తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఉత్త‌రాంధ్ర ఇల‌వేల్పు శంబ‌ర పోల‌మాంబ జాత‌ర తేదీలు ఖ‌రారు.. డిసెంబ‌ర్ 23 నుంచి జ‌న‌వ‌రి 29 వ‌ర‌కు జాత‌ర‌

ఉత్త‌రాంధ్ర ఇల‌వేల్పు శంబ‌ర పోల‌మాంబ జాత‌ర తేదీలు ఖ‌రారు.. డిసెంబ‌ర్ 23 నుంచి జ‌న‌వ‌రి 29 వ‌ర‌కు జాత‌ర‌

HT Telugu Desk HT Telugu

16 December 2024, 6:25 IST

google News
    • ఉత్త‌రాంధ్ర ఇల‌వేల్పు శంబ‌ర పోల‌మాంబ జాత‌ర తేదీలు ఖ‌రారయ్యాయి. డిసెంబ‌ర్ 23 నుంచి జ‌న‌వ‌రి 29 వ‌ర‌కు జాత‌ర‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా మ‌క్కువ మండ‌లం శంబ‌ర గ్రామంలో కొలువైన శంబ‌ర పోల‌మాంబ అమ్మ‌వారి జాత‌ర అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌ప‌నున్నారు.
ఉత్తరాంధ్రలో శంబరపోలామాంబ జాతర నిర్వహణ
ఉత్తరాంధ్రలో శంబరపోలామాంబ జాతర నిర్వహణ

ఉత్తరాంధ్రలో శంబరపోలామాంబ జాతర నిర్వహణ

ఉత్త‌రాంధ్రుల ఇల‌వేల్పు, ప్రజల ఆర్యాధ్య దేవ‌త శ్రీ శంబ‌ర పోలమాంబ అమ్మ‌వారి జాత‌ర తేదీలు రాష్ట్ర దేవ‌దాయశాఖ అధికారులు ఖ‌రారు చేశారు. డిసెంబ‌ర్ 23 నుంచి జ‌న‌వ‌రి 29 వ‌ర‌కు జాత‌ర నిర్వ‌హిస్తారు. పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా మ‌క్కువ మండ‌లం శంబ‌ర గ్రామంలో కొలువైన శంబ‌ర పోల‌మాంబ అమ్మ‌వారి జాత‌ర అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌ప‌నున్నారు. ప‌క్క రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఒరిస్సా నుంచి కూడా ల‌క్ష‌లాది మంది భ‌క్తులు ఈ జాత‌ర స‌మ‌యంలో శంబ‌ర పోల‌మ్మ‌వారిని ద‌ర్శించుకుంటారు. ప్ర‌భుత్వం త‌ర‌పున మంత్రి గుమ్మ‌డి సంధ్యారాణి అమ్మ‌వారికి అధికారిక పూజ‌లు, ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తారు.

కార్యక్రమాల నిర్వహణ ఇలా…

డిసెంబ‌ర్ 23న పెద్ద అమ్మ‌వారి స‌న‌ప చాటింపు

డిసెంబ‌ర్ 30న పెద్ద‌మ్మ‌వారిని గ్రామంలోకి తెచ్చేందుకు ముహూర్తం

జ‌న‌వ‌రి 6న పెద్ద‌మ్మ‌వారి తొలేళ్ల ఉత్స‌వం.

జ‌న‌వ‌రి 7న ప్ర‌ధాన ఉత్స‌వం.

జ‌న‌వ‌రి 8న అనుపోత్స‌వం, అదే రోజు శంబ‌ర పోల‌మాంబ అమ్మ‌వారు (చిన్న‌మ్మ వారు) పండ‌గ తెచ్చేందుకు చాటింపు.

జ‌న‌వ‌రి 13న పోల‌మాంబ అమ్మ‌వారిని గ్రామంలోకి తెస్తారు.

జ‌న‌వ‌రి 14న అమ్మ‌వారు గ్రామానికి చేరుకుని,చ‌దురుగుడిలో విశ్రాంతి తీసుకుంటారు.

జ‌న‌వ‌రి 14 నుంచి నుంచి 13 రోజుల పాటు పోల‌మాంబ అమ్మ‌వారు గ్రామంలో తిరువీధి చేస్తూ, భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇస్తారు.

జ‌న‌వ‌రి 27న తొలేళ్ల ఉత్స‌వం.

జ‌న‌వరి 28న సిరిమానోత్సవం.

