TTD Calendars 2023: టీటీడీ క్యాలెండర్లు వచ్చేశాయ్.. ఇలా తీసుకోవచ్చు
23 December 2022, 22:05 IST
- TTD 2023 calendars: 2023 ఏడాదికి సంబంధించిన క్యాలెండర్లను విడుదల చేసింది టీటీడీ. ఈ మేరకు పలు నగరాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.
టీటీడీ క్యాలెండర్లు విడుదల
TTD Released 2023 Calendar: టీటీడీ క్యాలెండర్లు వచ్చేశాయి. ఈ మేరకు శుక్రవారం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి 6 షీట్లతో కూడిన కొత్త క్యాలెండర్లను విడుదల చేశారు. తిరుమలలోని చైర్మన్ క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో జేఈవో సదా భార్గవి, పీఆర్వో డాక్టర్ రవి, ప్రెస్ ప్రత్యేకాధికారి శ్రీ రామరాజు పాల్గొన్నారు. గతేడాది ముద్రించిన ఈ క్యాలండర్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఈసారి ముఖ్యమైన నగరాల్లో విక్రయాలకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ విషయంలో అధికారులకు టీటీడీ ఛైర్మన్ ఆదేశాలు ఇచ్చారు.
తిరుమల,తిరుపతిలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ క్యాలెండర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. చెన్నై,బెంగుళూరు, హైదరాబాద్,ఢిల్లీ తదితర నగరాల్లోని టీటీడీ సమాచార కేంద్రాల్లో రెండు రోజుల్లో విక్రయాలకు అందుబాటులో ఉంచునున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ న్‌లైన్, తపాలా శాఖ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. వివరాలకు 99639 55585, 0877–2264209 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు.
మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం శనివారం ఉదయం 9గంటలకు టికెట్లను విడుదల చేయనున్నారు. జనవరి 2వ తేదీ నుంచి 11 వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్‌లైన్ టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. రోజుకు 20వేలు చొప్పున 10 రోజులకు సంబంధించిన మొత్తం 2లక్షల టికెట్లను డిసెంబర్ 24న ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. టికెట్లు పొందిన వారిని మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తామని తితిదే అధికారులు స్పష్టం చేశారు.
ఈనెల 27న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని డిసెంబరు 27వ తేదీ మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. డిసెంబరు 27న ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు.
శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక8 పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.