్న బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ బోట్లుపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. ఇవి గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్‍కు చెందిన పడవలుగా పోలీసులు గుర్తించారు. వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం ముఖ్య అనుచురుడు, సూరాయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్ అని టీడీపీ ఆరోపిస్తుంది. రాజధాని గ్రామాల్లో, నందిగం సురేష్ తో కలిసి నడిపిన ఇసుక మాఫియాలో కోమటి రామ్మోహన్ కీలకంగా వ్యవహరించారని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి గొల్లపూడికి చెందిన కోమటి రామ్మోహన్ రావు, అతడి ప్రధాన అనుచరుడుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.