జ‌న‌వ‌రి 29న అనుపోత్స‌వం

756 మంది పోలీసు సిబ్బందితో బందోబ‌స్తు

శంబ‌ర పోల‌మాంబ జాత‌ర‌కు 756 మంది పోలీసులు బందోబ‌స్తు నిర్వ‌హించ‌నున్నారు. అందులో ముగ్గురు డీఎస్పీలు, 14 మంది స‌ర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్లు, 42 మంది ఎస్ఐలు, మిగిలిన వారు కానిస్టేబుల్స్‌, హోం గార్డులు బందోబ‌స్తు నిర్వ‌హించ‌నున్నారు. జాత‌ర‌కు సంబంధించిన స‌మ‌చారం మైక్‌ల ద్వారా ప్ర‌కటించేందుకు ప‌బ్లిక్ అడ్ర‌స్ సిస్టం, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయ‌నున్నారు. అలాగే వంద‌లాది ప్ర‌త్యేక బస్సుల‌ను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. ప్ర‌త్యేక వైద్య శిబిరాలు, అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో అవ‌స‌ర‌మైన మందులు శిబిరాల్లో అందుబాటులో ఉంచ‌నున్నారు. ఫీడ‌ర్ అంబులెన్సులు ఏర్పాటు చేస్తారు. నిరంత‌ర విద్యుత్ స‌ర‌ఫ‌రా చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

శంబ‌ర పోల‌మాంబ చ‌రిత్ర ఏమిటి?

క‌ళింగ ఆంధ్రుల ఆరాధ్య దైవం, ఉత్త‌రాంధ్రుల క‌ల్ప‌వ‌ల్లిగా విర‌జిల్లుతున్న శ్రీ శంబ‌ర పోల‌మాంబ జీవిత చ‌రిత్ర ఆశ్య‌ర్య‌క‌రంతో పాటు ఆస‌క్తిని కూడా క‌లిగిస్తుంది. మ‌హిమ స్వ‌రూపిణిగా, శ‌క్తి స్వ‌రూపిణిగా ఘ‌న‌త‌కెక్కిన శంబ‌ర గ్రామ దేవ‌త ఘ‌ట్టాల‌పై భిన్న‌మైన క‌థ‌లు ప్రాచుర్యంలో ఉన్న‌ట్లు చ‌రిత్ర‌కారులు చెబుతుంటారు. అమ్మ‌ల గ‌న్న అమ్మ, ముగ్గుర‌మ్మ‌ల మూల‌పుటమ్మ, ఆదిశ‌క్తి స్వ‌రూపిణి, పార్వ‌తీదేవి అవ‌తార‌మే పోలేశ్వ‌రి అని ప్ర‌తి ఏటా ల‌క్ష‌లాది మంది భ‌క్తులు మొక్కులు చెల్లించుకుని ముక్తి పొందుతారు.

తెలంగాణ ప్రాంతంలోని స‌మ్మ‌క్క‌-సార‌క్క, అన‌కాప‌ల్లిలోని నూకాలంబ‌, విజ‌య‌న‌గ‌రం పైడిత‌ల్లి అమ్మ‌వారి ఉత్స‌వాల మాదిరిగా శంబ‌ర పోల‌మ్మ సంబ‌రాలు ఘనంగా జ‌రుగుతాయి. పార్వ‌తీపురం జిల్లా మక్కువ మండ‌లం శంబ‌ర ప్రాంతం పూర్వం దండ‌కార‌ణ్య ప్రాంతంగా ఉండేది. శంబాసురుడ‌నే రాక్ష‌సుడు ఈ ప్రాంతాన్ని ప‌రిపాలించేవాడు. ఇత‌దూ మ‌హా ప‌రాక్ర‌మ‌వంతుడు. శంబాసుర రాక్ష‌స‌రాజు ప‌రిపాల‌న‌లో ఈ ప్రాంతం ఉండ‌టంతో ఈ ప్రాంతానికి శంబ‌ర అని పేరు వ‌చ్చింది. ఈయ‌న ప‌రిపాల‌న‌లో ప్ర‌జ‌లు, మునులు ఘోర‌మైన చిత్ర‌హింస‌లు అనుభ‌వించేవారు. రాక్ష‌స రాజు బారి నుంచి ర‌క్షించమ‌ని అప్ప‌టి ప్ర‌జ‌లు, మునులు శ‌క్తిస్వరూపిణిని వేడుకోవ‌డంతో ఆమె పోలేశ్వ‌రిగా అవ‌తార‌మెత్తి శంబాసుర రాక్ష‌సుడిని సంహ‌రించి సుఖం శాంతుల‌ను ఇచ్చింది. అప్ప‌టి నుండి పోలేశ్వ‌రి పోల‌మాంబ‌గా ప్రాచుర్యం పొందింది. ఈ ప్రాంత‌పు ఆరాధ్య దైవంగా పూజ‌లందుకొంటుంది.

