తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd : ఈ ఏడాది నాలుగు మాడ వీధుల్లో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

TTD : ఈ ఏడాది నాలుగు మాడ వీధుల్లో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

B.S.Chandra HT Telugu

10 September 2022, 13:56 IST

google News
    • కోవిడ్ వల్ల రెండేళ్ళుగా నాలుగు మాడ వీధుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించలేక పోయామని టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి తెలిపారు . సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వ తేదీ దాకా నాలుగు మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు . నాలుగు మాడ వీధుల్లో ఉండే ప్రతిభక్తుడికి సంతృప్తి కరంగా వాహన సేవల దర్శనం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు .
టీటీడీ ఈవో ధర్మారెడ్డి
టీటీడీ ఈవో ధర్మారెడ్డి

టీటీడీ ఈవో ధర్మారెడ్డి

సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 20న ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య సంప్రదాయబద్ధంగా ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. సెప్టెంబర్‌ 26న రాత్రి 7 నుండి 8 గంటల మధ్య అంకురార్పణ జరుగనుంది. సెప్టెంబరు 27న మొదటి రోజు సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల వరకు మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 9 నుండి 11 గంటల వరకు పెద్ద శేష వాహనం నిర్వహిస్తారు. ధ్వజారోహణం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

ప్రతిరోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామివారి వాహన సేవలు జరుగుతాయి. అయితే గరుడ వాహనం రాత్రి 7 నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు నిర్వహిస్తారు. అక్టోబర్‌ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 గంటలకు చక్రస్నానం, అదేవిధంగా రాత్రి 9 నుండి 10 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తారు..

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. భక్తుల రద్దీని దృష్ట్యా విఐపి బ్రేక్‌ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్‌ఆర్‌ఐలు, రక్షణ సిబ్బందికి ప్రత్యేక దర్శనం తదితర ప్రివిలేజ్డ్‌ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ప్రకటించారు.

ఆర్జిత సేవలు రద్దు….

ఆర్జిత సేవలు, రూ.300/- దర్శన టికెట్లతోపాటు శ్రీవాణి ట్రస్టు దాతలకు, ఇతర ట్రస్టుల దాతలకు దర్శన టికెట్లు రద్దు చేశారు. గదులకు సంబంధించి 50 శాతం ఆన్‌లైన్‌లో భక్తులు బుక్‌ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. తిరుమలలో గదుల లభ్యత పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు తిరుపతిలోనే గదులు పొంది బస చేయాలని విజ్ఞప్తి చేశారు. సాధారణ రోజుల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 9 నుండి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాదవితరణ ఉంటుందని ఈవో చెప్పారు.

బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుండి రాత్రి 11.30 గంటల వరకు అన్నప్రసాద వితరణ చేస్తారు. గరుడసేవనాడు రాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు. వాహనసేవల ముందు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి అపురూపమైన కళారూపాల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా, తిరుమల ఆస్థానమండపం, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి వద్ద సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

సనాతన హిందూ ధర్మ వ్యాప్తిలో భాగంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మత్స్యకార ప్రాంతాల్లో శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో సమరసత సేవా ఫౌండేషన్‌ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1342 ఆలయాల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు ఈవో చెప్పారు. మొదటి దశలో 502 ఆలయాల నిర్మాణం పూర్తయిందని ఇక్కడ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామన్నారు. ఈ ఆలయాల్లో హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో భజన సామగ్రి, ఈ ఆలయాల్లో అర్చకులుగా నియమించే వారికి శ్వేత ఆధ్వర్యంలో నిత్యపూజా విధానంపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

రెండో దశలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో రూ.10 లక్షల వ్యయంతో 111 ఆలయాలను నిర్మిస్తున్నామన్నారు. నమామి గోవింద బ్రాండ్‌తో టిటిడి తయారుచేస్తున్న 15 రకాల పంచగవ్య ఉత్పత్తులకు భక్తుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ఈవో చెప్పారు. అదేవిధంగా, అగరబత్తులను భక్తులు విశేషంగా కొనుగోలు చేస్తున్నారని, పంచగవ్య ఉత్పత్తులు, అగరబత్తుల విక్రయాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని గోశాల అభివృద్ధికి వినియోగిస్తున్నామన్నారు.

టిటిడి ఆలయాల్లో వినియోగించిన పుష్పాలను ఉపయోగించి డ్రైఫ్లవర్‌ టెక్నాలజీతో తయారుచేస్తున్న శ్రీవారి చిత్రపటాలు, కీచైన్లు, ఇతర ఉత్పత్తులను కూడా భక్తులు విరివిగా కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. తిరుమలకు వచ్చే భక్తులందరూ స్వామివారికి జరిగే నిత్య, వారోత్సవాలు, సేవలు తిలకించడం సాధ్యంకాదు. వయోభారం, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అనేక మంది స్వామివారిని ఎక్కువ సార్లు చూసి తరించే అవకాశం ఉండదని ఈవో వివరించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే నిత్య, వార సేవలు , ఉత్సవాలు ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను నిర్వహిస్తోందన్నారు.

అక్టోబరు 11 నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఎన్‌టిఆర్‌ స్టేడియంలో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి సేవలను తిలకించి ఆశీస్సులు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ఉచితంగా శస్త్ర చికిత్సలు….

చిన్నపిల్లలకు వచ్చే అనేక వ్యాధులకు ఉచితంగా శస్త్రచికిత్సలు, వైద్యసేవలు అందించడం కోసం భక్తుల విరాళాలతో శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి త్వరలో నిర్మాణం కానుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న చిన్నపిల్లల ఆసుపత్రిలో ఇప్పటివరకు 652 గుండె శస్త్రచికిత్సలు నిర్వహించి పేద పిల్లల ప్రాణాలు కాపాడామన్నారు. శ్రీవారి దయతో సుదూర ప్రాంతమైన బంగ్లాదేశ్‌ వంటి దేశాల నుండి తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొచ్చి ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించుకుని వెళ్లారన్నారు.

తిరుమలలో అన్నప్రసాదాల తయారీకి 2004వ సంవత్సరం నుండి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి దాదాపు 17 మంది దాతలు రూ.200 కోట్లకుపైగా విలువైన కూరగాయలను విరాళంగా అందించినట్లు ఈవో చెప్పారు. ప్రకృతి వ్యవసాయంతో కూరగాయలు పండించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

ఆగస్టు నెలలో శ్రీవారిని దర్శించుకున్న 22.22 లక్షలు మంది భక్తులు దర్శించుకున్నారు హుండీ కానుకల ద్వారా రూ.140.34 కోట్ల ఆదాయం లభించింది. 1.05 కోట్ల శ్రీవారి లడ్డూల విక్రయం జరిగింది. 47.76లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారు. 10.85లక్షల మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

తదుపరి వ్యాసం