Bengal Student Suicide: విశాఖలో బెంగాల్ విద్యార్ధిని మృతిపై దర్యాప్తు ముమ్మరం
31 August 2023, 13:25 IST
- Bengal Student Suicide: విశాఖలో ఆత్మహత్య చేసుకున్న బెంగాల్ విద్యార్దిని రితీసాహా ఆత్మహత్య కేసులో ఏపీ, బెంగాల్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బెంగాల్ సిఐడి కూడా కేసు నమోదు చేయడంతో విశాఖలో దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖలో ఆత్మహత్య చేసుకుని నీట్ విద్యార్ధిని రితీసాహ
Bengal Student Suicide: నీట్ శిక్షణ కోసం కోల్‌కత్తా నుంచి విశాఖపట్నం వచ్చి చదువుకుంటున్న రితీసాహ వ్యవహారం మిస్టరీగా మారింది. కేసు దర్యాప్తును స్థానిక పోలీసులు తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ విద్యార్ధిని తల్లిదండ్రులు బెంగాల్ సిఎం మమతా బెనర్జీకి ఫిర్యాదు చేయడంతో అక్కడి పోలీసులు కేసులు నమోదు చేశారు. విద్యార్దిని ఆత్మహత్య వ్యవహారంలో ఏపీ పోలీసుల వైఖరిపై విద్యార్ధిని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేయడం, బెంగాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
రితీ సాహ ఆత్మహత్యపై బెంగాల్ ప్రభుత్వం ఒత్తిడితో దర్యాప్తు అధికారులపై ఇప్పటికే వేటు పడింది. సిఐ, ఎస్సైలను ఏపీ ప్రభుత్వం విఆర్‌కు పంపింది. జులై 12న హాస్టల్ భవనం పై నుంచి కిందపడి రితీసాహ గాయపడింది. సిసిటివిల్లో విద్యార్ధిని ట్యాబ్‌తో పైకెళ్లేపుడు ఒక డ్రెస్ ధరించి ఉండగా భవనంపై నుంచి కిందపడిన సమయంలో మరో డ్రెస్‌లో ఉంది.
విద్యార్ధిని తల్లిదండ్రులు బెంగాల్ నుంచి వచ్చేసరికి పోస్టుమార్టం పూర్తి చేయడం, వారి నుంచి విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్నట్లు సంతకాలు చేయించడంపై విద్యార్ధిని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపింది. ఆకాష్ బైజూస్‌లో నీట్ శిక్షణ పొందుతున్న బాలిక అనుమానస్పద స్థితిలో చనిపోవడం కేసును తారుమారు చేయడానికి పోలీసులు ప్రయత్నించడంతో ఏమి జరిగిందనే దానిపై విచారణ మొదలైంది.
గురువారం విశాఖపట్నం సాధన హాస్టల్లో పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో భవనం పైనుంచి దూకిన తర్వాత రితీసాహ బతికే ఉన్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. చనిపోవడానికి ముందు బాలికను హాస్టల్ సమీపంలో ఉన్న వెంకటరామ ఆస్పత్రికి తరలించినట్లు గుర్తించారు. ఆ సమయంలో ఆమె స్పృహలోనే ఉంది. బాలిక ఒంటిపై గాయాలు లేకపోయినా అంతర్గత అవయవాలు దెబ్బతిని ఉంటాయని అనుమానిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో విశాఖపోలీసులు, కాలేజీ యాజమాన్యం, హాస్టల్ సిబ్బంది వైఖరి అనుమాస్పదంగా ఉండటంతో రెండు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించారు.
బాలిక గాయపడిన విసయాన్ని వెంటనే తల్లిదండ్రులకు ఎందుకు చెప్పలేదని బెంగాల్ పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరోవైపు హాస్టల్ వార్డెన్ బాలిక విపరీత ధోరణితో ఉండేదని పోలీసులకు వివరించినట్లు చెబుతున్నారు. సహ విద్యార్ధులతో ఘర్షణ పడటం, చేతులు కోసుకోవడం వంటి పనులు చేసేదని వివరించారు.ఈ విషయాలు తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లారో లేదో నిర్ధారించుకోనున్నారు. మరోవైపు బాలిక పోస్టుమార్టం సమయంలో పోలీసుల వైఖరికి సంబంధించిన అనుమానాస్పద చర్యల్ని కూడా పరిశీలించనున్నారు.