తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan Delhi Tour : రేపు దిల్లీకి సీఎం జగన్, రెండ్రోజుల పర్యటన

CM Jagan Delhi Tour : రేపు దిల్లీకి సీఎం జగన్, రెండ్రోజుల పర్యటన

04 October 2023, 19:36 IST

google News
    • CM Jagan Delhi Tour : సీఎం జగన్ దిల్లీ టూర్ ఖరారైంది. రేపు, ఎల్లుండి రెండ్రోజుల పాటు దిల్లీలో పర్యటించనున్నారు.
సీఎం జగన్
సీఎం జగన్

సీఎం జగన్

CM Jagan Delhi Tour : సీఎం జగన్ రెండ్రోజుల పాటు దిల్లీలో పర్యటించనున్నారు. రేపు ఉదయమే సీఎం జగన్ దిల్లీకి వెళ్లనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి దిల్లీ వెళతారు. అక్కడ ఒకటో జన్‌పథ్‌ నివాసంలో రేపు రాత్రికి బస చేస్తారు. శుక్రవారం ఉదయం 9.45 గంటలకు ఒకటో జన్‌పథ్‌ నివాసం నుంచి విజ్ఞాన్‌ భవన్‌కు చేరుకుని వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. సీఎం జగన్ దిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోదీతో భేటీ అవుతారని సమాచారం.

రాష్ట్ర వ్యవహారాలు ప్రధాని దృష్టికి!

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబరు 6న దిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలిసే అవకాశం ఉంది. సీఎం జగన్ రెండు రోజుల పాటు దిల్లీలోనే ఉండి పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారు. ఈ సమావేశాలలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను వారితో చర్చిస్తారని తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల, కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన ఇతర బకాయిల వంటి అంశాలను సీఎం జగన్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను ప్రధాని, హోంమంత్రికి వివరించే అవకాశం ఉంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారాన్ని ప్రధాని, కేంద్ర హోంమంత్రితో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

చంద్రబాబు అరెస్టు, పవన్ వ్యవహారం

సెప్టెంబర్ 9న చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు సీఎం జగన్ వ్యక్తిగత పర్యటనలో లండన్ కు వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్ అయిన మూడు రోజుల తర్వాత ఆయన రాష్ట్రానికి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన వెంటనే బీజేపీ అగ్రనేతలను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. అయితే జాతీయ నేతల బిజీ షెడ్యూల్ కారణంగా ఆయనకు అపాయింట్‌మెంట్ లభించలేదు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏపీ సీఐడీ సేకరించిన ఆధారాలను సీఎం జగన్ కేంద్రంతో పంచుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాబోయే ఎన్నికలలో వైసీపీ గద్దె దింపడానికి టీడీపీతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకోవడంతో సీఎం జగన్ దిల్లీ టూర్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. అయితే సీఎం జగన్ దిల్లీలో ఎవరితో భేటీ అవుతారన్న సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

తదుపరి వ్యాసం