Vangaveeti Radha Marriage : వంగవీటి రాధా పెళ్లి ముహూర్తం ఖరారు - శుభలేఖ చూశారా..!
08 October 2023, 11:31 IST
- Vangaveeti Radha Marriage : మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కృష్ణ పెళ్లి ముహూర్తం ఖరారైంది. ఈనెల 22వ తేదీన పోరంకిలో వివాహ వేడుక జరగనుంది.
వంగవీటి వారసుడు పెళ్లి ముహూర్తం ఖరారు
Vangaveeti Radha Marriage : మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కృష్ణ పెళ్లి ముహూర్తం ఖరారు అయింది. నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి, అమ్మాణిల కుమార్తెతో సెప్టెంబర్ 3వ తేదీన రాధాకు నిశ్చితార్థమైంది. ఈనెల 22వ తేదీన పోరంకిలోని మురళి రిసార్ట్ లో వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లిల వివాహం 7.59 నిమిషాలకు జరగనుంది. కాగా.. వంగవీటి రాధాకృష్ణ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సెప్టెంబర్ 3వ తేదీన టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ నిశ్చితార్ధ వేడుక ఘనంగా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వంగవీటి మోహన రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణకు, నర్సాపురం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ జక్కం అమ్మానీ బాబ్జి దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లికి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. కొద్ది రోజుల క్రితం వీరువురూ కలిసి వంగవీటి రంగాకు నివాళులు అర్పిస్తున్న వీడియోలు సోషల్ మీడియలో చక్కర్లు కొట్టాయి.
వంగవీటి రాధా ఇటీవల జనసేనలో చేరనున్నారని విస్తృతంగా ప్రచారం జరిగింది. మరోవైపు గత నెలలో గోదావరిజిల్లాల్లో జరిగిన వారాహి యాత్ర సందర్భంగా నరసాపురంలో జక్కం బాబ్జీ ఇంట్లో పవన్ కల్యాణ్ బస చేశారు. ఈ నేపథ్యంలో రాధా కూడా జనసేనలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. వంగవీటి రాధా కృష్ణ విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున తొలిసారి 2004లో గెలిచారు. బీజేపీ అభ్యర్థి జగన్మోహన్ రాజును ఓడించి 26,711 ఓట్లతో విజయం సాధించారు. 2009లో కూడా ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగి ఉంటే సులువుగా గెలిచి ఉండేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారించినా వినకుండా అప్పట్లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు. వంగవీటి రాధా వైసీపీ నేతలతో సన్నిహితంగా ఉండడంతో ఆయన మళ్లీ వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. అయితే లోకేశ్ యువగళం యాత్రలో పాల్గొన్న వంగవీటి రాధా ఆ అనుమానాలకు చెక్ పెట్టారు.