తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Brahmotsavalu: గొడుగుల ఊరేగింపులో కానుకలు ఇవ్వొద్దని సూచించిన టీటీడీ

Tirumala Brahmotsavalu: గొడుగుల ఊరేగింపులో కానుకలు ఇవ్వొద్దని సూచించిన టీటీడీ

HT Telugu Desk HT Telugu

21 September 2023, 8:25 IST

google News
    • Tirumala Brahmotsavalu: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ జరిగే రోజు శ్రీవారిని అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
ముత్యపు పందిరి వాహనంపై తిరుమల శ్రీవారు
ముత్యపు పందిరి వాహనంపై తిరుమల శ్రీవారు

ముత్యపు పందిరి వాహనంపై తిరుమల శ్రీవారు

Tirumala Brahmotsavalu: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేసింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గొడుగులు సెప్టెంబరు 21న తిరుమలకు చేరుకుంటాయి.

ఘాట్ రోడ్ల‌లో ద్విచ‌క్ర‌వాహ‌నాల రాక‌పోక‌లు ర‌ద్దు

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబ‌రు 22న గరుడసేవ సందర్భంగా భ‌క్తులు పెద్ద సంఖ్యలో తిరుమ‌ల‌ చేరుకుంటారు. ఘాట్ రోడ్ల‌లో భ‌క్తుల భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబ‌రు 21వ తేదీ సాయంత్రం 6 గంట‌ల నుండి సెప్టెంబ‌రు 23వ తేదీ ఉదయం 6 గంట‌ల వ‌ర‌కు ద్విచ‌క్ర వాహ‌నాల రాక‌పోక‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

తిరుప‌తిలోని అలిపిరి పాత చెక్ పాయింట్ వ‌ద్ద ద్విచ‌క్ర వాహ‌నాలను పార్క్ చేసుకునే స‌దుపాయాన్ని టీటీడీ కల్పిస్తుంది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టీటీడీకి స‌హ‌క‌రించాల్సిందిగా విజ్ఞ‌ప్తి చేయ‌డ‌మైన‌ది.

ముత్యపుపందిరి వాహనంపై మలయప్ప…

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీవారు ముత్యపుపందిరి వాహనంపై మలయప్ప.. కాళీయమర్ధన అలంకారంలో భక్తులకు దర్శించారు.

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు బుధవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కలిసి కాళీయమర్ధన అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు స్వామివారిని వాహ‌న‌సేవ‌లో ద‌ర్శించుకున్నారు.

బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు రాత్రి మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగా పూనిన స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాలకింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది.

తదుపరి వ్యాసం