తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : తిరుమల ఘాట్ రోడ్డులో 'డ్రోన్' కలకలం

Tirumala : తిరుమల ఘాట్ రోడ్డులో 'డ్రోన్' కలకలం

13 January 2024, 6:41 IST

google News
    • Drone Seized at Tirumala : తిరుమలలో మరోసారి డ్రోన్‌ ఎగరటం కలకలం రేపింది. శుక్రవారం ఘాట్‌రోడ్డులో డ్రోన్ కనిపించటంపై టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు… ఆపరేట్ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.
తిరుమల ఘాట్ రోడ్డులో డ్రోన్
తిరుమల ఘాట్ రోడ్డులో డ్రోన్ (Twitter)

తిరుమల ఘాట్ రోడ్డులో డ్రోన్

Tirumala : తిరుమల... ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన హిందూ దేవాలయాల్లో ఒకటి. అధ్యాత్మిక నగరిగా విరసిల్లుతోంది. ప్రపంచం నలుమూలాల నుంచి భక్తులు వస్తుంటారు. అలాంటి తిరుగిరుల్లో భారీ భద్రత ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతుంది. తిరుమల కొండపై ఆంక్షలు కూడా అమల్లో ఉంటాయి. ముఖ్యంగా వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండను ‘నో ఫ్లై జోన్’ గా ప్రకటించారు. విమానాలు, హెలికాప్టర్లకు ఆ కొండ పైనుంచి ఎగిరేందుకు అనుమతి లేదు. ఆగమశాస్త్రం ప్రకారం కూడా శ్రీవారి ఆలయంపై ఎలాంటి వస్తువులు ఎగరడానికి అనుమతిలేదు. అలాంటింది తాజాగా మరోసారి డ్రోన్ కెమెరా కనబడటం కలకలం రేపింది. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ విచారణ జరుపుతోంది.

ఏం జరిగిందంటే…?

తిరుమలలోని ఘాట్‌రోడ్డులో 53వ మలుపు వద్ద ఈ డ్రోన్ గాల్లో కనిపించింది. దీన్ని హర్యానాకు చెందిన దినేశ్ కుటుంబం ఆపరేట్ చేస్తున్నట్లు తేలింది. శ్రీవారి మోకాలి మెట్టు, నడకమార్గం, అటవీ ప్రాంతాన్ని చిత్రీకరించారు. స్థానికులు గుర్తించి అనుమతి లేకుండా డ్రోన్‌ ఎగురవేయకూడదని సూచించినా వారు పట్టించుకోలేదు. తిరుమలకు వాహనాల్లో అలిపిరి తనిఖీ కేంద్రం మీదుగానే చేరుకోవాలి. అక్కడి భద్రతా సిబ్బంది వాహనాలు, లగేజీ స్కానింగ్‌ను చేస్తారు. తనిఖీ కేంద్రం మీదుగానే డ్రోన్‌ను తిరుమలకు తీసుకువచ్చినప్పటికీ బయటపడకపోవటం చర్చనీయాంశంగా మారింది .

ఇక డ్రోన్ కెమెరా సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేట్ చేసిన దినేశ్ ను అదుపులోకి తీసుకుని తిరుపతి పోలీసులకు అప్పగించారు. అయితే డ్రోన్ పూర్తిగా ప్లాస్టిక్ తో తయారు చేయటం కారణంగా… స్కానింగ్ దగ్గర గుర్తించటం సాధ్యపడలేదని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుందని టీటీడీ విజిలెన్స్ విభాగం తెలిపింది. దినేష్‌ ఆర్మీలో పని చేస్తున్నట్లు సమాచారం.

తదుపరి వ్యాసం