తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu Custody : చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ముగిసిన వాదనలు, తీర్పు రేపటికి వాయిదా

Chandrababu Custody : చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ముగిసిన వాదనలు, తీర్పు రేపటికి వాయిదా

21 September 2023, 19:00 IST

google News
    • Chandrababu Custody : చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. రేపు ఉదయం తీర్పు వెలువరిస్తామని కోర్టు తెలిపింది.
చంద్రబాబు
చంద్రబాబు

చంద్రబాబు

Chandrababu Custody : టీడీపీ అధినేత చంద్రబాబును ఐదు రోజులు కస్టడీ కోరుతూ సీఐడీ... విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు ముగిశాయి. కస్టడీ పిటిషన్ పై ఏసీబీ తీర్పు వాయిదా వేసింది. రేపు(శుక్రవారం) ఉదయం గం.10:30లకు తీర్పు వెలువరించనున్నట్లు కోర్టు తెలిపింది. స్కిల్ స్కాంలో పక్కా ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశామని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. చంద్రబాబును ఐదు రోజులు కస్టడీకి ఇస్తే మరిన్ని వాస్తవాలు తెలుస్తాయన్నారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉన్న దృష్ట్యా ఏసీబీ కోర్టు తీర్పు రేపటికి వాయిదా వేసింది. శుక్రవారం చంద్రబాబు క్వాష్ పిటిషన్ లిస్ట్ అయితే తీర్పు వాయిదా వేస్తానని ఏసీపీ కోర్టు జడ్జి తెలిపారు. క్వాష్ పిటిషన్ లిస్ట్ కాకపోతే శుక్రవారం తీర్పు వెలువరిస్తానన్నారు.

5 రోజుల కస్టడీ

చంద్రబాబును కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ల విచారణ ముఖ్యం కాదని ఏసీబీ కోర్టు అభిప్రాయపడింది. మొదట కస్టడీ పిటిషన్లపై విచారిస్తామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. అన్ని పిటిషన్లు ఒకేసారి విచారించాలని తనపై ఒత్తిడి చేయొద్దని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి విచారణ సందర్భంగా సూచించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబును 5 రోజుల పాటు విచారించాలని సీఐడీ భావిస్తోంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కస్టడీ పిటిషన్లను విచారించాలని సీఐడీ ఏసీబీ కోర్టును కోరింది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉన్నందున చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరుతోంది. మరోవైపు హైకోర్టులో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది.

హైకోర్టులో క్వాష్ పిటిషన్

తనపై పెట్టిన కేసు అక్రమమని, చట్ట విరుద్ధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం హైకోర్టు నుంచి క్వాష్ పిటిషన్ పై తీర్పు వస్తుందని భావించారు. కానీ ఎలాంటి తీర్పు రాకపోవడంతో... క్వాష్ పిటిషన్‌పై జడ్జిమెంట్ 25వ తేదీకి వాయిదా పడినట్లుగా ఓ న్యాయమూర్తి చెప్పినట్లు సమాచారం. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సీఐడీ తరఫున ముకుల్ రోహత్గి, రంజిత్ రెడ్డి, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు తరఫున సిద్థార్థ్ లూథ్రా, హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ఈ కేసులో చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ వర్తించదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. ఈ సెక్షన్ వర్తిస్తుందని చంద్రబాబు న్యాయవాది హరీశ్ సాల్వే వాదించారు. ఈ కేసులో వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. క్వాష్ పిటిషన్ పై తీర్పు అనంతరం కస్టడీ పిటిషన్ పై తీర్పు ఇస్తామని ఏసీబీ కోర్టు జడ్జి తెలిపారు.

తదుపరి వ్యాసం