Ayesha Meera Case: హత్య జరిగి 15 ఏళ్లు, ఇంకా దొరకని దోషులు-ఆయేషా మీరా కేసులో మళ్లీ దర్యాప్తు!
04 May 2023, 15:39 IST
- Ayesha Meera Case: ఆయేషా మీరా హత్య కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. కోర్టు ఆదేశాలతో ఈ కేసును సీబీఐ మరోసారి దర్యాప్తు చేస్తుంది.
ఆయేషా మీరా కేసు
Ayesha Meera Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయేషా మీరా హత్య కేసు ఎంత పెద్ద సంచలనమో తెలిసిందే. ఈ కేసులో కొన్నేళ్లపాటు జైలు శిక్ష అనుభవించి సత్యంబాబు నిర్దోషిగా విడుదల అయ్యాడు. ఈ కేసులో అసలు దోషులను పట్టుకునేందుకు సీబీఐ మరోసారి రంగంలోకి దిగింది. బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ అధికారులు మరోసారి దర్యాప్తు చేపట్టారు. ఆయేషా మీరా హత్య జరిగిన టైంలో నందిగామ డీఎస్పీగా ఉన్న ఎం.శ్రీనివాస్(ప్రస్తుతం తెలంగాణ జాయింట్ సీపీ) నుంచి ఈ కేసుకు సంబంధించి సీబీఐ సమాచారం సేకరిస్తోంది. ఆయేషా హత్య కేసులో సాక్షులుగా ఉన్న వారిని మరోసారి విచారణ చేస్తోంది. ఈ కేసులో నిజానిజాలు తేల్చాలని మృతురాలి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలతో సీబీఐ మళ్లీ దర్యాప్తు ప్రారంభించింది.
సత్యం బాబు అరెస్టు, విడుదల
2007 డిసెంబర్ 27న ఆయేషా మీరాను రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి అతి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య సంచలనం అవ్వడంతో ఒత్తిడి కారణంగా సత్యం బాబు అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల సమర్పించిన ఆధారాలతో కోర్టు అతడికి యావజ్జీవ శిక్ష విధించింది. చివరికి ఈ కేసులో సత్యంబాబును హైకోర్టు నిర్ధోషిగా తేల్చింది. దీంతో అసలు నిందితులు ఎవరో తేల్చాలని మృతురాలి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును కోర్టు సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా సీబీఐ విచారణ చేపట్టింది. ఆయేషా మీరా స్టే చేసిన హాస్టల్ వార్డెన్ ను పిలపించి విచారించింది.
తప్పుదోవ పట్టించింది వాళ్లే?
ఆయేషా మీరా హత్య కేసును ఐపీఎస్ అధికారులు ఆనంద్, ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తప్పు దోవ పట్టించారని ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సత్యంబాబును అరెస్ట్ చేసినా కోర్టులో నిర్దోషిగా తేల్చిందన్నారు. 2018 డిసెంబరులో సీబీఐ ఈ కేసుపై విచారణ చేపట్టిందని తెలిపారు. తమ దగ్గర ఉన్న అన్ని వివరాలు సీబీఐకి ఇచ్చామన్నారు. ఆనాడు రీ పోస్ట్‌మార్టం చేసేందుకు మతపెద్దలు అంగీకరించలేదని, ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో రీపోస్ట్‌మార్టం చేశారని గుర్తుచేశారు. మూడేళ్లుగా తమ బిడ్డ శరీర భాగాలు కూడా వెనక్కి ఇవ్వలేదని ఆవేదన చెందారు. సీబీఐ కూడా అవినీతిమయం అయిందని, అందుకే సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామన్నారు. అసలైన దోషులకు శిక్ష పడాలన్నదే తమ ఉద్దేశమని ఆయేషా మీరా తల్లి అన్నారు.