Vaikunta Ekadasi In Tirumala : 27న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirumala Tirupati Devasthanam : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుమల శ్రీవారిని సందర్శించుకోలేని భక్తుల సౌకర్యార్థం.. శ్రీనివాసమంగాపురంలో వైకుంఠద్వార దర్శనం ఏర్పాటు చేస్తున్నారు.
జనవరి 2, 3వ తేదీలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. తిరుమల శ్రీవారిని సందర్శించుకోలేని భక్తుల సౌకర్యార్థం శ్రీనివాసమంగాపురంలో వైకుంఠద్వారం ఏర్పాటు చేయనున్నారు. 27న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది.
ఉదయం ఆరు నుంచి పది గంటల వరకూ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. ఆనంద నిలయం నుంచి బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్ ను వస్త్రంతో పూర్తిగా కప్పివేయనున్నట్టుగా టీటీడీ అధికారులు తెలిపారు. శుద్ధి అనంతరం ప్రత్యేక పూజాలు చేయనున్నారు.
జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 గంటల నుండి 12.30 గంటల వరకు తిరుపల్లచ్చితో శ్రీవారిని మేల్కొలుపుతారు. 12.30 నుండి 3.00 గంటల వరకు మూలవర్లకు తోమాల సేవ, కొలువు తదితర సేవలను నిర్వహిస్తారు. ఉదయం 2 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారు నాలుగు మాడ వీధుల్లో ఊరేగనున్నారు.
జనవరి 3వ తేదీ ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగించి, పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జనవరి 2, 3వ తేదీలలో ఆర్జిత కల్యాణోత్సవం సేవ రద్దు చేశారు.
భక్తుల సదుపాయం కోసం చలువపందిళ్లు, బారికేడ్లు, క్యూలైన్లు, వాహనాల పార్కింగ్, భక్తులకు సమాచారం తెలిపే ఫ్లెక్సీ బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.