Ontimitta Sri RamaNavami: ఒంటిమిట్టలో కోదండరాముడికి బ్రహ్మోత్సవాలు…
29 March 2023, 12:10 IST
Ontimitta Sri RamaNavami: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, టీటీడీ ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 9వ వరకు ఒంటమిట్టలో కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
ఒంటిమిట్టలో కోదండరాముడి బ్రహ్మోత్సవాలు
Ontimitta Sri RamaNavami: ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వారికి శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. శ్రీ కోదండరామస్వామివారి దేవాలయాన్ని దేవదాయ ధర్మాదాయశాఖ నుంచి 2015 సెప్టెంబర్ 9న తిరుమల తిరుపతి దేవస్థానం విలీనం చేసుకున్నది. ఈ ఏడది శ్రీ కోదండరామస్వామివారి క్షేత్రంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 09 వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు, అర్చన స్నపనాదులు, విశేషాలంకరణలు, డోలోత్సవములు సాయంకాలం వాహనసేవలు, స్వామివారికి కళ్యాణోత్సవము, రథోత్సవము, పుష్పయాగము, ఏకాంతసేవ జరుగనున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతిరోజు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులు ఉత్సవాలలో పాల్గొని కోదండ రామస్వామి కృపా కటాక్షములను పొందాలని టీటీడీ అధికారులు సూచించారు.
ఒంటిమిట్ట స్థలపురాణం….
దుష్టశిక్షణ కోసం, శిష్ట రక్షణ కొరకు అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు యుగ యుగాలలో అవతరిస్తుంటాడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడుగా అవతరించి దండకారణ్యంలో సీతా లక్ష్మణ సమేతుడై సంచరించాడు. సీతాదేవి దప్పిక తీర్చడానికి భూమిలోనికి బాణం వేయగా నీటి బుగ్గ పుట్టిందని, అదే ఒంటిమిట్టలోని రామతీర్థం అయిందని స్థలపురాణం ఉంది.
సీతాన్వేషణ కోసం, రావణ సంహారం కోసం శ్రీ రామచంద్రునికి సహకరించిన హనుమత్, సుగ్రీవాదులతో పాటు జాంబవంతుడున్నాడు. ఆయన ద్వాపర యుగంలోనూ ఉండి శ్రీ కృష్ణ భగవానునికి తన కూతురునిచ్చి పెండ్లి చేశాడని, ఆ జాంబవంతుడు సేవించిన సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుడే నేడు ఒంటిమిట్ట గుడిలో కొలువై ఉన్నాడని విశ్వసిస్తారు. ఒకే రాతిపై సీతా రామ లక్ష్మణ దేవతా మూర్తులుండడం వల్ల ఒంటిమిట్టను ఏకశిలానగరం అని కూడా అంటారు.
ఈ దేవాలయాన్ని మూడు దఫాలుగా నిర్మించారు. 14 శతాబ్దంలో ప్రారంభమై 17 శతాబ్దానికి పూర్తి అయినట్లు ఇక్కడ ఉన్న శాసనాలు తెలుపుతున్నాయి. ఉదయగిరిని పాలించిన కంపరాయులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్న సమయంలో వేట మీద జీవనం సాగించే వంటడు, మిట్టడు అనువారు కంపరాయలకు, ఆయన పరివారానికి శ్రీరాముడు సృష్టించిన బుగ్గ నీటితో దప్పిక తీర్చారని, కంపరాయలు ఈ ఇరువురి కోరికపై ఆలయం నిర్మించినట్లు శాసనాలు ఉన్నాయి.
క్రీ.శ.1356లో బుక్కరాయలు ఈ ఆలయాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత కాలంలో విజయనగరరాజులు, మట్లిరాజులు క్రమంగా గుడికి అంతరాలం, రంగమంటపం, మహాప్రాంగణం, గోపురాలు, రథం నిర్మించారు. ఒంటిమిట్ట చుట్టుప్రక్క గ్రామాల రాబడి ఆలయ కైంకర్యాలకు వినియోగించారు. వావిలి కొలను సుబ్బారావుగారు గోచీపెట్టుకొని, టెంకాయ చిప్ప చేతపట్టుకొని భిక్షాటన చేసి విరాళాలు సేకరించి శిథిలమైపోతున్న ఆలయ వైభవాన్ని తిరిగి తెప్పించారని టీటీడీ వివరిచింది.
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో 30వ తేదీ నుంచి ఏప్రిల్ 9వరకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
30-03-2023 - గురువార - శ్రీరామనవమి
31-04-2023 - శుక్రవారము- శేష వాహనం
01-04-2023- శనివారము - హంస వాహనము
02-04-2023- ఆదివారము - సింహ వాహనము
03-04-2023 సోమవారము - హనుమత్సేవ
04-04-2023 మంగళవారము - గరుడ సేవ
05-04-2023 - బుధవారము - కల్యాణోత్సవం
06-04-2023 గురువారము రథోత్సవం
07-04-2023 శుక్రవారము - ఏకాంతసేవ
08-04-2023 శనివారము చక్రస్నానం
09-04-2023 - ఆదివారము శ్రీ పుష్పయాగం