పార్వ‌తీపురం జిల్లా సాలూరు ప‌ట్ట‌ణానికి 16 కిలో మీట‌ర్ల‌, మ‌క్కువ మండ‌ల కేంద్రానికి 6 కిలో మీట‌ర్లు దూరంలో గోముఖి న‌దీ ప‌రీవాహ‌క ప్రాంతంలోని శంబ‌ర గ్రామం ఉంటుంది. కొండ దొర‌ల కుటుంబంలో శ‌క్తి స్వరూపిణిగా పోల‌మాంబ అవ‌తిరించింది. సుమారు నాలుగు వందల ఏళ్ల క్రితం స్వ‌ర్గీయ పృకాపు అప్ప‌న్న దొర దంప‌తుల‌కు పోలేశ్వ‌రి జ‌న్మించింది. ఆవ‌తార‌మూర్తి అగుట‌చే ఆమె మెరుపుతీగ వ‌లే దేవ‌తా స్త్రీవ‌లే గ్రామాస్తుల మ‌ధ్య బాల్యం నుంచి ప్ర‌త్యేక జీవ‌న విధానాన్ని క‌ల‌బ‌రిచింది. ఇంట్లో ప‌ని ఎప్పుడు ముగించేదో ఎవ‌రికీ అంతుబ‌ట్టేది కాదు. త‌ల్లిదండ్రుల‌కు, చిన్ననాటి నుంచి త‌నతో పెరిగిన మేన‌త్త‌కు త‌ప్ప ఆమె ఎవ్వ‌రికంట క‌నిపించేదుకు నిరాక‌రించేది. స్ప‌ష్టంగా ఆమెను ఎవ‌రూ చూడ‌లేక‌పోయేవారు. యుక్త వ‌య‌సు వ‌చ్చేవ‌ర‌కు ఇదే మాదిరిగా వైవిధ్య‌మైన జీవన విధానంత ఉన్న ఆమెను ప‌లు ప్రాంతాల ప్ర‌జ‌లు భ‌క్తిభావాల‌తో కీర్తించ‌డం ప్రారంభించారు.

పోలేశ్వ‌రికి యుక్త వ‌య‌స్సు రావ‌డంతో ఆమెకు వివాహం చేయాల్సిన బాధ్య‌త త‌ల్లిదండ్రుల‌కు ఉంది. అయితే కుమార్తె జీవ‌న విధానంలో ఆమె మాన‌వ స్త్రీ కాద‌ని వారు తెలుసుకున్నారు. అందువ‌ల్ల ఆమె వివాహం ఎలా జ‌రుగుతుందోన‌ని ఆదిశ‌క్తి స్వ‌రూపిణిపైనే భారం వేశారు. ఆ రోజుల్లో శంబ‌ర గ్రామ మున‌స‌బుగా గిరడ చిన్నంనాయుడు ఉన్నారు. ఒక‌నాడు నీలాటిరేవున ఆయ‌న ప‌ళ్లు తోముకుంటున్నారు. ఆ స‌మ‌యంలో మోభాసా మామిడిప‌ల్లికి చెందిన కొండ‌దొర కుల‌స్తులు ఆ గ్రామ పెద్ద‌ల‌తో క‌లిసి పెళ్లి సంబంధం విష‌య‌మై మరొక ప‌ట్ట‌ణానికి ప్ర‌యాణం చేస్తున్నారు. నీలాట రేవున శంబ‌ర మున‌స‌బు వారికి ఎదుర‌వ్వ‌డంతో కుశ‌ల‌ప్ర‌శ్న‌లు సంభాష‌ణ‌లో పోలేశ్వ‌రీ గుణ‌గ‌ణాలను తెలుసుకున్నారు. అంత‌టితో వారి ప్ర‌యాణాన్ని విర‌మించుకొని పేకాపు అప్ప‌న్న‌దొర ఇంటికి వెళ్లి లాంచ‌న ప్రాయంగా పోలేశ్వ‌రిని త‌మ కోడ‌లుగా చేసుకునేందుకు సంబంధం ఖాయం చేసుకున్నారు.

పోలేశ్వ‌రి వివాహ ల‌గ్నం స‌మీపిస్తున్న కొల‌ది ఆ గ్రామ మున‌స‌బు చిన్నంనాయుడుతో పాటు చుట్టుప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌లు ఈ సారైనా ఆమెను చూడొచ్చ‌ని ఎంతో ఆనందించారు. అయితే వారికి నిరాశే ఎదురైంది. వివాహ లాంఛ‌నాల‌కు ఆమె ఒప్పుకోలేదు. గృహ జీవ‌నానికి తాను పెళ్లిచేసుకోవ‌డం లేద‌ని, ముత్తైదువ‌గా తాను నిర్వ‌హించాల్సిన మ‌హాకార్యం ఒక‌టి ఉంద‌ని త‌ల్లిదండ్రుల‌కు ఆమె తెలిపింది. ఎప్పుడూ వేదాంత ధోర‌ణిగా మాట్లాడే కుమార్తె మాటల్లోని మ‌ర్మాన్ని త‌ల్లిదండ్రులు గ్ర‌హించ‌లేక‌పోయారు. వివాహ మూహూర్త స‌మ‌యంలో పెళ్లి పీట‌ల‌పై ఆమె కూర్చొన‌క పెళ్లి కుమారుడి ముట్టిన మంగ‌ళ‌సూత్రాలు, పూల‌దంశ‌ను ఒక పుణ్య‌స్త్రీతో తెప్పించుకొని ధ‌రించింది. అలా ఆమె ఉత్త‌రాంధ్రుల ఇల‌వేల్పు అయింది.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం