తుంగభద్ర కళకళ...... రాయలసీమ రైతాంగంలో సంతోషం
31 May 2022, 10:01 IST
- అకాల వర్షాలు, వరదలతో తుంగభద్ర జలాశయం ఎన్నడూ లేని విదంగా మే నెలలోనే గరిష్ట మట్టానికి చేరుకుంది. కర్ణాటకలోని హోస్పేటలో ఉన్న తుంగభద్ర జలాశయంలో మునెపెన్నడు లేని విధంగా వేసవిలో నీటి నిల్వలు అందుబాటులోకి రావడంతో రాయలసీమలో హర్షం వ్యక్తమవుతోంది. జూన్, జులైలలో నిర్ణీత సమయానికి కర్నూలు, అనంతపురం జిల్లాలకు సాగునీటిని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.
నిండుకుండలా తుంగభద్ర జలాశయం
ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల రైతాంగం ఈ ఏడాది ఆనందంగా ఉంది. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా మే నెలలోనే తుంగభద్ర జలాశయం నీటితో నిండటంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. మే నెలలో ఎగువున కురిసిన వర్షాలతో తుంగభద్రకు భారీగా నీరు చేరింది. ప్రస్తుతం తుంగభద్రలో 37.43టిఎంసిల నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి తుంగభద్రలో 8.53 టిఎంసిల నీరు మాత్రమే ఉంది. పదేళ్ళ సగటు పరిశీలిస్తే ఏటా మే నెలలో 7.55టిఎంసిల నీరు మాత్రమే తుంగభద్రలో ఉండేది. తుంగభద్ర జలాశయానికి గత మూడు దశాబ్దాల కాలంలో మే నెలలో ఈ స్థాయిలో వరద ప్రవాహం ఎన్నడూ రాలేదు. గత కొద్ది రోజులుగా తుంగభద్ర ఎగువున కురుస్తన్న వర్షాలతో జలాశయానికి గరిష్టంగా 70వేల క్యూసెక్కుల వరకు నీరు వచ్చి చేరుతోంది. సోమవారం సాయంత్రానికి ఇన్ ఫ్లో 2700క్యూసెక్కులకు తగ్గినా రుతుపవనాల రాకతో మళ్లీ వర్షాలు ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు.
ఈ సీజన్‌లో తుంగభద్ర నుంచి దాదాపు 418.45 టిఎంసిల నీటిని విడుదల చేయగా 304.26 టిఎంసిలు ఎగువ నుంచి వచ్చాయి. గత పదేళ్లలో సగటున తుంగభద్రకు వచ్చిన జలాలు 272.92 టిఎంసిలు మాత్రమే. 100.82 టిఎంసిల నీటి నిల్వ సామర్ధ్యమున్న తుంగభద్ర ప్రాజెక్టు గత ఏడాది మూడుసార్లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. 1633 అడుగుల నీటి మట్టంలో ప్రస్తుతం 1511 అడుగులకు నీటి నిల్వ చేరుకుంది. గత ఏడాది ఇదే రోజు 1588 అడుగుల నీటి మట్టం మాత్రమే రిజర్వాయర్‌లో ఉంది. తుంగభద్ర లో లెవల్ కెనాల్ నుంచి కర్నూలుకు నీటిని విడుదల చేసేందుకు ప్రస్తుత నీటి మట్టం సరిపోతుంది.
జలాశయంలో నీటి నిల్వ 9 టిఎంసిలకు మించి ఉంటే లో లెవల్ కెనాల్‌కు నీటి విడుదల సాధ్యమవుతుంది. అనంతపురం జిల్లాకు నీటిని విడుదల చేయాలంటే హై లెవల్ కెనాల్ నుంచి నీటి విడుదల చేయాల్సి ఉంటుంది. రిజర్వాయర్‌లో 29టిఎంసిలకు మించి నీటి నిల్వ ఉండాలి. తుంగభద్రలో 10టిఎంసిల నీటిని తాగునీటి అవసరాలకు నిల్వ ఉంచి 15 టిఎంసిల నీటిని సాగు అవసరాలకు విడుదల చేసే వీలుంది. దాదాపు 1.34 లక్షల ఎకరాలకు నీటిని అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. లోలెవల్ కెనాల్ పరిధిలో జూన్ 25 నుంచి నీటిని విడుదల చేయనుండగా, హై లెవల్ కెనాల్ పరిధిలో జులై 8 నుంచి అనంతపురం జిల్లాకు నీరు విడుదలయ్యే అవకాశముంది.
టాపిక్