తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bengal Student Suicide: విశాఖలో బెంగాల్‌ విద్యార్ధిని ఆత్మహత్య.. మమతబెనర్జీ ఒత్తిడితో స్థానిక పోలీసులపై వేటు?

Bengal Student Suicide: విశాఖలో బెంగాల్‌ విద్యార్ధిని ఆత్మహత్య.. మమతబెనర్జీ ఒత్తిడితో స్థానిక పోలీసులపై వేటు?

HT Telugu Desk HT Telugu

23 August 2023, 9:03 IST

google News
    • Bengal Student Suicide: విశాఖపట్నంలో నీట్‌ శిక్షణ కోసం వచ్చిన పశ్చిమ బెంగాల్‌ విద్యార్ధిని అనుమానస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై విచారణ కోసం బెంగాల్ ప్రభుత్వం ఒత్తిడి పెంచడంతో ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు పడినట్టు తెలుస్తోంది.
విశాఖపట్నంలో బెంగాల్‌ విద్యార్ధిని ఆత్మహత్య
విశాఖపట్నంలో బెంగాల్‌ విద్యార్ధిని ఆత్మహత్య

విశాఖపట్నంలో బెంగాల్‌ విద్యార్ధిని ఆత్మహత్య

Bengal Student Suicide: విశాఖపట్నంలో నీట్‌ లాంగ్‌ టర్మ్ కోచింగ్‌ కోసం వచ్చిన బెంగాల్‌ విద్యార్ధిని అనుమానస్పద స్థితిలో మరణించడం దుమారం రేపుతోంది. విశాఖలోని నెహ్రూబజార్‌ ప్రాంతంలో ఉన్న ప్రయివేటు కాలేజీ హాస్టల్‌లో మేడపై నుంచి పడి కోల్‌కతాకి చెందిన ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. బాలిక మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తూ బెంగాల్‌ ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో ఈ కేసు మలుపులు తిరుగుతోంది.

తమ కుమార్తె విశాఖలో హత్యకు గురైందంటూ విద్యార్థిని తల్లిదండ్రులు బెంగాల్‌ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో బెంగాల్‌ సిఎం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. బెంగాల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడారు. స్థానిక పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు.

బాలిక చనిపోయిన ఫోర్‌ టౌన్‌ పోలీసులు విద్యార్థిని మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించి కేసు నమోదు చేసి తాము అక్కడకు వెళ్లక ముందే హడావిడిగా పోస్టుమార్టం చేయించడంపై తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తంచేశారు. తమకు అన్యాయం జరిగిందంటూ వారు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి ఫిర్యాదు చేశారు. బాలిక కుటుంబానికి న్యాయం చేస్తామని మమత భరోసా ఇచ్చిఏపీ సర్కారుతో చర్చించాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు.

ఇదే సమయంలో విశాఖపట్నం ఫోర్‌ టౌన్‌ సీఐ, ఎస్‌.ఐలు కాలేజీ యాజమాన్యం నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొంది వాస్తవాల్ని తారుమారు చేసేందుకు ప్రయత్నించారని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో వారిపై కోల్‌కతాలో కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

కేసు దర్యాప్తుపై బెంగాల్‌ సర్కారు నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వస్తుండటంతో నిజానిజాలు వెలికి తీసేందుకు ఉన్నతాధికారితో దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక సిఐ, ఎస్సైలపై చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. బాలిక చనిపోయిన రోజు ఏమైంది, యువతి ఆత్మహత్య చేసుకుందా..? హత్య చేసి పై అంతస్తు నుంచి తోసేశారా? అనే విషయాలు తేలాల్సి ఉంది.

ఏం జరిగిందంటే….

