Tirumala Dams: రాయలసీమలో భారీ వర్షాలు… తిరుమలలో నిండుకుండల్లా జలాశయాలు.. 270రోజులకు సరిపడా నిల్వలు
04 December 2024, 13:43 IST
- Tirumala Dams: ఆంధ్రప్రదేశ్‌ను తరచూ పలకరిస్తున్న అల్పపీడనాలు, అకాల వర్షాలతో తిరుమల గిరుల్లోని జలాశయాలు నిండుకుండల్లా మారిపోయాయి. నిన్న మొన్నటి వరకు నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఓ దశలో తిరుపతి నుంచి తిరుమలకు నీటిని కూడా తరలించాల్సి వస్తుందని భావించినా ఇప్పుడా అవసరం లేకుండా పోయింది.
తిరుమలలో గరిష్ట స్థాయి నీటి మట్టానికి చేరుతున్న జలాశయాలు
Tirumala Dams: ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్ది వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలు రైతులకు నష్టాన్ని మిగిల్చినా తిరుమల గిరుల్లో మాత్రం నీటి కొరతను తీర్చేశాయి. ఏడు కొండలపై కురిసిన వర్షంతో అన్ని జలాశయాలు నిండుకుండల్లా తయారు అయ్యాయి.
ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్‌తో తిరుమలలో గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాల్లో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. ప్రస్తుత నీటి నిల్వలు తిరుమలకు 270 రోజుల తాగునీటి అవసరాలకు సరిపోతాయని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. గోగర్భం డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. మిగిలిన డ్యామ్‌లో 90శాతం నిండాయి.
మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి జలాశయాల నీటిమట్టం వివరాలు ఇలా ఉన్నాయి.
1) పాపవినాశనం డ్యామ్ :- 697.00 మీ.
FRL :- 697.14 మీ.
నిల్వ సామర్థ్యం :- 5240.00 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 5192.54 లక్షల గ్యాలన్లు.
2) గోగర్భం డ్యామ్ :- 2894.00 అడుగులు
FRL :- 2894.00 అడుగులు
నిల్వ సామర్థ్యం :- 2833.00 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 2833.00 లక్షల గ్యాలన్లు.
3) ఆకాశగంగ డ్యామ్ :- 864.50 మీ
FRL :- 865.00 మీ.
నిల్వ సామర్థ్యం :- 685.00 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 645.00 లక్షల గ్యాలన్లు.
4) కుమారధార డ్యామ్ :- 895.50.00 మీ.
FRL :- 898.24మీ.
నిల్వ సామర్థ్యం :- 4258.98 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 3440.32 లక్షల గ్యాలన్లు.
5) పసుపుధార డ్యామ్ :- 896.50 మీ.
FRL :- 898.24మీ.
నిల్వ సామర్థ్యం :- 1287.51 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 966.31 లక్షల గ్యాలన్లు.
తిరుమల కొండలపై ఉన్న ఐదు డ్యామ్‌లలో ఉన్న నీటితో 270రోజుల పాటు తిరుమల నీటి అవసరాలు తీరుతాయి. ఈ వేసవిలో భక్తులకు నీటి కష్టాలు ఉండకపోవచ్చు. కొద్ది రోజుల క్రితం వరకు తిరుమలలో నీటి ఎద్దడితో తిరుపతి నుంచి కొండపైకి నీటిని తరలించాలనే ప్రయత్నాలు కూడా చేశారు.