నీట్‌ శిక్షణ కోసం విశాఖలోని ప్రైవేట్‌ కాలేజీలో చేరిన బెంగాల్‌ విద్యార్దిని జులై 16న భవనం పైనుంచి పడి చనిపోయింది. విశాఖ నరసింహ నగర్ లోని సాధనా హాస్టల్‌లో ఉంటున్న బాలిక జులై 16న చనిపోయింది. బైజూస్‌లో ఇంటర్ చదువుతున్న విద్యార్దిని రితీ సాహా అనుమానాస్పద స్థితిలో మరణించింది.

బెంగాల్ కు చెందిన రితీ సాహా ఆకాష్ బైజూస్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆకాష్ బైజూస్ కు అనుసంధానంగా ఉన్న సాధనా హాస్టల్ లో రితీ సాహా ఉంటోంది. బైజూస్ యాజమాన్యం హాస్టల్‌ను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నిర్వహిస్తోంది.

గత నెల 16న హాస్టల్ 4 వ అంతస్తు పై నుంచి దూకి చనిపోయిందని తల్లి తండ్రులకు సమాచారం అందింది. బెంగాల్ నుంచి వచ్చిన తల్లి తండ్రులకు హాస్టల్ సిబ్బంది, పోలీసులు పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. బాలిక నాలుగో అంతస్తు పైకి వెళ్ళే సమయంలో ఒక డ్రెస్ లో ఉన్నట్టు హాస్టల్ సీ సీ పుటేజ్ లో కనిపించింది. మృతదేహం కింద పడి ఉన్న మృత దేహం పై మరో కలర్ డ్రెస్ ఉన్నట్టు ఆ భవనానికి ఎదురుగా ఉన్న బిల్డింగ్ సీసీటీవీ ఫుటేజ్‌లో ఉన్నట్టు మృతు రాలి తల్లి తండ్రులు చెప్తున్నారు. ఆ విషయాన్ని పోలీసులకు చెబితే పట్టించుకోవడం లేదని అనుమానాలు వ్యక్తం చేశారు.

బాలిక మృతి వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బెంగాల్‌ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో దక్షిణ కోల్‌కతాలోని నేతాజీ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న బాలిక తల్లిదండ్రులను ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి అరూప్ బిస్వాస్ గత ఆదివారం పరామర్శించారు.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా బాలిక తండ్రితో ఫోన్‌లో మాట్లాడి, ఆమె ప్రభుత్వం మరణంపై దర్యాప్తు చేస్తుందని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాల ప్రకారం 16ఏళ్ల వయసున్న తమ కుమార్తె చనిపోయినట్టు జులై 16న సమాచారం వచ్చిందని తెలిపారు.

కోల్‌కత్తా నుంచి విశాఖపట్నం వెళ్లిన తమను, తమ కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని స్టేట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా విశాఖపట్నం పోలీసులు ఒత్తిడి తెచ్చారని బాలిక తండ్రి మంత్రి బిశ్వాస్, ముఖ్యమంత్రిలకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలంటూ బాలిక కుటుంబం జూలైలో విజయవాడ హైకోర్టులో కేసు కూడా వేసింది.

“మరోవైపు మృతురాలి కుటుంబం ఫిర్యాదు ఆధారంగా స్థానిక నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో విశాఖపోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కేసు దర్యాప్తును అవసరమైతే బెంగాల్‌ రాష్ట్ర నేర పరిశోధన విభాగానికి అప్పగిస్తామని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆందోళన చెందుతున్నారని మంత్రి బిశ్వాస్‌ ప్రకటించారు.

మరోవైపు ఏపీలో జరిగిన విద్యార్దిని ఆత్మహత్యపై బెంగాల్‌లో కేసు నమోదు చేయడంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.ఏపీ సర్కారుపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు భావిస్తున్నారు. రితీ సాహా మృతి పై అనుమానస్పద మృతిగా సెక్షన్ 174 ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్టు డీసీపీ విద్యాసాగర్‌ నాయుడు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక అందాల్సి ఉందని, నివేదికను బట్టి తదుపరి విచారణ ఉంటుందన్నారు.

తదుపరి వ్యాసం